Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్వత్ గులాంకర్ బగ్వాన్... ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు ఆమెను అసహ్యించుకున్నారు. ఎన్నో హింసలు పెట్టారు. బాధలు భరించలేక వివాహ బంధం నుండి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఎన్నో అవమానాలకు గురి చేసింది. హింసను భరించడం కంటే తన బతుకు తాను బతకడమే మంచిదని ధైర్యం చేసింది. ఆర్థికంగా ఒకరిపై ఆధారపడకుండా తన కాళ్ళపై తాను నిలబడాలనే ఉద్దేశంతో బేకరీని ప్రారంభించింది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారవేత్తగా గుర్తింపు పొందింది.
భర్త ఎన్ని హింసలు పెట్టినా అతనితోనే జీవితం. భరించలేక వదిలిపెట్టాలనుకున్నా సమాజం అంగీకరించదు. సమాజంలోని అట్టడుగు వర్గాల మహిళలకు ఇది మరీ కష్టం. గృహహింసను భరిస్తూ అలాగే జీవితాన్ని గడిపేవారు ఎందరో ఉన్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఆర్థిక సమస్యలు. భర్త లేకపోతే పిల్లల్ని ఎలా పోషించుకోవాలి అనే బాధ వెంటాడుతుంటుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5 నివేదిక ప్రకారం భారతీయ మహిళల్లో దాదాపు మూడింట ఒకవంతు మంది శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారు. దేశంలో మహిళలపై గృహ హింస 31.2 శాతం నుంచి 29.3 శాతానికి తగ్గినా 18 నుంచి 49 ఏండ్ల మధ్య వయసున్న మహిళల్లో దాదాపు 30 శాతం మంది శారీరక హింసకు గురవుతున్నారని నివేదిక పేర్కొంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 30 శాతం మందిలో 14 శాతం మంది మహిళలు మాత్రమే తాము అనుభవిస్తున్న హింసను బయటకు చెప్పుకోవడానికి ధైర్యం చేస్తున్నారు.
హింసను భరించలేక
మహారాష్ట్రలోని సతారాకు చెందిన సర్వత్ గులాంకర్ బఘవాన్ తన మొదటి అడుగు వేయాలని నిర్ణయించుకుంది. 2000వ దశకం ప్రారంభంలో సర్వత్ హింసాత్మక వివాహ బంధాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు ఆమె మహారాష్ట్రలోని సతారాలో అభివృద్ధి చెందుతున్న బేకరీ వ్యాపారమైన మరియా బేకర్స్ అండ్ ఫుడ్స్‌కు యజమాని. ''పెండ్లి తర్వాత జీవితం నేను అనుకున్నట్టుగా లేదు. ఆడపిల్ల పుట్టిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నా తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ నా బిడ్డను పెంచడానికి నా దగ్గర డబ్బు లేదు. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నాను. అప్పటి వరకు బయటకు వెళ్ళి ఎప్పుడూ పని చేయలేదు' అని సర్వత్ అంటున్నారు.
తొలిరోజుల్లో...
వెనుకబడిన కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన సర్వత్ జీవితంతో పోరాటం మొతలుపెట్టింది. తన తండ్రికి ఆహార వ్యాపారంలో సహాయం చేయడం ద్వారా తన పని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని వివిధ దుకాణాలకు పంపిణీ చేయడం మొదలుపెట్టింది. అయితే ఆమె తండ్రికి గుండెపోటు రావడంతో ఆ వ్యాపారం నిలిచిపోయింది. సర్వత్ మళ్ళీ మొదటి దశకు తిరిగి వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో తల్లిదండ్రులు నడిపే బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రంగంలోకి దిగింది. సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టాలనే ఆమె ఆలోచనను తల్లిదండ్రులు ప్రోత్సహించారు.
మామయ్య సలహాతో...
''మా మామయ్య నాకు కొత్త దృక్పథాన్ని ఇచ్చాడు. నా తల్లిదండ్రులు బేకరీ నడిపేటపుడు ఇతర వ్యక్తులు తయారుచేసిన ఉత్పత్తులను విక్రయించేవారు. అయితే నేను నా సొంత ఆహార ఉత్పత్తులను తయారు చేసి విక్రయించాల్సిందిగా అని మా మామయ్య సలహా ఇచ్చాడు. దాన్ని ఆచరణలో పెడితే నేను మరింత సంపాదించగలను. ఇది నన్ను ఉత్తేజపరిచింది'' అని సర్వత్ చెప్పారు.
