Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కట్టుబాట్లను ఎదిరించింది.. మానవ హక్కుల కోసం.. ముఖ్యంగా అమ్మాయిలు విద్యను పొందే హక్కు కోసం చిన్న వయసులోనే గొంతు విప్పింది. ''చదువుకోవడానికి నాకున్న హక్కును లాక్కోవడానికి తాలిబన్లు ఎవరు?'' అని సూటిగా ప్రశ్నించింది. అప్పుడు ఆమె వయసు పదకొండేండ్లు. ఆ ప్రశ్నే తాలిబాన్లను గడగడలాడించింది. ఆ ప్రశ్నే ఆమె తలలోకి ఓ బుల్లేట్ దూసుకెళ్ళేలా చేసింది. ఆ ప్రశ్నే జీవితాంతం అమ్మాయిలు, మహిళల హక్కులకై నిలబడే శక్తిని ఆమెకు ఇచ్చింది. ఆ ప్రశ్నే గ్లోబల్ ఐకాన్‌గా ఆమెను మార్చేసింది. ఆమే మలాలా యూసఫ్‌జారు. ఆమెలోని శక్తిని ప్రపంచవ్యాప్తంగా చేసేందుకు ఐక్యరాజ్యసమితి ఆమె పుట్టినరోజైన జులై 12ను మలాలా డేగా జరపాలని నిర్ణయించింది. 2013 నుండి ప్రతి సంవత్సరం గ్లోబల్ యాక్టివిజంలో ముఖ్యమైన రోజుగా ఈరోజు మారిపోయింది.
మలాలా యూసఫ్‌జారు 12 జూలై 1997న పాకిస్థాన్‌లోని మింగోరా ప్రాంతంలోని స్వాత్ లోయలో జన్మించింది. ఆమెది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి యూసఫ్‌జారు కవి, విద్యావేత్త, విద్యా కార్యకర్త. వామపక్ష ఉద్యమ ప్రభావం కూడా ఆయనపై ఉంది. కాన్పుకోసం ఆసుపత్రికి వెళ్లేందుకు వారివద్ద సరిపడా డబ్బు లేకపోవడంతో ఆమె తల్లి మలాలాను ఇంట్లోనే ప్రసవించింది. ప్రముఖ కవయిత్రి, ఉద్యమకారిణి మెయివాండ్ మలాలా పేరులోని మలాలాను యూసఫ్‌జారు తన కూతురికి పెట్టుకున్నాడు. ఆయన ఖుషాల్ పేరుతో అమ్మాయిల కోసం ఓ పాఠశాలను ప్రారంభించారు. ఖుషాల్ కూడా ఓ ప్రముఖ కవి పేరే. తండ్రి ప్రభావం మలాలాపై తీవ్రంగా ఉండేది. తన తమ్ముళ్ళు ఇద్దరూ నిద్రపోయినా తండ్రితో రాజకీయాల గురించి చర్చిస్తూనే ఉండేది. చిన్నతనం నుండి ఉర్దూ, ఆంగ్ల భాషలలో అనర్గళంగా మాట్లాడేది.
