Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అన్నట్టుగా ఇంటిని అలంకరించుకోవడానికి ఏదైనా పనికొస్తుంది. పారవేసే ప్రతి వస్తువుతోనూ పనికొచ్చే కళాకృతిగా తయారు చేయవచ్చు. ఒకనాడు ఏది వెలిగించాలన్నా అగ్గిపుల్ల అవసరం. ఇప్పుడు దీపాలు వెలిగించటానికి తప్ప దాదాపుగా దాని అవసరం తగ్గింది. పొయ్యి వెలిగించేపని, స్టవ్‌లు వెలిగించే పని లేకుండా లైటర్లు, ఆటోమాటిక్ విధానాలు వచ్చాయి. మా అమ్మ వాళ్ళ కాలంలో అగ్గి పుల్లలతో ఇళ్ళు కట్టటం, చార్మినార్లు, తాజ్మహాళ్ళ నిర్మాణాలు రూపొందించేవాళ్ళు. మాతరంలో అంత పెద్ద బొమ్మలు చెయ్యలేదు గానీ చిన్న చిన్న సీతాకోక చిలుకలు, కుర్చీలు, బల్లలు, కుక్కపిల్లలు తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా ఇన్నోవేటివ్‌గా ఆలోచించి కొత్త రకాల బొమ్మలు తయారు చేస్తున్నారు.
కుర్చీలు, టీపారు
ఒక కాగితాన్ని తీసుకొని దానిమీద అగ్గిపుల్లలను అతికించాలి. అగ్గిపుల్లల తలలను వరసగా కాకుండా ఒకటి ముందుకు ఒకటి వెనక్కు అతికించాలి. అప్పుడే రెండింటి మధ్య ఖాళీ ఏర్పడకుండా ఉంటుంది. ఒక వరుసలో అగ్గిపుల్ల తల ముందువైపుకు వస్తే రెండో వరుసలో అగ్గిపుల్ల తల వెనకవైపుకు రావాలన్నమాట. ఇలా నలుచదరంగా చేయాలి. ఇది కుర్చీలో కూర్చునే సీటు అన్నమాట. ఈ ముక్కకు అడుగున కాళ్ళ వలె నాలుగు అగ్గి పుల్లలు అతికించాలి. ఇప్పుడు కుర్చీలో వెనకభాగం అంటే ఆనుకుని కూర్చునే భాగం అన్నమాట దీనిని కూడా ఇంతకుముందు సీట్ భాగం చేసినట్టుగా చేయాలి. కాకపోతే కొద్దిగా కొద్దిగా దీర్ఘచతురస్రంగా చేయాలి. ఈ ముక్కను సీట్ భాగానికి నిలువుగా అతికించాలి. ఇప్పుడు కుర్చీ రూపం సంతరించుకుంటుంది. ఇదే విధంగా నాలుగు కుర్చీలు తయారు చేసుకోవాలి. కావాలంటే ఆరు కుర్చీలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో పెట్టే టీపారును చేసుకుందాం. దీనికి దీర్ఘచతురస్రంగా అగ్గిపుల్లలు అతికించిన ముక్కు తయారు చేసుకోవాలి. దీనికి నాలుగు కాళ్ళు అతికిస్తే టీపారు సిద్ధమవుతుంది. ఇలా కుర్చీలు, టీపారులు తయారు చేసి షోకేస్‌లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇది చూడటానికి మార్కెట్లో దొరికే కేన్ ఫర్నిచర్‌లా కనిపిస్తుంది. మేము వీటిని బొమ్మల పెళ్ళిలో పెట్టుకుని ఆడుకునే వాళ్ళం. దీనిలో పెళ్ళికొడుకు తల్లిదండ్రుల బొమ్మల్ని పెట్టి, పెళ్ళి కూతుర్ని చాపమీద కూర్చోబెట్టి పెళ్ళి చూపు తతంగమంతా ఆటలో ఆడుకునే వాళ్ళం. పెళ్ళి కూతుర్ని చాప మీద కూర్చోబెట్టాలి కాబట్టి చాపను కూడాక అగ్గిపుల్లలతో చేసే వాళ్ళం. ఈ చాపకు మాత్రం అగ్గిపుల్లల తలలు అన్నీ ఒక వైపుకే వచ్చే విధంగా అతికించే వాళ్ళం. అంటే దాన్ని బార్డర్ లాగా వచ్చేలా చూసుకునే వాళ్ళం.
హృదయం
ఒక కార్డ్బోర్డును తీసుకుని హృదయాకారంలో కత్తిరించుకోవాలి. మధ్యన ఇంకో హృదయాకారాన్ని గీసుకొని మధ్యన కత్తిరించాలి. కత్తిరించిన ముక్కను తీసేస్తే హృదయాకారపు చక్రంలా కనిపిస్తుంది. దానిమీద ఎరుపురంగును పెయింట్ చేసుకోవాలి. ఇప్పుడు అగ్గిపుల్లల్ని తీసుకుని హృదయాకారపు అట్టమీద అతికించాలి. ఇలా మొత్తం అతికించాక దాని మీద పూలు అతికించాలి. ఈ హృదయాన్ని గోడకు వేలాడదీయవచ్చు.
