Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రినా షా.... షూ డిజైనర్, వ్యాపారవేత్త, డీజే... ఇన్ని రకాలుగా మల్టీటాస్క్ చేస్తూనే మన దేశంలో మొట్టమొదటి మహిళా పోలో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ హాయిగా జీవితాన్ని గడిపే ఆమె అసలు పోలో ప్లేయర్‌గా ఎందుకు మారింది. ''మనిషిగా బతికేందుకు మనకు ఒక జీవితం లభించింది. ఈ జీవితాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటే అన్ని విజయాలు సాధించగలం'' అంటున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు...
2010లో ముంబైలో జరిగిన మ్యాచ్ చూసి రినా షా పోలోతో ప్రేమలో పడింది. దూకుతున్న గుర్రాలను చూస్తూ కండ్లు తిప్పుకోలేకపోయింది. అప్పుడే ఆమెలో ఓ ప్రశ్న కూడా మొదలయింది. ''పురుషులు మాత్రమే ఈ ఆటను ఎందుకు ఆడగలరు, మహిళలు ఎందుకు ఆడలేరు?'' అని తనలో తనే ప్రశ్నించుకుంది.
మహిళలకు అంత సులభం కాదు
38 సంవత్సరాల వయసులో రీనా పోలోను వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఇది మహిళలకు అంత సులభమైన విషయం కాదు. పైగా ఆమె ఈ క్రీడలోకి ప్రవేశించడం కూడా ఓ ప్రణాళిక ప్రకారం కూడా జరగలేదు. రినా అప్పటికే తన ప్రీమియం ఫుట్‌వేర్ బ్రాండ్ రినాల్డి డిజైన్స్‌ను ప్రారంభించింది. ఇందులో నవోమి క్యాంప్‌బెల్, నటాలీ పోర్ట్మన్, గోల్డీ హాన్, రేఖ, శిల్పా శెట్టి, కరీనా కపూర్ ఖాన్ వంటి ప్రముఖ క్లయింట్లు ఉన్నారు. అంతేకాదు డీజే స్కూల్ ఆఫ్ ఆమ్స్టర్డ్యామ్లో టాప్ 10 డీజేగా తనను తాను నిరూపించుకుంది.
సంవత్సరం పట్టింది
''నేను ఎప్పుడూ ప్రత్యేకమైన, కష్టతరమైన క్రీడను ఆడాలనుకుంటున్నాను. కానీ పోలో గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. గుర్రాలు నన్ను గెలిపించాయి. ఆ సమయంలో మనదేశంలో ఒక్క మహిళ కూడా ఈ క్రీడ ఆడటం లేదు. అప్పటి వరకు నేను గుర్రం మీద ఎప్పుడూ కూర్చోలేదు. అందుకే పోలో కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది. ఇది సాధారణ గుర్రపు స్వారీకి భిన్నంగా ఉంటుంది. మనదేశంలో పోలో పాఠశాలలు లేవని నాకు తెలుసు. అందుకే శిక్షణ కోసం అర్జెంటీనాకు వెళ్ళి నెల రోజులు నేర్చుకొని వచ్చాను. తర్వాత శాంటా బార్బరా, ఇంగ్లండ్‌కు కూడా వెళ్ళవలసి వచ్చింది'' అంటూ రీనా వివరించింది. అప్పటికి ఆమె భారతదేశంలో చురుకుగా పోలో ఆడే ఏకైక మహిళ. తర్వాత రీనా పోలో పాఠశాలను కూడా ఏర్పాటు చేసింది. రినాల్డి పోలా ఈరోజు సమీర్ సుహాగ్, చిరాగ్ పరేఖ్, గౌరవ్ సెఘల్, హిస్ హైనెస్ మహారాజా పద్మనాభ్ సింగ్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కలిగి ఉంది.
సవాళ్ళు ఎదురవుతాయని తెలుసు
వివాహానంతరం ఆమె తన జీవితాన్ని నియంత్రించుకోగలిగింది. మ్యాచ్‌ల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారింది. ''ఆ సమయంలో నేను సమాజం ఆలోచించే విధానాన్ని మార్చలేకపోయాను. కానీ నేను ఆట నుండి నిష్క్రమించడానికి ఇష్టపడలేదు. కాబట్టి సమాజం గురించి పట్టించుకోవడం మానేశాను'' అంటూ జతచేసింది. ఈక్వెస్ట్రియన్ క్రీడలో చేరిన మొదటి మహిళల్లో ఒకరైన రీనా ఈ రంగంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కోంది. పురుషుల ఆధిపత్యం కలిగిన రంగం కాబట్టి సవాళ్లు ఎదురవుతాయని ఆమె ముందే గ్రహించింది.