స్వాత్‌లోయలోని ఇంటింటికి తిరిగేది
అక్టోబర్ 2007లో తాలిబాన్ మిలిటెంట్లు లోయను స్వాధీనం చేసుకున్నారు. అనేక ఇతర ఆంక్షలతో పాటు బాలికలు విద్య మీద ఆంక్షలు విధించింది. వారికి విద్యను నిషేధిస్తూ అణచివేత పాలనను ప్రారంభించారు. 2009లో వందకు పైగా అమ్మాయిల పాఠశాలలను పేల్చివేశారు. బడికి వెళ్ళే బాలికనే కాదు, ఉపాధ్యాయులను కూడా బహిరంగంగా చంపడం మొదలుపెట్టారు. స్త్రీలు అడుగుబయట పెట్టకూడదనే ఆంక్షలు విధించారు. టీవీలు మూగబోయాయి. చదువంటే ఎంతో ఇష్టమైన మలాలా భరించలేకపోయింది. అక్కడి పరిస్థితులను తానెదుర్కుంటున్న సంఘటనలను వివరిస్తూ బీబీసీలో ఆమె బ్లాగు రాయడం ప్రారంభించింది. యుద్ధవాతావరణానికి ఏ మాత్రం తీసిపోని స్వాత్‌లోయలో సాధారణ ప్రజల జీవితం ఎలా ఉన్నదో ప్రపంచానికి తెలియజేసేందుకు బీబీసీని వేదిక చేసుకుంది. స్వాత్‌లోయ అనుభవాలను 'గుల్ మకారు'(జొన్న పువ్వు) అనే మారుపేరుతో డైరీ రూపంలో బీబీసీకి ఉర్దూలో రాసేది. అది తాలిబన్ల నెత్తుటి చరిత్ర అని చెప్పాలి. అంతే కాదు ఇంటింటికి తిరిగి తమ అమ్మాయిలను పాఠశాలకు పంపించమంటూ తల్లిదండ్రులను వేడుకునేది. వారిలో చైతన్యాన్ని నింపేది. చివరకు 2012లో బీబీసీలో మలాలా ప్రత్యక్షంగా కనబడి బాలికల విద్య, హక్కుల కోసం మాట్లాడింది. పదకొండు, పన్నేండ్ల అమ్మాయి ఇలా చేయడం తానిబన్లు జీర్ణించుకోలేకపోయారు.
డాక్టర్ కావాలనుకుంది
మాటుకాసిన ఆ ముష్కరులు 2012 అక్టోబరు, 9న పాఠశాల నుండి తిరిగి వస్తున్న మలాలా తలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఘోరంగా గాయపడిన ఆమె ముందు పెషావర్ వైద్యశాలలో చేరింది. పరిస్థితి విషమించడం, తాలిబన్ల నుండి ఆమెకు పొంచివున్న ప్రమాదాన్ని గ్రహించి మలాలాను యుకేకు తరలించారు. అక్క చికిత్స పొందిన తర్వాత, పదుల సంఖ్యలో అపరేషన్ల తర్వాత ఆమె ప్రాణాలతో బయటపడింది. అక్కడే ఉంటూ ఆమె తన చదువును కొనసాగించింది. మరణం అంచుల వరకు పోయి వచ్చినా మలాలా తన ఉద్యమాన్ని ఆపలేదు. తన ప్రశ్నలను సంధిస్తూనే ఉంది. అమ్మాయిల చదువు, హక్కుల కోసం మాట్లాడుతూనే ఉంది. మలాలా ఫండ్‌ను ఏర్పాటు చేసి కావల్సిన సహాయ సహకారాలను అందించడం మొదలుపెట్టింది. వాస్తవానికి మలాలా డాక్టర్ కావాలనుకుంది. కానీ సమాజంలోని అసమానతలు చూసిన తర్వాత మనిషి శరీరంలోని రోగాన్ని నయం చేసే వైద్యం కన్నా, మనిషి మెదడులోని రోగాన్ని నయం చేసే వైద్యం ఈ సమాజానికి చాలా అవసరమని గ్రహించింది. తండ్రి ప్రోత్సామంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది.
లింగ సమానత్వంపై ప్రసంగం
జులై 12, 2013న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మలాలా లింగ సమానత్వం గురించి ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది. 'ఎవరి మీదో ప్రతికారం తీర్చుకోవడం గురించి మాట్లాడటానికి రాలేదు. ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉంది. అది మాట్లాడేందుకు ఇక్కడ నిలబడ్డాను. సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతడిని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిసాలే నాకు ఆదర్శం. తాలిబన్లకు చదువు లేదు, అందుకే ఇలాంటి దుష్టకార్యాలకు పాల్పడుతున్నారు' అని ప్రకటించింది. తన శక్తివంతమైన ఆ ప్రసంగంలో, తీవ్రవాదులు విద్యకు భయపడుతున్నారని ఎత్తి చూపింది. మహిళలు తమ కోసం తాము పోరాడగలిగేలా స్వతంత్రంగా ఉండాలని అన్నది. ఆమె ప్రసంగానికి పెద్ద ఎత్తున ప్రశంసలు అందాయి. అప్పటి నుండే ఐక్యరాజ్యసమితి ఆమె పుట్టినరోజును 'మలాలా డే'గా ప్రకటించింది.
