Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆమె పేరు చిరస్మరణీయం. వైద్యురాలిగా ఆమె చేసిన సేవలు అజరామరం. స్వాతంత్య్రోద్యమంలో క్షతగాత్రులైన సైన్యానికి విశిష్టమైన సేవలు అందించారు. ఆ తర్వాత పేదలకు, కార్మికులకు, శరణార్థులకు ఉచిత వైద్యం చేసి ప్రాణాలు నిలిపారు. అంతకు మించి మరో చరిత్ర సృష్టించారు. సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఝన్సీరాణి రెజిమెంటుకు అధినేత్రిగా వ్యవహరించారు. ప్రపంచ చరిత్రలో మహిళా పోలీసులు, మహిళా సిపాయిలు ఉండవచ్చు కానీ స్త్రీలలో ఒక రెజిమెంట్‌గా బాధ్యతలు చూడడం అంతకు ముందు ఎక్కడా జరగలేదు. ఆ ఘనత ఆమెకే దక్కింది. ఆమే కెప్టెన్ లక్ష్మీ సెహగల్. ఈరోజు ఆమె వర్థంతి సందర్భంగా ఆ సాహసనారి పరిచయం నేటి మానవిలో...
సింగపూర్‌లో భారత మహిళలు అప్పట్లో తేయాకు తోటలలో వెట్టి చాకిరి చేసేవారు. వారిపై యజమానులు లైంగికదాడులు చేసేవారు. అటువంటి మహిళలందరినీ లక్ష్మీ చైతన్యపరిచారు. నేతాజీ సమక్షంలో ఐదు వేల మంది మహిళలను సమావేశపరిచారు. ఎంతో ఉత్సాహంతో మేమూ స్వాతంత్రులమే, మేము సైనికులం, మా మీద ఇక ఎవరి పెత్తనమూ ఉండదని తమకు అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు ఉత్తేజపడ్డారు. వారిలో 15వందల మందికి సైనిక శిక్షణ పొందారు. ఝాన్సీరాణి రెజిమెంటులో వెయ్యి మంది సర్వ సన్నద్ధులుగా యుద్ధభూమిలో నిలిచారు. 200 మంది నర్సులుగా సేవలందించారు.
కుటుంబ నేపథ్యం
ప్రముఖ న్యాయవాది ఎస్.స్వామినాథన్, స్వాతంత్య్ర సమర యోధురాలు, సామాజిక కార్యకర్త ఎవి అమ్ముకుట్టి దంపతులకు 1914 సెప్టెంబరున లక్ష్మి జన్మించారు. ఆమెకు అన్నయ్య గోవింద్, తమ్ముడు సుబ్రం, చెల్లెలు మృణాలిని ఉన్నారు. అమ్ముకుట్టి కేరళలోని నాయర్ కుటుంబానికి చెందినవారు. స్వామినాథన్ పాలక్కడ్‌కు చెందిన బ్రాహ్మణుడు. పాలక్కడ్ జిల్లాల్లోని అనకార గ్రామంలో నివసిస్తున్న అమ్మమ్మ ఎ.వి. లక్ష్మికుట్టి వద్దరు లక్ష్మి అప్పుడప్పుడు వెళుతుండేవారు. నాయర్లలోని మాతృస్వామిక జీవితంలోని ధీరత్వం, సామర్ధ్యం మూర్తీభవించిన అమ్మమ్మ కార్యకలాపాలన్నీ లక్ష్మి అబ్బురంగా గమనిస్తుండేవారు. మాతృస్వామికంలో కుటుంబ ఆస్తికి స్త్రీలే హక్కుదారులు. అందుచే లక్ష్మి అమ్మమ్మ చాలా స్వతంత్ర భావాలతో ఉండేవారు. గ్రంధ పఠనంలో బైబుల్, ఖురాన్, మళయాళ అనువాదాల్ని కూడా చదివేవారు. లక్ష్మికి బాల్యం నుండే పుస్తక పఠనం, గుర్రపు స్వారీ, ఈత, టెన్నిస్‌లో ప్రవేశం ఉంది. లక్ష్మి మేనమామ గాంధేయవాది. గాంధీజీ స్ఫూర్తితో అమ్ముకుట్టి, అంటరానితనాన్ని వ్యతిరేకించారు. విదేశీ వస్త్ర బహిష్కరణ పిలుపును అనుసరించారు.
