Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షిబానీ ఘోష్... తేనెలూరె తన స్వరంతో అందరిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు తన జీవితాన్ని అంధకారం చేయాలని చూసిన ఆటిజం, దృష్టి లోపాన్ని సైతం అధిగమించింది. ఎన్నో వేధికలపై సంగీతాన్ని వినిపించడమే కాకుండే మొదటి ఆల్బమ్‌ను కూడా విడుదల చేసింది. జీవితమంతా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ తనలోని ప్రతిభతో ప్రకాశిస్తున్న ఆమె పరిచయం మానవి పాఠకులకు ప్రత్యేకం...
''మీరు ప్రత్యేకంగా నిలబడటానికి జన్మించినప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు'' అంటారు ప్రముఖ బాలల రచయిత్రి డాక్టర్ న్యూస్. ఆ మాటలు షిబానీ ఘోష్‌కు సరిగ్గా సరిపోతాయి. పుట్టినప్పటి నుండి సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. ఆటిజం, దృష్టి లోపం వేధిస్తున్నా తనలోని ప్రతిభతో నిత్యం ప్రకాశిస్తుంది. షిబానీ పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ అనే చిన్న పట్టణంలో పుట్టింది. అక్కడ ఆమె తండ్రి అసిమ్ కుమార్ ఘోష్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. తల్లి సుజాతా ఘోష్ అకౌంటెంట్‌గా పనిచేశారు. వైకల్యంతో పుట్టిన బిడ్డను అనాథాశ్రమానికి పంపించమని బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆ తల్లికి సలహాలు ఇస్తుండేవారు. కొందరైతే షిబానీని పనికిరానిది అని పిలిచే స్థాయికి కూడా వెళ్లారు.
వారికి మాత్రం పోరాట యుగం
''నేను అలా ఎలా చేయగలను? ఆమె నా కూతురు. అందుకే షిబాని పుట్టిన తర్వాత నేను ఆరేండ్లపాటు కోల్‌కతాలో మా అమ్మ దగ్గర ఉన్నాను. మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసింది. మేము షిబానీకి సాధారణ బాల్యాన్ని అందించడానికి ఒక పాఠశాలలో చేర్చాము'' అని ఆమె తల్లి చెబుతుంది. ఇతర పిల్లలకు బాల్యం ఆటల సమయం అయితే షిబానీకి, ఆమె తల్లిదండ్రులకు మాత్రం ప్రజల అవమానాలను భరించడంతోనే సరిపోయింది. ఆటిస్టిక్ పిల్లలకు మౌలిక సదుపాయాలు, పాఠశాల అవకాశాల కొరత ఉండడంతో ఇది వారికి పోరాట యుగంగా మారిపోయింది.
ఆమె నుండి శక్తిని పొందేవాళ్ళం
ఇతర పిల్లలతో ఆడించి తన కూతురికి సాధారణ బాల్యాన్ని అందించాలనుకుంది ఆ తల్లి. కానీ అది ఆమెకు చాలా కష్టంగా ఉండేది. వారు వాకింగ్‌కు వెళ్ళిన ప్రతిసారీ ప్రజలు షిబానీని చూస్తూ 'ఆమె ఎందుకు ఇలా ఉంది' లేదా 'ఆమెలాంటి బిడ్డను మీరు ఎలా పెంచగలరు' వంటి ప్రశ్నలు అడిగేవారు. ఎవరు ఎన్ని అన్నా ఆ తల్లిదండ్రులు బిడ్డను వదల్లేదు. ''తల్లిదండ్రులుగా ఆమెను పెంచడం మా బాధ్యత. మేము షిబాని వైపు చూస్తూ ఆమె నుండి శక్తిని పొందేవాళ్ళం' అని సుజాత చెప్పింది. షిబానీ మిగిలిన పిల్లల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ పదే పదే ఏదో చేయడానికి ప్రయత్నించేది. ఆమె అంకితభావాన్ని చూసి ఆమె తల్లి షిబానీ చదువులో సహాయం చేయడానికి బ్రెయిలీని చదివింది.
సంగీతం పట్ల ప్రేమ
''నేను న్యుమోనియాతో బాధపడుతున్నప్పుడు నాకు మూడు నెలల వయసు. రాత్రంతా నిద్ర పట్టేది కాదు. తెల్లవారిన తర్వాత మా తల్లిదండ్రులు నన్ను డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నప్పుడు పాడుతున్న ఒక సాధువు ఎదురయ్యారు. అతని గొంతు వినగానే నా ఏడుపు ఆగిపోయింది'' అని షిబానీ గుర్తు చేసుకుంది. ఆ సమయంలోనే షిబానీ తల్లిదండ్రులు ఆమెకు సంగీతంపై ఉన్న ప్రేమను గుర్తించారు. మాట్లాడటానికి ముందే షిబానీ పాడటం ప్రారంభించింది. ''సంగీతం ప్రపంచానికి, నాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే మార్గం సంగీతం అని నేను భావిస్తున్నాను'' అంటుంది షిబానీ.