నోబుల్ బహుమతిని అందుకుంది
మలాలాపై కాల్పులు జరగగానే పాకిస్థాన్ ప్రజలతో పాటు, ప్రపంచంలో చాలా మంది ఆమెకు సంఘీభావం ప్రకటించారు. ఆమెపై కాల్పులు జరిగిన వార్త పెనుగాలిలా ప్రపంచాన్ని తాకగానే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మాండ్ అదే బహుమతికి మలాలా పేరును సిఫారసు చేశారు. అంటి పురస్కారం పరిశీలను ఎంపికైన పిన్న వయస్కురాలు మలాలాయే. అలాగే నోబెల్ బహుమతిని అందుకున్న రెండవ పాకిస్థానీ. అది అందుకునే నాటికి ఆమె వయసు పదిహేనేండ్లు మాత్రమే. అప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అందుకే ఆమె ప్రయాణం ఎంత స్ఫూర్తిదాయకమో, అంత విప్లవాత్మకం కూడా.
మనం కలిసి నిలబడి
2014లో నోబుల్ బహుమతి అందుకున్న సందర్భంగా ఆమె ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు విద్య అందించాల్సిన అవశ్యకత, ప్రాముఖ్యతను గురించి ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించింది. ప్రతీ చిన్నారి పాఠశాలకు వెళ్లాలని, అప్పటివరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది. ఆమె ప్రసంగాన్ని ఓస్లోలో జరిగిన వేడుకకు హాజరైన ప్రేక్షకుల విపరీతంగా ప్రశంసించారు. ఆమెకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. భారతదేశానికి చెందిన కైలాష్ సత్యార్థితో కలిసి మలాలా శాంతి బహుమతిని అందుకుంది. తన నోబెల్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ ''మనం కలిసి నిలబడి, ఒక భారతీయుడు, పాకిస్తానీ శాంతితో ఐక్యంగా ఉండవచ్చని, బాలల హక్కుల కోసం కలిసి పనిచేయగలమని ప్రపంచానికి చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది'' అని ఉద్వేగానికి లోనయ్యింది.
స్త్రీవాదినని గ్రహించింది
2016లో 'హి నేమ్డ్ మీ మలాలా' అనే డాక్యుమెంటరీ కోసం నటి ఎమ్మా వాట్సన్‌ను మలాలా కలిసింది. ఇద్దరు స్త్రీవాదం గురించి మాట్లాడుకున్నారు. మలాలా వాట్సన్‌తో 'ఫెమినిస్ట్' అనే పదం గురించి తనకు స్పష్టత లేదని చెప్పింది. స్త్రీ వాది అనేదానికి పాజిటివ్, నెగటివ్ రెండు అభిప్రాయాలనున్నాయని చెప్పుకొచ్చింది. ఫెమినిజం మీద వాట్సన్ వివరణ మలాలాకు విషయాలను స్పష్టం చేసింది. సమానత్వం అనే పదం ఉన్నందున తాను స్త్రీవాది అని మలాలా గ్రహించింది. మలాలా జీవిత చరిత్ర 'ఐ యామ్ మలాలా' పేరుతో ఇంగ్లీషులో రాగా, 'మై హూ మలాలా' పేరుతో హిందీలోకి, 'నేను మలాలా' పేరుతో తెలుగులోకి అనువదింపబడింది.
