Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్యాంగ్ ఛోట్సో... చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు టిబెట్ నుండి పారిపోయింది. ఆ సమయంలో టిబెటన్ పిల్లల కోసం ఏర్పాటు చేయబడిన ధర్మశాల శరణార్థి శిబిరంలో పెరిగింది. ఆమె ఇప్పుడు టిబెటన్ మహిళల ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్. ఇటీవలె ఇది మొట్టమొదటి CONIFA మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో ఆడింది. శరణార్థి నుండి ఫుట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎదిగిన ఆమె విజయగాథ నేటి మానవిలో...
అది 2004... ఎనిమిదేండ్ల జమ్యాంగ్ ఛోట్సో అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా 10 రోజుల సాహస యాత్ర చేసి నేపాల్‌లోని శరణార్థి శిబిరానికి చేరుకుంది. అప్పట్లో టిబెట్‌లో గందరగోళ పరిస్థితి. అందరూ ఎందుకు పారిపోతున్నారో తల్లిదండ్రులు తనను అక్కడి నుండి ఎందుకు పంపిస్తున్నారో ఆమెకు ఏమీ తెలుసుకోలేని పసిప్రాయం. నేపాల్‌లో బస్సు ఎక్కి ఢిల్లీ చేరుకుని అక్కడి ధర్మశాలలో చేరింది. అప్పుడు ఆమెకు విషయం అర్థమైంది.
ప్రతి రోజూ ఏడ్చేది
ప్రస్తుతం 26 ఏండ్ల జమ్యాంగ్ నర్సుగా పని చేస్తుంది. అంతేకాదు ఇటీవలె జులై 1, జులై 6 మధ్య జరిగిన మహిళల ప్రారంభ CONIFA ప్రపంచ కప్‌కు ఆతిథ్య జట్టు అయిన ఖీజ టిబెట్, సెంట్రల్ డిఫెండర్ కెప్టెన్ కూడా. ''నేను భారతదేశానికి చేరుకున్నప్పుడు అది నా దేశానికి చాలా భిన్నంగా ఉంది. అక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. నా కుటుంబాన్ని చాలా కోల్పోయాను. ప్రతిరోజూ ఏడుస్తూనే ఉండేదాన్ని. అయితే నేను సురక్షితంగా ఉన్నానని మాత్రం నాకు తెలుసు'' అని హిమాచల్ ప్రదేశ్‌లోని గోపాల్‌పూర్‌లోని రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళిన జమ్యాంగ్ అప్పటి రోజులను గుర్తు చేసుకుంది.
ఆటల్లో బాధ మర్చిపోయింది
అక్కడే మురికిగా ఉన్న స్కూల్ ప్లేగ్రౌండ్‌లో ఫుట్‌బాల్ బూట్లు లేకుండా 12 ఏండ్ల జమ్యాంగ్ మొదటి సారి ఫుట్‌బాల్‌ను తన్నింది. ఎక్కువ సమయం క్రీడల్లో గడుపుతూ తన బాధను మర్చిపోయేది. కుటుంబానికి దూరంగా ఉందనే చింతన నుండి బయటపడేందుకు క్రీడలు ఆమెకు సహకరించాయి. ఆమె గోపాల్‌పూర్‌లోని టిబెటన్ చిల్డ్రన్స్ విలేజ్ స్కూల్లో పెరిగింది. అప్పుడే ఆమె జీవితంలో ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుంది. ఆ పాఠశాల డే కేర్, వైద్య చికిత్స, ప్రాథమిక, మాధ్యమిక విద్యతో పాటు టిబెటన్ శరణార్థి పిల్లలకు సంరక్షణను అందిస్తుంది. ఆ పిల్లలు వారి సోదరులు, సోదరీమణులతో కలిసి అక్కడ నివసిస్తున్నారు.
మూలాలను మర్చిపోలేము
జమ్యాంగ్ జీవితంలో క్రీడలు అంతర్భాగంగా ఉన్నప్పటికీ టిబెటన్ భాష, సంస్కృతిని నేర్చుకోవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ''మనం మన దేశాన్ని విడిచిపెట్టినప్పటికీ మన మూలాలను మరచిపోలేము'' అని ఆమె అంటుంది. గత పద్దెనిమిదేండ్లలో జమ్యాంగ్ తన తల్లిదండ్రులు నివసిస్తున్న దేశానికి ఒక్కసారి కూడా తిరిగి వెళ్లలేకపోయింది. ''నేను వారిని కోల్పోతున్నాను. కానీ నేను వారితో ఎప్పుడో ఒకసారి మాట్లాడతాను'' అని ఆమె చెప్పింది. అప్పుడు తనను తల్లిదండ్రులు ఎందుకు పంపించారో, ఆ తీవ్రమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయో అర్థం చేసుకుంటుంది.
