Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున్నే చెత్త మొత్తం తీసేసినా మళ్లీ సాయంత్రం అయ్యేసరికి నిండిపోతుంది. దీనికి ప్రధాన కారణం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. వాటిని పరిహరించుకుంటే చెత్త పరిమాణాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణానికీ మేలు చేసినవాళ్లమవుతాం. మరి మనం సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లేంటో ఓసారి తెలుసుకుందాం రండి..
- 'కాయగూరలు తెచ్చి నాలుగు రోజులవ్వలేదు.. అప్పుడే పాడైపోయాయి' అనుకునే సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. దీనికి కారణం అన్ని రకాల కాయగూరలనూ కలిపి ఒకే పాలిథీన్ కవర్లో పెట్టేయడం. దీనివల్ల కొన్ని రకాల కాయగూరలు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నింటినీ వేరు చేసి విడివిడిగా పెట్టాలి. అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండని కాయగూరల్ని ముందే వండుకోవడం వల్ల వ్యర్థాలను తగ్గించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అవసరమైన వాటికంటే ఎక్కువ వండేస్తూ ఉంటారు. అయితే ఇలా మిగిలిపోయిన వాటిని పడేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ విధంగా చేయడం కంటే అవసరమైనంత మేరకే వండుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ అనుకోకుండా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు వాటిని కంపోస్ట్ ఎరువుగా మార్చే ఏర్పాటు చేసుకోవడం మంచిది. దీని ద్వారా మొక్కలకు ఉపయోగపడే సహజసిద్ధమైన ఎరువుని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
- కొంతమందికి కర్ఛీఫ్కి బదులు టిష్యూ పేపర్లను ఉపయోగించడం అలవాటు. దీంతో చేతులు కడిగినప్పుడు లేదా ముఖం శుభ్రం చేసుకున్నప్పుడు వాటితోనే తుడుచుకుంటూ ఉంటారు. ప్రతిసారి ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో టిష్యూలను వాడేస్తూ ఉంటాం. ఫలితం.. పరోక్షంగా పర్యావరణానికి హాని చేసినవాళ్లమవుతున్నాం. అందుకే టిష్యూల వాడకాన్ని తగ్గించడం మంచిది. తద్వారా చెత్త పేరుకుపోకుండానూ చూసుకోవచ్చు.
- కొన్ని రకాల వస్తువులను తిరిగి వాడుకొనే అవకాశం ఉంటుంది. అయినా వాటిని మనం పడేస్తూ ఉంటాం. అలాగే కొంతమందికి ఒకసారి వాడి పడేసే (యూజ్ అండ్ త్రో) తరహా వస్తువులను ఎక్కువగా ఉపయోగించే అలవాటు ఉంటుంది. ఇలా కాకుండా మళ్లీ మళ్లీ వాడుకొనేలా ఉండే వాటిని ఎంచుకోవడం మంచిది. ఫలితంగా చెత్త తగ్గే అవకాశం ఉంటుంది.
- టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ-వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. కొత్తది మార్కెట్లోకి రాగానే పాతదాన్ని అలాగే వదిలేసి కొత్తగా వచ్చిన వాటిని కొనేసే అలవాటు చాలామందికి ఉంటుంది. మొబైల్స్, టీవీలు, ఫ్రిజ్లు ఇలాంటి వాటిని ఎక్స్ఛేంజ్ చేసి కొత్తవాటిని కొంటూ ఉంటారు. ఇది మంచి పద్ధతే. కానీ కొన్ని సార్లు మరీ పాతవైనా.. పూర్తిగా పాడైపోయినా.. వాటిని అలాగే వదిలేసి కొత్తవాటిని కొంటూ ఉంటారు. ఇలా చేయడం కంటే వాటిని రీసైక్లింగ్ యూనిట్స్కి అందించడం మంచిది. దీనివల్ల ఈ వ్యర్థాలను తగ్గించవచ్చు.