ఇల్లు
జపాన్‌లో అట్టలతో ఇల్లు కట్టుకుంటారని చెప్పుకుంటాం కదా! వాళ్ళకు భూకంపాలు ఎక్కువ కాబట్టి అలా కట్టుకుంటారు. మొదట నాలుగు పుల్లల్ని కలుపుతూ పునాది వేసుకోవాలి. ఇప్పుడు వాటి మీదే ఇటుకలు పేర్చినట్టుగా వరుసగా అగ్గిపుల్లలు పేర్చుకుంటూ రావాలి. ఒకేసారి నాలుగు గోడలతో పైదాకా వస్తుంది. సుమారు వేలెడంత ఎత్తు పెరిగాక దానిపైన రూఫ్ వేయాలి. ఇప్పుడు అగ్గిపుల్లల్ని అడ్డంగా అతికిస్తే రూఫ్ తయారవుతుంది. దాని మీద టోపీలాగా అగ్గిపుల్లల్ని అతికిస్తే ఇల్లు ఆకారం వస్తుంది. ద్వారం దగ్గర కత్తిరిస్తే వాకిలి ఉన్నట్టుగా వస్తుంది. ఈ ఆకారాన్ని మేము చిన్నతనంలో చీపురు పుల్లలతో కట్టేవాళ్ళం. ఇలా అగ్గిపుల్లలతో ఇల్లు కట్టలేదు. అందుకే ఇప్పుడు కట్టుకుంటున్నాం.
ఉయ్యాల
అటూ ఇటూ చెక్కలుండి మధ్యలో వేలాడే ఉయ్యాల ఉంటుంది కదా! దాన్ని తయారు చేద్దాం. మా అమ్మ ఇలాంటి ఉయ్యాలను పూసలతో అల్లింది. మనం వెరైటీగా అగ్గిపుల్లలతో చేద్దాం. ఉయ్యాలకు ఉండే స్టాండును కర్ర ముక్కలతో చేసుకుందాం. కర్రల మీదుండే రూఫ్‌ను అగ్గిపుల్లలతో చేద్దాం. ఇప్పుడు కాగితం కాకుండా కొద్దిగా గట్టి అట్టపై అగ్గిపుల్లల్ని అతికించి రూఫ్ తయారు చేద్దాం. ఈ రూఫ్‌ను కర్రలపై అతికిస్తే స్టాండు తయారవుతుంది. ఇప్పుడు ఉయ్యాల చెయ్యాలి. ఇంతకు ముందు కుర్చీ చేసుకున్నట్టే ఉయ్యాలనూ చేసుకోవాలి. కాకపోతే కాళ్ళను పెట్టకూడదు అంతే. ఈ ఉయ్యాలకు ఊలు దారం కట్టి స్టాండులో వేలాడదీయాలి.
సీతాకోకచిలుక
ఒక కాగితంపై సీతాకోకచిలుక బొమ్మను గీసుకొని దాన్ని కత్తిరించాలి. ఇప్పుడు ఆ ఆకారానికి తగినట్టుగా అగ్గిపుల్లల్ని అతికించాలి. అగ్గిపుల్లల తలలు ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో దొరుకుతాయి. రకరకాల కంపెనీల అగ్గిపెట్టెలు చూసి కొనుక్కుంటే బొమ్మలు అందంగా వస్తాయి. అగ్గిపుల్లల తలలు చివరకు వచ్చేలా అతికిస్తే సీతాకోక చిలుక రెక్కలు బాగా వస్తాయి. రెక్కల మీద ఉండే చుక్కల కోసం తళుకులు గానీ, రంగుల అగ్గిపుల్లల తలలను కత్తిరించి గానీ అతికించుకోవచ్చు. చాలా బాగా తయారవుతుంది.
పూలకుండి
అగ్గిపుల్లలు పువ్వుల తయారీకి బాగా పనికొస్తాయి. పూలకుండీని పెన్సిల్‌తో వేసుకొని దాని ప్రకారకం అగ్గి పుల్లల్ని అతికించాలి. ఇందులో కూడా రంగుల అగ్గిపుల్లల్ని వాడితే బాగుంటుంది. కుండీ పై భాగాన పువ్వల్ని కొమ్మల్ని వేసుకుని అగ్గిపుల్లల్ని అతికించాలి. కొమ్మల కోసం అగ్గిపుల్లల్ని నిలువుగా అతికించాలి. దీనికి ఆకుపచ్చ తలలున్న అగ్గిపుల్లలు పెద్ద సైజువి వాడితే బాగుంటుంది. అగ్గి పుల్లల పూలకుండీ అందంగా ఉంటుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్