స్వాతంత్రోద్యమ ప్రభావం
మద్రాసు చర్చ్‌పార్క్ కాన్వెంటులో ప్రాధమిక విద్య తర్వాత లక్ష్మి ప్రభుత్వ పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేశారు. అదే సంవత్సరం మద్రాసు క్వీన్ మేరాజ్ కాలేజీలో చేరారు. కాలేజీలో జాతీయోద్యమంలో మరింత చురుకుగా పని చేయసాగారు. దక్షిణ భారతదేశాన సంఘ సంస్కరణోద్యమాలతో కలగలిసి, స్వాతంత్రోద్యమం నడిచేది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, దళితులకు దేవాలయ ప్రవేశాన్ని కోరుతూ ఆందోళనలు సాగేవి. 1920ల్లో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని కోరుతూ దక్షణాదిన ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిపడ్డాయి. 1931-32లో జరిగిన భగత్‌సింగ్ విచారణ యువతపై ఎనలేని ప్రభావాన్ని చూపించింది. ఆ సందర్భంగా భగత్‌సింగ్‌కు మద్ధతుగా లక్ష్మి విద్యార్థుల సమావేశాలు జరిపేవారు. హర్తాళ్ళకు నాయకత్వం వహిస్తూ విరాళాలు వసూలు చేసేవారు.
కమ్యూనిస్టు సిద్ధాంత పరిచయం
1932లో వైద్య కళాశాలలో చేరారు. అక్కడే తొలిసారిగా కమ్యూనిస్టు సిద్ధాంత పరిచయం. సరోజినీ నాయుడు సోదరి సుహాసిని భారతదేశానికి సరైన రాజకీయ వ్యవస్థ కమ్యూనిజమే అని వాదించేవారు. కమ్యూనిస్టు ఉద్యమంపైన లక్ష్మి తొలిసారి చదివిన పుస్తకాల్లో ఎడ్గార్‌స్నో రచించిన చైనాపై అరుణతార ముఖ్యమైంది. డాక్టరు చదువు పూర్తయిన చివరి ఏడాది లక్ష్మి టాటా ఎయిర్వేస్ పైలెట్‌ను వివాహం చేసుకున్నారు. 'అతను నా భావాలకు వ్యతిరేకం. పైగా నాపై తనదే పూర్తి అధికారం అని నియంతగా ఉండేవాడు' అని లక్ష్మి ఒకానొక సందర్భంలో చేప్పారు. సింగపూర్‌లో బ్రిటిష్ సైన్యం మహిళా వైద్యుల్ని చేర్చుకుంటున్నదని తెలిసిన లక్ష్మి 1940లో అక్కడికి వెళ్ళారు. అక్కడ కేరళకు చెందిన ఒక వైద్య స్నేహితుని హస్పిటల్లో డాక్టరుగా పని ప్రారంభించారు. అప్పటికి లక్ష్మికి 26 ఏండ్లు. అక్కడకు వెళ్ళిన మూడేండ్ల తర్వాత నేతాజీతో సమావేశమయ్యారు. 5,6 గంటల ఆ సుదీర్ఘ సమావేశం ఆమె జీవితాన్నే మార్చివేసింది.
భారత సైన్యం ఏర్పాటు
1911లో ఇండియన్ నేషనల్ ఆర్మి స్థాపించినట్టుగా ప్రకటించారు. సింగపూర్‌లో జాతీయవాదులైన భారతీయులు చాలామంది ఉన్నారు. 1943 అక్టోబరులో 1500 మహిళలు తొలి శిక్షణా శిబిరం రంగరూన్ (బర్మా)లో రెండవ రెజిమెంట్ శాఖను కూడా ఏర్పాటు చేశారు. అంతా దాదాపు బెంగాలీ మాట్లాడే స్త్రీలే. కార్యకర్తల శిక్షణా శిబిరాలు, పరిపాలనా బాధ్యతలు లక్ష్మి చూసేవారు. అన్ని ముఖ్యాంశాలలో లక్ష్మి పాలుపంచుకునేవారు. బర్మా ప్రాంతాన ఐ.ఎన్.ఏ రెజిమెంట్లు మార్చి నుండి జూన్ వరకు యుద్ధం చేశారు. యుద్ధంలో గాయపడిన సైనికులకు ఝాన్సీరాణి రెజిమెంటు సభ్యులు నర్సులుగా సేవలందించారు. ఇంఫాల్ సమీన (1945 మార్చి) ఉన్నప్పుడు సైనికుల్ని వెనక్కు మళ్ళించాలన్న నిర్ణయం జరిగింది. నేతాజీ సైగాన్ వెళ్ళారు. 1945 ఆగస్టున టోక్యోకు పయనమవగా విమాన ప్రమాదంలో నేతాజీ దుర్మరణం పాలయ్యారు.
