Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి దానికి కంగారు పడటం మనలో చాలా మందికి మామూలే. చిన్న చిన్న విషయాలకీ నాలుగైదు సార్లు ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోం. రేపు ఇంటర్వ్యూ ఉంది! ఏం ప్రశ్నలు అడుగుతారో అని కంగారు. దీంతో తెగ చదివేస్తున్నారనుకోండి ఫర్లేదు. అలాకాక 'కచ్చితంగా రాదు', 'నావల్ల కాదు' అని ముందే ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నానుకోండి.. అది మాత్రం ఇబ్బందే. ఇదే కాదు ప్రతి దానిలోనూ ఆలోచన శ్రుతి మించుతోంటే ప్రమాదమంటున్నారు నిపుణులు.
రేపు ఏమవుతుందోనన్న ఆలోచన సహజంగా ఎక్కువయ్యేది రాత్రుళ్లే. రాత్రి సమయంలో మెదడులో తార్కికంగా పనిచేసే భాగం విశ్రాంతిలోకి వెళుతుంది. దీంతో భావోద్వేగాలు మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి భవిష్యత్ గురించి ఆలోచించడానికి అది సరైన సమయం కాదు. రేపు ఏమవుతుందోనన్న ఆలోచనను ఆ సమయంలో దరి చేరనివ్వకండి. తొందరపడి నిర్ణయాలనూ తీసుకోకండి. ఉదయానికి వాటిని వాయిదా వేయడం మంచిది.
మీకంటే చిన్నపిల్లలు రేపు పరీక్ష ఉందనో, పాఠం సరిగా చదవలేదనో కంగారు పడుతున్నారనుకోండి. ఏం చేస్తారు? ఫలానా విధంగా చదవమనో, మరోటో సలహానిచ్చి సర్ది చెబుతారు. అలాగే మీరేదైనా విషయంలో భయపడుతోంటే మీకు మీరూ అలాగే చెప్పుకోవాలి. ముందు ఎవరు ఏమనుకుంటారోనన్న భావనను పక్కన పెట్టండి. మీరెంత వరకూ కృషి చేశారన్న దానిపైనే దృష్టిపెట్టండి.
గత వైఫల్యాలు ప్రతిదాన్నీ ప్రతికూల కోణంలో చూసేలా చేస్తాయి. నిజమే ఒకదాని తర్వాత ఒకటి వైఫల్యం ఎదురవుతోంటే మనసు గాయపడటం మామూలే. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఈ భయమే మిమ్మల్ని అటువైపు నెడుతోందేమోనని! ఈసారి తప్పిదాలను తలచుకోక.. భవిష్యత్లో ఎలా చేస్తే విజయం సాధించవచ్చు అన్న దిశగా ఆలోచించండి. ఇవి మీలో సానుకూలతను నింపడంలో సాయం చేస్తాయి.
కొంచెం తోడ్పాటు, సానుభూతి.. ఇవి నిరాశ నిస్పృహలు, ఒత్తిడి నుంచి బయటపడేసే మార్గాలు. అందుకే వాటిని అందించే వ్యక్తుల కోసం చూడండి. సమస్యను పూర్తిగా వినేవాళ్లు దొరికినా మనసులో భారం తగ్గుతుంది. వాళ్ల నుంచి సలహాలు అందడమే కాదు.. మనసూ కొత్త దిశగా ఆలోచిస్తుంది.