Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుటుంబసభ్యుల మీదో, స్నేహితుల మీదో చూపినట్లు ఆ ఉద్వేగాలూ ఉద్రేకాలను ఆఫీసులో చూపించేశారో.. వెంటనే ముద్రలేసేస్తారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవమానిస్తారు. ఇంక్రిమెంట్లకు కత్తెర్లు పడతాయి. ఉద్యోగాలే ఊడతాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పనిచేసే చోట శాంతం, సహనం ఉండాల్సిందే.
పై అధికారి మీదో, సహోద్యోగి మీదో కోపమొస్తే గబుక్కున వెళ్లగక్కేయక దీర్ఘంగా శ్వాస తీసుకోండి. వందతో మొదలుపెట్టి వెనక్కి లెక్కబెట్టండి. ఉద్వేగం తగ్గగానే ఆపిన పని కొనసాగించండి. ఈలోపు పరిస్థితి సర్దుకుంటుంది.
మీ కోపానికి కారణమైన వ్యక్తి, సంఘటన గురించి మీకు బాగా నమ్మకస్థులైన సహోద్యోగితో పంచుకోండి. ఏదైనా పరిష్కారం సూచిస్తారు. లేకున్నా ఔట్‌లెట్‌గా పనిచేసి ఆవేశం తీరుతుంది. ఎవరో ఒకరి ముందు బయటపడ్డారో సమస్య మరింత పెరుగుతుంది.
మీ ఆవేశమంతా మీ పర్సనల్ మెయిల్లో లేదా ఫోన్లో ఇష్టమైనవారికి చెబుతున్నట్టుగా రాయండి. దాన్ని ఎవరికీ పంపించొద్దు, షేర్ చేయొద్దు. ఆవేశమంతా అక్షరాల్లోకి తర్జుమా అయితే కోపం చల్లారుతుంది. దాన్ని తర్వాతెప్పుడో చదివితే మీకే నవ్వొస్తుంది.
కోపావేశాల్ని మర్చిపోవడానికి ఓ ఐదు నిమిషాలు మీకిష్టమైన వెబ్సైట్లోకి వెళ్లండి. లేదంటే ఫేస్బుక్, వాట్సప్‌లు చూడండి. అప్పటికీ మీ కోపం చల్లారలేదంటే మీకు ఎవరి వల్ల ఎందుకు అవమానం జరిగిందో ఉన్నతాధికారి దృష్టికి తీసికెళ్లండి. చెప్పే ధోరణి శాంతంగానే ఉండాలని మర్చిపోవద్దు.