అరెస్టు, విచారణ
1945 మే నెలలో బ్రిటిష్ సైనికులు అటవీ ప్రాంతాన కెప్టెన్ లక్ష్మిని అరెస్టు చేశారు. మొదటి నెలలో ఆమెను గృహనిర్భందంలో ఉంచారు. అక్కడ ఐ.ఎన్.ఎ కు చెందిన ఒక సిక్కు కుటుంబానికి మందుల దుకాణమున్నది. అక్కడి నుండి లక్ష్మి వైద్య సేవలందించారు. 1945 అక్టోబరు 21న రంగూన్లో ఐ.ఎన్.ఏ సిపాయిలు, మద్దతు దార్లతో కూడిన పెద్ద సమావేశం జరిగింది. ఆ సభకు పలువురు భారతీయ జర్నలిస్టులు హాజరయ్యారు. వారు పంపిన వార్తల ద్వారానే ఐ.ఎన్.ఎ విశేషాలు భారత ప్రజలకు తెలిసేవి. దానితో ఆందోళన చెందిన బ్రిటిష్ ప్రభుత్వం బర్మా కొండ ప్రాంతానికి లక్ష్మిని మార్చింది. 1945 అక్టోబరు నుండి 46 మార్చి వరకు ఆమె అక్కడే ఉన్నారు. అనంతరం విచారణ కొరకు భారత్‌కు తరలించారు. 1945 నవంబరు 5వ తేదీ నుండి డిసెంబరు 31 వరకు విచారణ సాగింది. దేశం కోసం వీరు చేసిన యుద్ధం న్యాయసమ్మతమే అని వీరి తరపున న్యాయవాదులు వాదించారు. ఎర్రకోటలో మార్షల్ విచారణ ముగిసింది. ఐ.ఎన్.ఎ వీరులకు వారి వారి రాష్ట్రాలలో ఘన స్వాగతం లభించింది.
ఐద్వాకు ఉపాధ్యక్షురాలిగా
ఆమె ఎప్పటి నుండో జాతీయస్థాయిలో ఒక మహిళా సంఘం ఏర్పాటు చేయాలని నొక్కి చెప్తుండేవారు. 1981లో అఖిల భారత మహిళా సంఘం ఏర్పడినపుడు లక్ష్మి సెహగల్ ఉపాధ్యక్షురాలయ్యారు. 1984లో భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫాక్టరీలో విషవాయువులు విడుదలై వేలాది మంది మరణించారు. లక్ష్మి వెంటనే ఒక వైద్య బృందాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ బాధితులకు వైద్య సహాయం అందించారు. అనంతరం గర్భిణీ స్త్రీలపైన విషవాయువు వల్ల దీర్ఘకాలంలో ఏర్పడే దుష్పరిణామాలపై ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
దేశమంతా పర్యటించి
2002లో భారత రాష్ట్రపతి పదవికి బిజేపీ ప్రభుత్వం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రముఖ శాస్త్రవేత్త డా. అబ్దుల్ కలామ్ అభ్యర్థిగా ఎంపిక చేయగా, వామపక్ష పార్టీలు డా. లక్ష్మీ సహగల్‌ను పోటీకి పెట్టారు. అబ్దుల్ కలామ్ పైన ఆమె సాధిస్తుందని ఎవరికీ భ్రమలు లేవు. కాంగ్రెస్ కూడా కలాంకి మద్దతు ప్రకటించింది. ఆ సమయంలో 87 సంవత్సరాల డా. లక్ష్మీ సెహగల్ దాశవ్యాపితంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఉత్సాహపూరితంగా సభలలో పాల్గోని మనదేశ లౌకిక చరిత్ర, జాతీయోద్యమ విలువల్ని ప్రజలకు గుర్తుచేశారు. స్వాతంత్య్రాయంతరం ప్రజాస్వామ్యం సామ్యవాదం కోసం జరిగిన ప్రగతిశీల ఉద్యమాలను జ్ఞాపకం చేశారు. అంత పెద్ద వయసులో కూడా చమత్కారాల మేళవింపులో ఆమె ప్రసంగాలు సాగాయి. ప్రజలకు ఉత్తేజాన్ని, స్పూర్తిన్ని కలిగించారు.