ఆశ కోల్పోలేదు
సర్వత్ సాంప్రదాయ భారతీయ షార్ట్బ్రెడ్ బిస్కూట్ అని పిలువబడే నంఖాటైని ఎలా తయారు చేయాలో అతి తక్కువ కాలంలోనే నేర్చుకుంది. అయితే వ్యాపారం ప్రారంభ రోజులు చాలా కష్టతరమైంది. సర్వత్ పరిపూర్ణ నంఖాటైని నేర్చుకోవడానికి వారాల అభ్యాసాన్ని తీసుకున్నట్టు చెబుతున్నారు. ''కొన్నిసార్లు సోడా, మరి కొన్నిసార్లు చక్కెరను వేయడం మరచిపోయేదాన్ని. చాలా సార్లు అవసరానికి మించి వండేదాన్ని. ముడి పదార్థాలను కొనాల్సి వచ్చినందున ఇవన్నీ నాకు ఆర్థిక నష్టానికి దారితీశాయి. కానీ నేను ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. ఎంత నేర్చుకుంటే అంత నైపుణ్యం వస్తుందని నాకు తెలుసు'' అని సర్వత్ గుర్తుచేసుకున్నారు.
సమయం పట్టింది
బేకరీని నిర్మించడానికి వివిధ ఫైనాన్షియర్ల నుండి కొంత రుణం తీసుకున్నారు. 2004లో మరియా బేకర్స్ అండ్ ఫుడ్స్‌ను ప్రారంభించారు. తన బేకరీ వంటగదిని అభివృద్ధి చేయడానికి తనకు సమయం పట్టిందని, అయితే కొత్తదాన్ని కొనుగోలు చేయడానికి పీక్ సీజన్ల నుండి వచ్చిన లాభాలను మళ్లీ పెట్టుబడి పెట్టేలా చూసుకున్నానని ఆమె చెప్పింది. దాని కోసం ఓవెన్ అట్టా పిసికి కలుపు యంత్రం, ఛాపర్ ఉపయోగించింది. ''ఈ యంత్రాలు నా సమయాన్ని ఆదా చేయడంలో, మెరుగైన సామర్థ్యాన్ని పెంచుకోవడంలో సహాయపడ్డాయి'' అని ఆమె చెప్పారు.
విదేశాలకు పంపిస్తారు
మరియా బేకర్స్ అండ్ ఫుడ్స్ వివిధ రకాల కుకీలు, రస్క్‌లు, బిస్కెట్లు, పఫ్లతో పాటు ఇతర బేకరీ వస్తువులను విక్రయిస్తుంది. అలాగే బేకరీ పీస్ డి రెసిస్టెన్స్ దాని నాన్ఖాటై బిస్కెట్లను రోజుకు దాదాపు 15-20 కిలోలను చేస్తుంది. నంఖాటైను విదేశాలలో నివసిస్తున్న తమ ప్రియమైనవారి కోసం కొనుగోలు చేసి పంపిస్తుంటారని ఆమె చెబుతున్నారు. సర్వత్ ఇప్పుడు కేక్‌లను తయారు చేసే కళలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించారు. ప్రస్తుతం మరియా బేకర్స్ 20కి పైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది.
సాఫీగా సాగలేదు
బేకరీ సగటున నెలకు రూ. 1 లక్ష కంటే కొంచెం ఎక్కువ సంపాదిస్తుంది. సర్వత్ తనకు సహాయంగా మరో ఐదుగురు మహిళలను నియమించుకున్నారు. అయితే ఇంత వరకు ఆమె ప్రయాణం సాఫీగా సాగలేదు. ఆ ప్రయాణం ఎంతో విలువైనదని ఆమె చెప్పారు. వ్యవస్థాపక ప్రయాణంలో మన్ దేశీ ఫౌండేషన్, GIS యొక్క హర్ నౌ ప్రాజెక్ట్ సహాయపడింది. అలాగే MSME, FSSAI సంస్థలు ఆమె లైసెన్సులను పొందడంలో సహాయపడ్డాయి. అంతేకాదు వారు ఆమెకు ఫేస్బుక్లో వ్యాపార ఖాతాను నిర్వహించడం, ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించే ప్రాథమిక అంశాల గురించి కూడా శిక్షణ ఇచ్చారు.
మొదటి మెట్టుగా మారింది
నాలుగు సంవత్సరాల కిందట సర్వత్ తన వ్యాపారం నుండి వచ్చిన లాభాలతో బేకరీని మరింత అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆమె తన బేకరీని ఫాస్ట్ ఫుడ్ విక్రయించే కేఫ్‌గా మార్చాలని యోచిస్తోంది. ''భవిష్యత్తులో ఎన్నో చేయాల్సి వున్నాయి. వాటికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. మరియా బేకర్స్‌ను ఓ బ్రాండ్‌గా మార్చాలనుకుంటున్నాను'' అని ఆమె చెప్పారు. సర్వత్ కూతురికి ఇప్పుడు 19 ఏండ్లు. ఆమె హోమియోపతిలో మెడిసెన్ చేస్తుంది. ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు ఎన్నో అవమానాలకు గురైన సర్వత్ తనకు ఇష్టం లేని జీవితం నుండి బయటకు వచ్చింది. అదే తాను జన్మనిచ్చిన బిడ్డకు మంచి జీవితాన్ని అందించేందుకు మొదటి మెట్టుగా మారింది.
- సలీమ