రెండేండ్ల వయసు నుండే
''నా పుట్టినరోజు నాడు నా తల్లిదండ్రులు నాకోసం ఒక క్యాసెట్‌ని తెచ్చారు. నేను దానిని చాలా ఇష్టంగా విన్నాను'' అని షిబానీ చెప్పింది. ఆమె రోజూ రేడియో వింటూ అందులో ప్లే అయ్యే పాటలు కూడా పాడేది. ''షిబానీ సంగీతం వైపు మొగ్గు చూపుతుందని మాకు తెలుసు. అందుకే ఒక మ్యూజిక్ ట్యూటర్ని నియమించుకున్నాము. తర్వాత జీ టీవీలో క్లాసులు తీసుకుని శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది'' అని సుజాత చెప్పింది. షిబానీ సంగీత పోటీలలో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత ఆమె వికలాంగ గాయకులతో పోటీ పడింది. ఇది సమాజంలో ఆమెకు సమాన హోదాను తెచ్చిపెట్టింది. ఎవరూ ఆమెను ఎగతాళి చేయలేదు. ప్రజలు చివరకు ఆమెలోని వైకల్యాన్ని మర్చిపోయి ప్రతిభను గుర్తించారు.
మొదటి ఆల్బమ్
షిబానీ 5వ తరగతిలో ఉన్నప్పుడు నటుడు తపోష్ పాల్ ఆమె పాఠశాలైనా హెలెన్ కెల్లర్ స్మృతి విద్యామందిర్ను సందర్శించారు. ఎన్నికల ర్యాలీలో షిబానీ ఒక పాటతో ఆయనకు స్వాగతం పలికారు. ఆమె ప్రతిభకు ముగ్ధుడై ఆమె కోసం ఒక ఆల్బమ్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. 'ధూమ్' అనే ప్రఖ్యాత సంగీత టీవీ ఛానెల్‌కి ఆమెను పరిచయం చేశాడు. ఈ ఆల్బమ్‌లో పాశ్చాత్య సంగీతంతో ఠాగూర్ పాటల ప్రత్యేక కలయిక ఉంది. ''2013లో 'టాగూర్ విజన్' అనే ఆల్బమ్‌ని విడుదల చేయడంతో ప్రొఫెషనల్ సింగర్‌గా అరంగేట్రం చేయాలనే నా కోరిక నెరవేరింది'' అని శిబాని చెప్పింది.
సంగీత ప్రయాణం
2014లో ఈ ఆల్బమ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ప్రతిష్టాత్మకమైన ఆలిండియా రేడియో ఆకాశవాణి కోల్‌కతా, ఆధునిక్లోని యువవాణి ఇప్పటికీ ఆమెకు ఒక కలలా అనిపిస్తుంది. ఇది షిబానీ సంగీత ప్రయాణ ప్రారంభం మాత్రమే. ఆమె రూపసి బంగ్లా, ఈటీవీ, ఛానల్ వన్, ఆరెంజ్ బంగ్లా, హై న్యూస్‌లలో ప్రదర్శన ఇచ్చింది. 94.3 రేడియో వన్, 104 ఫీవర్ ఎఫ్.ఎం, 92.7 బిగ్ ఎఫ్.ఎం, 91.9 ఫ్రెండ్స్ ఎఫ్.ఎం వంటి వివిధ రేడియో ఛానెల్‌లకు కూడా తన ప్రతిభకు ప్రాతినిధ్యం వహించింది. ''నేను నా పనిని ఇష్టపడుతున్నాను. పరిశ్రమలో ప్రస్తుత పోకడలను అర్థం చేసుకోవడానికి నాకు సహాయపడిన గానాన్ని ఈవెంట్లలో కూడా పాల్గొనేలా చూసుకున్నాను'' అని ఆమె జతచేస్తుంది.
ప్లేబ్యాక్ సింగర్ కావాలని
శిబాని రవీంద్ర సంగీతంలో రాష్ట్ర స్థాయి ఛాంపియన్, అశోక్ భద్ర, అభిషేక్ దాస్, సుజోరు భట్టాచార్య, అమిత్-అంజన్, ప్రీతమ్ డేతో సహా అనేక మంది సంగీత దర్శకులతో ప్లేబ్యాక్ స్టూడియో గాయనిగా పనిచేశారు. ''నేను కలర్స్ బంగ్లా ఛానెల్ నుండి టాలెంటినో అవార్డును, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి 'రోల్ మోడల్ అవార్డు' అందుకున్నాను'' అని ఆమె చెప్పింది. ప్రస్తుతం 23 ఏండ్ల వయసులో ఉన్న షిబానీ 2020లో తన హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం రవీంద్రభారతి విశ్వవిద్యాలయం నుండి వోకల్ మ్యూజిక్ (ఆనర్స్)లో బీఏ చదువుతోంది. అంతేకాకుండా ఆమె ఆల్ ఇండియా రేడియో, ఆకాశబాని కోల్‌కతాలో రవీంద్రసంగీత్లో గాయని కూడా. ముందుముందు షిబాని సంగీతంలో మాస్టర్స్‌ని అభ్యసించాలని, ప్లేబ్యాక్ సింగర్‌గా పనిచేయాలనుకుంటోంది. మరికొద్ది నెలల్లో తన సొంత పాటను కూడా విడుదల చేయనుంది. ప్రస్తుతం ఆమె 'మినీ కాన్సర్ట్స్'లో పాల్గొంటుంది. ఇది భిన్నమైన కళాకారులకు మద్దతుగా ఎటిపికల్ అడ్వాంటేజ్ ప్రారంభించిన వేదిక.
- సలీమ