Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా? అయితే కచ్చితంగా ఇవి మీ కోసమే. తృణధాన్యాలతో ఎన్నో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడ ఎంతో మేలు చేస్తాయి. ఈరోజు మనం వరిగలతో చేసే కొన్ని వంటకాల గురించి తెలుసుకుందాం...
వరిగ ఇడ్లీ
కావలసిన పదార్ధాలు: వరిగ ఇడ్లీ రవ్వ - కప్పు, మినప్పప్పు - ఒక కప్పు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు ఒంపేసి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వరిగ రవ్వలో ఉప్పు వేసి బాగా కలుపుకొని రాత్రంతా పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఇడ్లీ ప్లేట్స్‌కు కొద్దిగా నూనె రాసి వరిగ ఇడ్లీ పిండిని ఇడ్లీ రేకులలో వేసి ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి ఇడ్లీలను పది నిముషాలు ఉడికించాలి. తర్వాత ఇడ్లీ స్టాండును బయటకు తీసి ఇడ్లీలను సపరేట్ చేసి వేడి వేడి సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి.
వరిగ కాజా
కావలసిన పదార్ధాలు: వరిగ పిండి - అర కప్పు, నూనె - డీప్ ఫ్రైకి తగినంత,
గోధుమ పిండి - అర కప్పు, పాకం కోసం బెల్లం పొడి - అర కప్పు, యాలకుల పొడి - టీ స్పూను.
తయారుచేసే విధానం: ఒక పాత్ర తీసుకొని అందులో వరిగ పిండి, గోధుమ పిండి వేసి కలపాలి. వేడి నూనె జత చేసి మెత్తటి ముద్దలా తయారుచేసుకోవాలి. రొట్టెలాగ అంగుళం మందంలో పొడవుగా ఒత్తి రోల్ చేసుకోవాలి. ఆ రోల్‌ని ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి. వెలిగించిన స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక కట్ చేసి ఉంచుకున్న కాజాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో బెల్లం పొడిని వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచాలి. తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి. యాలకుల పొడి వేసి దింపేయాలి. వేయించి పక్కన పెట్టుకున్న కాజాలను పాకంలో వేసి సుమారు అర గంట సేపు మూత పెట్టి ఉంచాలి. బాగా పాకం పీల్చుకున్న కాజాలను తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి.
వరిగ సమోసా
కావలసిన పదార్ధాలు: వరిగ పిండి - కప్పు, ఆలూ - రెండు, ఉల్లి తరుగు - పావు కప్పు, నూనె - తగినంత, గోధుమ పిండి - కప్పు, ఉప్పు - తగినంత, ఆవాలు - టీ స్పూను, ఉడికించిన బఠాణీ - పావు కప్పు, తరిగిన పచ్చి మిర్చి - మూడు, కరివేపాకు - ఒక రెమ్మ.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో వరిగ పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా ముద్ద చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా ఒత్తి, మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఆలూ ఉడికించి తొక్క తీసి, చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె పోసి కాచాలి. ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. ఉడికించిన బఠాణీ, ఉడికించిన ఆలూ, ఉప్పు జత చేసి అన్ని కలిసేలా బాగా కలియబెట్టి దింపేయాలి. ఒత్తుకున్న చపాతీలను సమోసా ఆకారంలో చుట్టి, అందులో ఆలూ మిశ్రమం కొద్దిగా పెట్టి మూసేయాలి. ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి. స్టౌమీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. వేడి వేడీ వరిగ సమోసాలను టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.