ప్రపంచ వేదికపై
జమ్యాంగ్ క్రీడల పట్ల అందునా ఫుట్‌బాల్ పట్ల ఉన్న అభిరుచిని ఆమె సంఘంలోని చాలా మంది గుర్తించారు. ''నేను పాఠశాలలో ఉన్నప్పుడు మొట్టమొదటి టిబెట్ మహిళల జట్టులో ధర్మశాలలో నివసించే కాస్సీ అనే అమెరికన్ నన్ను నియమించింది. అక్కడి నుంచి ఆడుకోవడం మొదలుపెట్టాను. ఆమె బాలికల కోసం అనేక ఫుట్‌బాల్ క్యాంపులు, టోర్నమెంట్లను నిర్వహించింది'' అని జమ్యాంగ్ అంటుంది.
గోంపో కోచ్‌గా
CONIFA మహిళల ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌ని ఎన్నుకునే సమయం వచ్చినప్పుడు జమ్యాంగ్ ప్రధాన ఎంపిక కావడం సహజం. మాజీ పురుషుల ఫుట్‌బాల్ అంతర్జాతీయ ఆటగాడు గొంపో డోర్జీ ప్రపంచకప్‌కు జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ''నేను 2016లో కాస్సీ నిర్వహించిన శిబిరాల్లో ఒకదానిలో కోచ్ గోంపోను కలిశాను. అప్పటి నుండి అతను మాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు'' అంటుంది జామ్యాంగ్.
చాలా తక్కువ సమయం
టిబెట్‌లో మహిళల క్రీడకు ప్రపంచ కప్ టోర్నమెంట్లు ఒక ప్రధాన పురోగతి అని ఆమె భావిస్తుంది. ఇతర యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు తన జట్టు స్ఫూర్తిని అందించిందని ఆమె ఆనందంగా ఉంది. ''మా జట్టులోని అమ్మాయిలందరూ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారులు కాదు. సంఘంగా మేము తగినంత సమయం ఫుట్‌బాల్ ఆడలేము. కాబట్టి జట్టును సేకరించడం చాలా కష్టం. అలాగే మా ఆటగాళ్లు అంతటా విస్తరించి ఉన్నారు. జట్టుగా ఫుట్‌బాల్ ఆడేందుకు మాకు ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. మేము కేవలం రెండు నెలల్లో మా ఫిట్నెస్, ఫుట్‌బాల్ నైపుణ్యాలపై పని చేయాల్సి వచ్చింది'' అని జామ్యాంగ్ వెల్లడించింది.
ఓడిపోయినప్పటికీ...
ఈ నెల ప్రారంభంలో టిబెట్ నేషనల్ స్పోర్ట్స్ అసోసియేషన్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మార్ జిల్లా అందమైన పాంటా సాహిబ్‌లో CONIFA టోర్నమెంట్‌ను నిర్వహించింది. టోర్నమెంట్లో మొదట నాలుగు జట్లు పాల్గొంటాయని భావించారు. అవి టిబెట్, సప్మి, మటబెలెలాండ్, స్జెక్లీ ల్యాండ్. తర్వాత రెండు దేశాలు తప్పుకోవడంతో టిబెట్, సప్మి ఒకదానితో ఒకటి తలపడవలసి వచ్చింది. టిబెట్, సప్మీ చేతిలో ఓడిపోయినప్పటికీ జమ్యాంగ్ తన జట్టు సభ్యుల గురించి గర్వంగా ఉంది. అందులో 16 ఏండ్ల వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు. ''మా కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడటం చాలా అరుదు. ప్రతిభను కనుగొనడం అంత సులభం కాదు'' ఆమె చెప్పింది. ఆమె మాత్రం తనతో పాటు చదువుకున్న అబ్బాయిలతో ఆడుకుంటూ పెరిగింది.
దేశానికి ప్రాతినిధ్యం వహించాము
''మేము మ్యాచ్‌లో ఓడిపోయినా నేను చాలా గర్వపడుతున్నాను. నా సహచరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం మాకు లభించింది'' అని జమ్యాంగ్ అంటుంది. స్వదేశంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు తన విజయాన్ని గురించి తెలుసో లేదో ఇప్పటికీ తెలియదు. ప్రస్తుతానికి జామ్యాంగ్ తిరిగి తన నర్సింగ్ వృత్తిలోకి వెళుతూ ఫుట్‌బాల్‌కు తగిన విరామం తీసుకోబోతున్నానని చెప్పింది.