Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునగాకు రక్తంలో చక్కెరను సాధారణీకరిస్తుంది. కండ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలను బలోపేతం చేయడంతోపాటు ఇలా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలును చేకూరుస్తుంది. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. అలాంటి మునగాకుతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. ఒక్క సారి మీరూ ట్రై చేయండి.
పసందైన పచ్చడి
కావలసిన పదార్ధాలు: మునగాకు - పావు కప్పు, చింతపండు - కొద్దిగా, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - రెండు కట్టలు, వెల్లులి - నాలుగు రెబ్బలు, జీలకర్ర - అర చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - కొద్దిగా, పల్లీలు - పావు కప్పు, నూనె - సరిపడినంత, తాలింపుగింజలు - కొద్దిగా.
తయారు చేసే విధానం: మునగాకు కడిగి ఆరబెట్టి పుల్లలు, ఈనెలు లేకుండా దూసి ఉంచుకోవాలి. పొయ్యిమీద పాన్‌లో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, వెల్లులి, జీలకర్ర వేయించాలి. అందులోనే మునగాకు వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసి అవి పూర్తిగా వేగుతున్న సమయంలో కొత్తిమీర ఆకులువేసి ఉప్పు, చింతపండు వేసి మూతపెట్టి మగ్గనిచ్చి పొయ్యిమీద నుండి దించి చల్లారనివ్వాలి. ఈ లోగా పల్లీలు దోరగా వేయించుకోవాలి. ఇవ్వన్నీ కలిపి మిక్సీలో వేసి పచ్చడిలా రుబ్బుకోవాలి. ఈ పచ్చడిని విడిగా గిన్నెలోకి తీసుకుని పైన నూనెలో వేయించిన తాలింపుగింజలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బావుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలామంచిది.
కమ్మని పప్పు
కావల్సిన పదార్థాలు: పెసరపప్పు - రెండు కప్పులు, పచ్చి శెనగపప్పు - ఆరు టేబుల్ స్పూన్లు, కాబూలీ సెనగలు - ముప్పై, ఉల్లిగడ్డ తరుగు - కప్పు, పచ్చిమిర్చి - ఎనిమిది, టమాటాలు - రెండు, పసుపు - రెండు టీ స్పూన్లు, నీళ్ళు - ఐదు కప్పులు, కొత్తిమీర - చిన్నకట్ట, మునగాకు - రెండు వందల గ్రాములు, నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు, ఆవాలు - రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర - రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి - ఆరు, దంచిన వెల్లుల్లి - పది, పచ్చి కొబ్బరి - కప్పు, కొబ్బరి నూనె - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: పప్పులన్నీటిని ఒక గంట సేపు నానబెట్టుకుంటే మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఆ పప్పులను ఒక కుక్కర్లో వేసి నీళ్ళు పోసి నాలుగు విజిల్స్ వచ్చే దాకా ఉడికించి దింపేసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టి అందులో మునగాకు వేసి పసరు వాసన పోయే దాకా వేపుకోవాలి. ఆకు వేగాక ఇప్పుడు మెత్తగా ఉడికిన పప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకుని ఉడికించాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేయాలి. ఆఖరుగా పచ్చికొబ్బరి, కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికించి దింపేసుకోండి. ఇప్పుడు పప్పుని చక్కగా మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి పోపు వేపుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా వేసుకోండి. కూటులో వేసిన పెసరపప్పు కారణంగా చల్లారాక కూటు గట్టిగా చిక్కబడుతుంది. అలా చిక్కగా అనిపిస్తే ఎప్పుడైనా వేడి నీళ్ళతో పలుచన చేసుకోవచ్చు. అంతే ఎంతో సువాసన భరితమైన మునగాకు పప్పు రెడీ అయినట్టే.