ఆమె జీవితం గొప్ప సందేశం
1980ల్లో విజయవాడలో జరిగిన మహిళా సంఘం కేంద్రకమిటీ సమావేశాల సందర్భంగా కేప్టెన్ లక్ష్మీని పశ్చిమ గోదావరి జిల్లాకు ఆహ్వానించి పాలకొల్లులో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసాము. ఆ సభలో ఆమెకు ఆఫ్ అనర్ ఇచ్చి మహిళా సంఘం పేరుతో పెద్ద క్రాస్ బేల్ట్ వేసి సన్మానం చేశాము. 1988లో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆమెతో కలిసి కాన్పూర్ వెళ్ళాను. నన్ను ఆమె ఇంటికి తీసుకెళ్ళి సెహగల్ గారికి పరిచయం చేశారు. ఆమె 90 సంవత్సరాల పండు వయసులో సహితం కాన్పూర్‌లోని తన ఆసుపత్రిలో రోగులకు వైద్యం చేశారు. పేదలకు ఉచిత వైద్యం చేస్తూ పేదరికం, అన్యాయంపై యుద్దం చేస్తూనే తన చివరి అద్యాయం ముగించారు. 2012 జులై 23న తన తుది శ్వాస విడిచారు. మానవజాతికి ఆమె జీవితమే గొప్ప సందేశం. మరో స్వాతంత్య్రోద్యమానికి మేల్కొలుపుగా ఆమె చరితం అజరామరం.
పేదలకు, శరణార్థులకు వైద్య సేవలు
ఐ.ఎన్.ఎ కేసులో ముఖ్యులలో ఒకరైన కల్నర్ ప్రేమ్ కుమార్ సెహగల్ని కెప్టెన్ లక్ష్మి 1947 మార్చిలో వివాహం చేసుకున్నారు. లాహౌరు నుండి లక్ష్మి దంపతులు కాన్పూరు చేరారు. లక్ష్మీ సెహగల్ వెంటనే తన వైద్యవృత్తిని ప్రారంభించారు. పాకిస్థాన్ నుండి వచ్చిన కాందిశీకులకు, హిందూ, ముస్లిం తేడా లేకుండా లక్ష్మి పునరావాసం కల్పించారు. మతపరమైన ద్వేషాలు చెలరేగిన ఆ కాలంలో ముస్లిం రోగులకు వైద్యం చేసిన ఏకైక డాక్టరు కెప్టెన్ లక్ష్మీ సెహగల్. వీరికి ఇద్దరు కుమార్తెలు. సుభాషిణి, అనీష. లక్ష్మి తన వైద్య సేవలన్నీ పేద వర్గాలకు, కార్మికులకే అందించారు. కాన్పూరులోని పత్తి మిల్లు కార్మికులే అధికశాతం ఉండేవారు. అలాగే లాహౌరు నుండి వచ్చిన శరణార్థులు ఎక్కువగా ఉండేవారు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేసిన శరణార్థుల శిభిరాలలో సేవ చేయుటకు డాక్టర్లు మందులు, బట్టలు కావాలని పత్రికలలో ప్రకటించారు. ఆ ప్రకటన చదివి స్పందించిన లక్ష్మి వెంటనే మందులు, బట్టలు తీసుకొని వెళ్ళి సరిహద్దు ప్రాంతాలలో రాత్రీపగలు విరామం లేకుండా సేవలందించారు. ఈమె విభిన్న సమాజిక ఆర్థిక నేపధ్యాల నుండి వచ్చిన మహిళల సాధక, బాధకాలు పరిశీలించేవారు.
సేకరణ: అల్లూరి అమ్మాజీ