Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మన శరీరంపై దాడి చేస్తుంటాయి. వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుకోవాలి. కాబట్టి ఆయా కాలాల్లో లభించే పండ్లు, కాయగూరలు తీసుకోవడంతో పాటు ఆహార నియమాల్లోనూ పలు మార్పులు-చేర్పులు చేసుకోవడం అవసరం అంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకే ఈ చిటపట చినుకుల కాలంలో ఏయే పదార్ధాలు తీసుకోవాలి.. ఫలితంగా ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి.
వర్షాకాలంలో ఆకుకూరలు పండించడానికి నేల అనువుగా ఉండదు. అందుకే వాటికి బదులుగా తీగ జాతికి చెందిన సొరకాయ, గుమ్మడి, కాకర, బీరకాయలతో పాటు క్యారట్, మోరంగడ్డ, చేమదుంప.. వంటి దుంప జాతికి చెందిన కాయగూరల్ని ఆహారంగా తీసుకోవాలి. ఇవన్నీ జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.
వర్షాకాలంలో రాగులు ఎక్కువగా పండుతాయి. కాబట్టి రాగి జావ, రాగి రొట్టె, రాగులతో తయారు చేసుకునే అప్పడాలు కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అలాగే సామలు, కొర్రలు.. వంటి చిరుధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వీటితో ఆయా ప్రాంతాల్లో సంప్రదాయ వంటకాల్ని తయారుచేసుకొని పెరుగు, బటర్‌తో ఆరగించచ్చు. ఇక అన్నం, జొన్నలు, గోధుమలను ఏ సీజన్లోనైనా తీసుకోవచ్చు. మొక్కజొన్న కూడా లోకల్‌గా దొరికేవే తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
కొంతమంది వర్షాకాలంలో మాంసం, చేపలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్న పప్పు ధాన్యాలు వర్షాకాలంలో ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తాయి. ఇక వీటిలోనూ మొలకెత్తినవి తీసుకుంటే మరీ మంచిది. పప్పులతో తయారుచేసుకునే వంటకాలు, పప్పులన్నీ కలిపి తయారుచేసే సబ్జీ, అప్పడాలు.. ఇలా ఎవరి అలవాటుకు తగినట్టుగా వారు సరికొత్త వంటకాలు తయారుచేసుకొని తీసుకోవచ్చు. ఇక ఈ సీజన్లో ఉలవలు, అలసందలు మరీ మంచివి. ఈ రెండు పప్పు ధాన్యాలు చర్మ ఆరోగ్యానికి, కేశ సంరక్షణకు చాలా ఉత్తమం.
ఆహారం విషయంలోనూ ఒక్కో కాలానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో మామిడి పండ్ల హవా కొనసాగితే.. వర్షాకాలంలో వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంటుంది. అయితే వీటిని వండడం కోసం పల్లీ, ఆవ, కొబ్బరి.. నూనెలు వాడచ్చు. అలాగే ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ ఇతర పదార్థాల తయారీకి వాడకూడదు.