నోరూరించే రైస్
నోరూరించే రైస్
కావాల్సిన పదార్థాలు: మునగాకు - అర కప్పు, బాస్మతి బియ్యం (ఉడికించినవి) - ఒక కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, అల్లం, వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, పచ్చిమిర్చి (తరిగినవి) - మూడు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, గరం మసాలా - ఒక టీ స్పూను, జీడిపప్పు - ఆరు, మసాలా దినుసులు (చెక్క, లవంగం, యాలకులు) - కొద్దిగా, పుదీనా - కొద్దిగా, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా కడాయిలో నూనె కాగిన తర్వాత మసాలా దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఒక నిమిషం వేగాక తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. పుదీనా, మునగాకు వేసి వేయించాలి. ఆకు అంతా దగ్గరకి వచ్చిన తర్వాత ధనియాల పొడి, కొద్దిగా నీరు కలిపి ఉడికించాలి. నీరంతా ఇంకిన తర్వాత జీడిపప్పు, ముందుగా ఉడికించిన రైస్, ఉప్పు కలిపి ఐదు నిమిషాల వరకు వేయించాలి. చివరగా గరం మసాలా కలిపి దించేయాలి. కొత్తిమీరతో అలంకరించుకుంటే మునగాకు రైస్ రెడీ.
వంద గ్రాముల మునగాకులోని పోషకాలు
నీరు - 75.9 శాతం, పిండి పదార్థాలు - 13.4 గ్రాములు ఫ్యాట్స్ - 17 గ్రాములు, మాంసకృత్తులు - 6.7 గ్రాములు, కాల్షియం - 440 మిల్లీ గ్రాములు, పాస్పరస్ - 70 మిల్లీ గ్రాములు, ఐరన్ - 7 మిల్లీ గ్రాములు, 'సి' విటమిన్ - 200 మిల్లీ గ్రాములు, ఖనిజ లవణాలు - 2.3 శాతం, పీచు పదార్థం - 0.9 మిల్లీ గ్రాములు, ఎనర్జీ - 97 కేలరీలు.
సూపర్ సూప్
కావల్సిన పదార్థాలు: మునగాకు - కప్పు, ఆలూ - చిన్నది, క్యారెట్ - నాలుగైదు, అల్లం ముక్క - అంగుళం, ఉప్పు - రుచకి సరిపడా, బిర్యానీ ఆకు - కొద్దిగా, మిరియాలపొడి - పావుచెంచా, క్రీం - టేబుల్ స్పూను.
తయారు చేసే విధానం: మునగాకు శుభ్రంగా కడిగి వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని ఆలూ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బిర్యానీ ఆకు, మిరియాలు, అల్లం వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి. చల్లారాక మిక్సీలో గుజ్జులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి మళ్లీ పొయ్యిమీద పెట్టి ఒక పొంగు వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలిపి దింపేయాలి. తీసుకునే ముందు క్రీంతో అలంకరించుకుంటే సరిపోతుంది. అంతే నోరూరించే మునగాకు సూప్ సిద్ధం.
ఇవే ఉపయోగాలు
మునగాకులో ఎముకల పుష్టికి తోడ్పడే కాల్షియం, గర్భిణులకు మేలు చేసే పోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తాయి.
విటమిన్ 'ఎ' క్యారెట్లో కంటే దీనిలో నాలుగు రెట్లు అధికంగా లభ్యమవుతుంది. విటమిన్ 'సి' కమలా ఫలంలో కంటే మునగలో ఏడురెట్లు అధికం. అరటి పండుతో అందే పొటాషియం కంటే దీన్నుంచి అందేది మూడు రెట్లు ఎక్కువ.
మునగాకును తరచూ తీసుకోవడం వల్ల మెదడుకు పదును. కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్లన్నీ ఈ ఆకులో లభిస్తాయి.
పొట్టలో హానికారక క్రిములను తగ్గిస్తుంది.
బాలింతలు మునగాకును తింటు పాలుపడతాయి.
ముగాకు యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
ఇందులోని పీచు పదార్థం మధుమేహం, గుండె సమస్యలున్న వారికి మేలు చేస్తుంది.