తిరిగి రాననుకున్నారు
''మొదట్లో చాలామంది నన్ను సీరియస్‌గా తీసుకోలేదు. ఎగతాళి కూడా చేసేవారు. ఈ క్రీడలో మనుగడ సాగించగలనా అనే సందేహాలను కూడా వెలిబుచ్చారు. దీని నుండి నేను నిష్క్రమిస్తానని, తీవ్రమైన గాయాల తర్వాత తిరిగి రానని వారు అనుకున్నారు. కానీ నేను ఎప్పుడూ ఈ క్రీడను విడిచిపెట్టదలచుకోలేదు. మన దేశం పురుషాధిపత్యం కలిగి ఉంది. కానీ నేను చాలా మంది మహిళలకు స్ఫూర్తినిచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఇంకా ఎంతో మంది మహిళలు ఈ కష్టతరమైన క్రీడను ఆడాలని ఆశిస్తున్నాను. 2019లో ముంబైలో మహిళలను మాత్రమే ఈ గేమ్ ఆడేందుకు వివిధ దేశాల నుంచి ఆహ్వానించాను'' చెప్పింది.
విడిచిపెట్టాలనుకోలేదు
ముంబైలోని అమెచ్యూర్ రైడర్స్ క్లబ్లో సురేశ్జీతో కలిసి రైడింగ్ పాఠాలు చదువుతున్న సమయంలో ఆమె తన గుర్రం మీద నుండి పడిపోవడం, ప్రజలు నవ్వడం, ఎగతాళి చేయడం గుర్తుకు తెచ్చుకుంది. అయితే ఆమె మొదట రినాల్డి డిజైన్లను ప్రారంభించినప్పుడు ఇతర షూ డిజైనర్లు, వ్యాపారాల నుండి అనేక సవాళ్లను ఎదుర్కొన్న ఆమెకు ప్రజలు తనను చూసి నవ్వడం పెద్ద సమస్యగా అనిపించలేదు. ''నేను ఈ వయసులో పోలో ఆడటం మొదలుపెట్టడం చాలా తెలివితక్కువదని నేను భావించాను. కానీ నిరుత్సాహపడలేదు. క్రీడను వదులుకోవడం నాకు ఇష్టంలేదు. మొదటి టోర్నమెంట్ ఆడుతున్నపుడు ఏదీ అసాధ్యం కాదనే నమ్మకం కలిగించింది'' అని రీనా చెప్పింది.
బాధ తర్వాతే ఆనందం
రీనా విశాల్ సింగ్‌తో కలిసి శిక్షణ కోసం జైపూర్‌కు వెళ్లింది. ఆమె రినాల్డి డిజైన్స్‌ని కూడా నడపవలసి ఉన్నందున వారమంతా ముంబైలో ఉంటుంది. వారాంతానికి జైపూర్‌కి వెళ్లి శిక్షణ తీసుకుంటుంది. ''నిద్ర సరిపోక, ఒళ్ళు నొప్పులతో ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ నేను 40 ఏండ్ల వయసులో అసాధ్యమైన పనిని చేయడం చాలా బాధాకరం. నేను నా జట్టును ప్రారంభించిన వెంటనే ముంబైలో నా మొదటి పెద్ద ఫోర్ గోల్ టోర్నమెంట్ ఆడాను. అక్కడ నా గుర్రం, నేను పెద్ద పతనాన్ని ఎదుర్కొన్నాము. కానీ నేను గుర్రం 2పై తిరిగి వచ్చాను. గేమ్ ముగియడానికి నిమిషాల ముందు విజయం సాధించాను'' అని రీనా చెప్పింది.