అస్సర్‌తో వివాహం
ప్రస్తుతం మలాలాకు 25 ఏండ్లు. 2021 నవంబర్‌లో మలాలా బర్మింగ్‌హామ్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆమె తన పెండ్లి వార్తను సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ''ఈ రోజు నా జీవితంలో ఒక విలువైన రోజు. అస్సర్ నేను జీవిత భాగస్వాములు కావడానికి కొంగులు ముడివేసుకున్నాం. మేము మా కుటుంబాలతో బర్మింగ్‌హామ్‌లోని ఇంట్లో నిఖాను జరుపుకున్నాం. దయచేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. జీవితాంతం కలిసి నడవాలన్న మా ప్రయాణాన్ని సంతోషంగా మొదలుపెడుతున్నాం'' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇప్పటికీ మలాలా ఎక్కడ మానవ హక్కులకు భంగం కలిగిన ప్రశ్నిస్తూనే ఉంది. లింగ సమానత్వం కోసం, అమ్మాయిల చదువుకోసం కృషి చేస్తునే ఉంది.
మలాలా జీవితంలో ముఖ్య ఘట్టాలు
మలాలా, 17 సంవత్సరాల వయసులో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. దానిని అందుకున్న అతి పిన్న వయస్కురాలు.
ఆమెపై హింసాత్మ క హత్యాయత్నం తర్వాత పాకిస్తాన్ మొదటి విద్యా హక్కు బిల్లును రూపొందించింది.
12 జులై 2013న, మలాలా ఐక్యరాజ్యసమితిలో పిల్లల విద్యా హక్కు గురించి మాట్లాడుతున్నప్పుడు అందరి గొంతూ మూగబోయింది.
ఇప్పటి వరకు మలాలా చేసిన కృషికి, చూపిన ధైర్యానికి 40కి పైగా అవార్డులు, గౌరవాలను అందుకుంది. యూనివర్శిటీ ఆఫ్ కింగ్స్ కాలేజీ ఆమెకు 2014లో గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
మలాలాకు 18 ఏండ్లు వచ్చినప్పుడు ఆమె సిరియన్ శరణార్థుల కోసం బాలికల పాఠశాలను ప్రారంభించింది. బుల్లెట్లు కాకుండా పుస్తకాలు అందించాలని ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులకు పిలుపునిచ్చింది.
2015లో ఒక గ్రహశకలానికి మలాలా అని పేరు పెట్టారు.
మలాలా ఇచ్చిన నినాదాలు
ఒక బిడ్డ, ఒక ఉపాధ్యాయుడు, ఒక పెన్, ఒక పుస్తకం ప్రపంచాన్ని మార్చగలవు.
కొంతమంది ఇతరులను మాత్రమే ఏదైనా చేయమని అడుగుతారు. నేను వేరొకరి కోసం ఎందుకు వేచి ఉండాలి? నేనెందుకు ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళకూడదు?
మన మనసులను మాత్రమే కాకుండా మన హృదయాలను, మన ఆత్మలను కూడా విద్యావంతులను చేయడం ద్వారా ప్రపంచ శాంతిని సృష్టించగలం. దానికి ఉన్న ఏకైక మార్గం చదువు మాత్రమే నమ్ముతున్నాను.''
మన భవిష్యత్తును ఇప్పుడే నిర్మించుకుందాం. మన రేపటి కలలను నిజం చేద్దాం.
మనం నిరక్షరాస్యత, పేదరికం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త పోరాటాన్ని చేద్దాం. దీనికోసం మన శక్తివంతమైన ఆయుధాలైన మన పుస్తకాలు, పెన్నులు తీసుకుందాం.
మనం మన లక్ష్యాన్ని సాధించాలనుకుంటే జ్ఞానం అనే ఆయుధంతో మనల్ని మనం శక్తివంతం చేసుకుందాం. ఐక్యతతో మనల్ని మనం రక్షించుకుందాం.
ప్రజలు మౌనంగా ఉంటే ఏమీ మారదు.
ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్నా, కనీసం ఒక్క స్వరమైనా శక్తివంతమవుతుంది.
పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మేము పాఠశాలలు, విద్యను కోరుకుంటున్నాము. శాంతి, విద్య అనే మా గమ్యస్థానానికి మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తాము.