Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సీజన్లో తడిదనం వల్ల వాతావరణం ఎప్పుడూ తేమగా ఉంటుంది. తద్వారా క్రిములు, ఫంగస్ వంటివి వృద్ధి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి నిల్వ చేసే పదార్థాలు, నిత్యావసర సరుకుల్ని తేమ లేని చోట భద్రపరచాలి. అలాగే తేమ చేరకుండా మధ్యమధ్యలో, కప్బోర్డ్ మూలల్లో సిలికాజెల్ ప్యాకెట్లను ఉంచాలి.
తేమకు ఉప్పు, చక్కెర వంటివి గడ్డ కడతాయి. కాబట్టి ఈ రెండూ కలగలిసిన స్నాక్స్‌ని ఒకే జార్లో నిల్వ చేయకుండా విడివిడిగా భద్రపరచడం వల్ల రుచి కోల్పోకుండా, మెత్తబడకుండా జాగ్రత్తపడచ్చు.
మిగిలిన చపాతీలు, వేపుళ్లను అల్యూమినియం ఫాయిల్స్‌లో ప్యాక్ చేసి నిల్వ చేయడం వల్ల వాటి రుచి కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు.
గోధుమ పిండి, శెనగపిండి వంటివి తేమ తగిలితే పాడవుతాయి. కాబట్టి వాటిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరిచి.. అందులో కొన్ని బిరియానీ ఆకుల్ని వేస్తే అవి ఏమాత్రం తేమ ఉన్నా పీల్చేసుకుంటాయి.
బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాల్ని కూడా గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయాలి. అలాగే వాటిలో కొన్ని వేపాకులు వేయడం వల్ల తేమ చేరకుండా ఉండడంతో పాటు పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.
డ్రైఫ్రూట్స్, నట్స్‌ని గాలి చొరబడని, పొడిగా ఉండే గాజు జార్లలో నిల్వ చేయాలి. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచాలనుకునే వారు జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రీజర్‌కి దగ్గరగా అమర్చచ్చు.