యువ ఆటగాళ్ళతో ఆట
ఆటకు తను ఎంత అడిక్ట్ అయ్యిందో ఆమెకు అర్థమైంది. అయితే ఫ్రాక్చర్ కావడంతో తీవ్రమైన వెన్నునొప్పి ఏర్పడింది. దీని నుండి కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. కోలుకున్న తర్వాత తిరిగి శిక్షణ కోసం ఒక నెల పాటు ఇంగ్లాండ్ వెళ్ళింది. ''చాలా ఆలస్యంగా ఆటలోకి ప్రవేశించిన నేను మొదటి నుండి శిక్షణ పొందిన యువ ఆటగాళ్లతో ఆడడం వల్ల చాలా కష్టపడాల్సి వచ్చింది. జైపూర్, జోధ్‌పూర్, యుఎస్, ఢిల్లీ, బ్యాంకాక్, పట్టాయా, దక్షిణాఫ్రికా మొదలైన ప్రాంతాలలో ఆడాను. నేను ఎప్పటికీ ఈ క్రీడలో రాణించలేను. అయినా రైడింగ్, కోచింగ్‌లో నేను ఇంకా పని చేస్తూనే ఉన్నాను. దీన్ని కొనసాగిస్తూనే ఉంటాను. ఈ క్రీడలోని వచ్చిన తర్వాత ప్రపంచాన్ని భిన్నంగా చూడగలిగాను. ఒక జంతువు నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. నేను నడిపిన గుర్రాలు నాకు సహనం, ప్రేమ, క్రమశిక్షణ, జట్టు కృషిని నేర్పించాయి. ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని విజయాలు పొందాను. బంధువులు, చుట్టుపక్కల వారు కూడా నన్ను భిన్నంగా చూడడం ప్రారంభించారు. నన్ను చూసి గర్వపడుతున్నారు.'' ఆమె జతచేస్తుంది.
కలలు కనండి
పేరు పొందిన గొప్ప డిజైనర్‌గా, వ్యాపారవేత్తగా. నలభై దాటిన వయసులో దేశంలోనే మొట్టమొదటి పోలో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమె యువతకు ''నిత్యం పెద్దపెద్ద కలలు కనండి. కానీ నిజాయితీగా కష్టపడి పనిచేయండి. ఇతరుల పట్ల కరుణతో ఉంటూ మీ కలలను సాధించండి'' అని చెప్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడి పనిచేయాలని ఆమె జతచేస్తుంది. ''విజయానికి షార్ట్‌కట్ లేదు. నేను జీవితంలో ఏం చేసినా కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి, దాన్ని నా జీవిత లక్ష్యంగా చేసుకుంటాను. కాబట్టి మొదట మీ అభిరుచి, ఆర్థిక పరిస్థితులు ఏంటో అంచనా వేసుకోండి. దాన్ని బట్టి విజయం అనుసరిస్తుంది'' అని రీనా అంటుంది.
చిన్నప్పుడు పోరాడలేక
సమాజం నుండే కాదు కుటుంబం నుండి కూడా సవాళ్ళను ఎదుర్కొంది. సంప్రదాయవాద గుజరాతీ కుటుంబంలో పెరిగిన ఆమెకు పాఠశాలలో చదివే సమయంలోనే అథ్లెటిక్స్‌లో పాల్గొనేందుకు అనుమతి లేదు. ''నా చిన్నతనంలో ఇంట్లో వారితో పోరాటం చేయలేకపోయాను. దాంతో నా కలను వదులుకోవలసి వచ్చింది. 21 సంవత్సరాల వయసులో నా కమ్యూనిటీలోనే సాంప్రదాయ బద్దమైన కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకున్నాను'' అని ఆమె అంటుంది.
విఫలమైనా కూడా...
తను ఎప్పటికీ టాప్ పోలో ప్లేయర్ కాకపోవచ్చు. కానీ 46 ఏండ్ల వయసులో 18-35 సంవత్సరాల వయసు గల ప్లేయర్లతో అందునా పురుషుల క్రీడను ఆడగలిగింది. తాను సాధించిన దాని గురించి గర్వపడుతున్నానని రీనా చెప్పింది. ''ఈ క్రీడ ఆడే అతి కొద్ది మంది మహిళల్లో నేనూ ఉన్నాను. నేనే కాదు ఎవరైనా సరే తమ మనసులో ఏదైనా బలంగా అనుకుంటే సాధించగలరు. దీనికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదని నిరూపించాను. నేను చేయలేను, నా వల్ల కాదు, ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అని ఎవరైనా అనుకుంటే ఇవన్నీ కేవలం సాకులు మాత్రమే. అయితే క్రీడను ప్రారంభించే ముందు నా వయసు, జెండర్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక వేళ ఇందులో విఫలమైనా కనీసం ప్రయత్నించాననే సంతోషం నాలో ఉంటుంది. వాస్తవానికి ఇది చాలా కష్టమైన క్రీడా. అలాగే చాలా ఖరీదైనది కూడా. అందుకే ఇది కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం అయ్యింది'' అని రీనా నిట్టూర్చింది.
- సలీమ