Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా ఇంట్లో పాత చీరలు ఎన్నో ఉంటాయి. సగం వార్డ్రోబ్ వాటితోనే నిండిపోతుంది. మామూలుగా అయితే దాచినన్ని రోజులు దాచేసి పడేయడమో లేదా ఇల్లు తుడవటానికో, వస్తువులను తుడవటానికో ఉపయోగిస్తుంటాం. అయితే ఒక్క క్షణం ఆగండి. పాత చీరలతో పాటు నచ్చకుండా పక్కన పడేసిన కొన్ని చీరలు కూడా మన దగ్గర ఉంటాయి. అలాంటి వాటితో ఇంటిని వివిధ రకాలుగా అలంకరించచ్చు. తక్కువ బడ్జెట్లోనే ఇంటికి ఆకర్షణీయమైన లుక్‌ని తీసుకురావచ్చు. అదెలాగో తెలుసుకుందాం...
కట్టుకోకుండా మూల పడేసిన చీరలు లేదంటే నెట్టెడ్ చీరల్ని ఇంట్లో కర్టెన్ల లాగా కూడా వాడుకోవచ్చు. వాటిలో కాస్త ఆకర్షణీయమైన రంగులో ఉన్న చీరల్ని ఇంటి కిటికీ, ద్వారానికి సరిపడా కొలిచి.. వాటికి అపోజిట్ రంగులో ఉన్న చీరలతో కర్టెన్ పైభాగంలో ప్యాచెస్ లాగా అంటిస్తే దానికి మరింత అందాన్ని జోడించినవారవుతారు. అయితే గదిలో ఉన్న కిటికీలు, తలుపులన్నింటికీ ఒకే తరహా కర్టెన్లు అమర్చడానికి ఒక చీర సరిపోకపోవచ్చు. కాబట్టి అపోజిట్ రంగులు, దగ్గరగా ఉండే రంగులున్న చీరల్ని ఒకే గది కోసం ఎంపిక చేసుకుంటే బాగుంటుంది.
హాల్, బెడ్రూమ్స్.. వంటి ప్రదేశాల్లో గోడలకు పెద్ద పెద్ద వాల్ ఫ్రేములు అమర్చడం మనకు తెలిసిందే. వాడకుండా పక్కన పడేసిన చీరల్ని ఇంటి అలంకరణలో ఉపయోగించే వాల్ ఫ్రేములుగా, ఫొటో ఫ్రేములుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఫొటోలకు బదులుగా ఫ్రేముల్లో చీరలు అమర్చాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ క్రమపద్ధతిలో అమర్చితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇందుకోసం కూడా అపోజిట్ రంగులున్న చీరల్ని ఎంపిక చేసుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
వాడకుండా మూల పడేసిన చీరల్లో కొన్ని ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లతో కూడుకున్న వాటిని ఎంచుకొని వాటితో దిండ్లకు, కుషన్లకు కవర్లలా కుట్టించచ్చు. అలాగే చీరల్లోని బార్డర్లను ఆ కవర్లకు నలు చివర్లలో వచ్చేలా కుట్టిస్తే.. అవి మరింత ఆకర్షణీయంగా తయారవుతాయి. గదికి కూడా సరికొత్త కళను తీసుకొస్తాయి. వీటితో పాటు కాటన్ చీరలన్నీ కలిపి క్విల్ట్ లాగా కూడా తయారుచేయించచ్చు. ఇలా చీరలతో తయారైన క్విల్ట్, దిండ్లకు తొడిగిన కవర్లను మంచంపై పరిస్తే చూడడానికి అందంగా కనిపిస్తుంది. కావాలంటే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.
ఇంట్లో ఉండే వివిధ వస్తువుల పైన దుమ్ము పడకుండా కప్పడానికి వివిధ రకాల కవర్లను కొంటుంటాం. ఇంత చిన్న వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఇంట్లో వాడకుండా మూల పడేసిన చీరలని ఉపయోగించడం మంచిది. ఫలితంగా బడ్జెట్ కూడా కలిసొస్తుంది. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే చీరల్ని ఎంపిక చేసుకొని మీరు ఏ వస్తువు పైన కప్పాలనుకుంటున్నారో దాని కొలత తీసుకొని వివిధ డిజైన్లలో కుట్టిస్తే సరిపోతుంది. కుచ్చులుకుచ్చులుగా, ప్యాచెస్‌లా.. ఇలా పలు రకాలుగా కుట్టించి వాటిపై అమర్చితే చూడడానికి మంచి లుక్ వస్తుంది.