Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధిక బరువుని వదిలించుకుని మిమ్మల్ని మీరు సన్నగా నాజూగ్గా చూడాలనుకుంటున్నారా? కానీ 'ఈ నిర్ణయం ముందే తీసుకోవాల్సింది', 'తిండి విషయంలో నియంత్రణ పెట్టుకోవాల్సింది' లాంటి ఆలోచనలు తరచూ వస్తున్నాయా? అయితే మొదట వీటి నుంచి బయటపడాలంటున్నారు నిపుణులు. పశ్చాత్తాపం సాధారణ లక్షణమే అయినా గతాన్ని పదే పదే గుర్తు చేసుకుని బాధపడటం, నిందించుకోవడం.. వీటి వల్ల చెడు తప్ప మేలు లేదంటున్నారు నిపుణులు. అవమాన భావం, పశ్చాత్తాపం.. వీటితో ఇసుమంత లాభమూ ఉండదు. సానుభూతితో మాట్లాడే వారుంటే మాత్రం ఎంతో మేలు జరుగుతుందంటారు. మీలాంటి శారీరక, మానసిక పరిస్థితిని గతంలో అనుభవించిన వారు, దాన్నుంచి బయటపడిన అనుభవాల్ని పంచుకుంటే మీకూ వర్తమానం మీద దృష్టి పెట్టడం ఎలాగో తెలుస్తుంది. ముఖ్యంగా స్నేహితులూ, సహోద్యోగుల మధ్య వీటి గురించి చర్చనడిస్తే ఆ మార్పు చాలా సాధారణంగానే జరుగుతుందంటారు. వాళ్లు చూపే పరిష్కారాలూ అమూల్యమైనవి.
బరువుకి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనుభవాలూ, మాటలూ.. ఓ చోట రాసుకోండి. అదంతా గతమని ఇప్పుడలాంటి వాతావరణం లేదని మీకు మీరు ధైర్యంగా చెప్పుకోండి. బరువు తగ్గే క్రమంలో ప్రతి దశనూ అంగీకరిస్తూ, ఆస్వాదించేలా మనసుతో మాట్లాడండి. స్నేహితులూ, పిల్లలకు చెప్పినట్టే మీకు మీరు ప్రేమపూర్వకంగా చెప్పుకోండి. అయ్యిందేదో అయ్యింది. ఇంకెప్పుడూ వీటిని గుర్తుచేసుకోనంటూ మీకు మీరు మాటిచ్చుకోండి.
గతంలో మార్పు కోసం ప్రయత్నించినప్పుడు ఎలాంటి ఆటంకాలు ఉండేవో రాసుకోండి. సమయాభావం, అంకితభావం, స్ఫూర్తిలేకపోవడం... వీటిలో కారణాలేంటో రాసుకోండి. వాటిని ఎలా అధిగమించాలని అనుకుంటున్నారో సమాధానం చెప్పుకోండి.
'గతాన్ని అంగీకరిస్తా, భవిష్యత్తుని నిర్మించుకుంటా', 'గతం నా చేతుల్లో లేదు భవిష్యత్తుని ఆనందంగా తీర్చిదిద్దుకోవడం నా బాధ్యత'.. ఇలా స్ఫూర్తినిచ్చే ఒక కొటేషన్ రాసుకుని, మీకు మీరే చెప్పుకొంటూ ముందుకు వెళ్లండి. మార్పు కచ్చితంగా ఉంటుంది.