Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాగా చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలి అనేవి తల్లిదండ్రులు సాధారణంగా తమ పిల్లలకు చెప్పేమాటలు. మనిషిగా పుట్టినందుకు మన వంతు బాధ్యతగా సమాజానికి ఏదైనా చేయాలనే మాటలు చాలా తక్కువ మంది మాత్రమే వింటుంటారు. అలాంటి వారిలో ఆర్తి శ్రీనివాస్ కూడా ఉంది. తమ సొంత దేశానికి ఏదైనా చేయాలని తల్లిదండ్రులు చెబుతున్న మాటలను వింటూ పెరిగింది. భారతదేశంలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా రీసెర్చ్ చేసింది. ఇక్కడి పేద పిల్లలకు సరైన వైద్య సదుపాయాలు లేవని గుర్తించింది. అందుకే వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంది. దానికోసమే తాను నివసిస్తున్న యుఎస్‌లో అత్యంత చిన్న వయసులోనే 'ప్రిజర్వింగ్ స్టూడెంట్స్ హెల్త్ ఫౌండేషన్' ఏర్పాటు చేసింది.
ఆర్తి శ్రీనివాస్ మేరిల్యాండ్‌లో పుట్టింది. అక్కడే ప్రస్తుతం వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో అకాడమీ ఆఫ్ హెల్త్ ఫొపెషన్స్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తండ్రి శ్రీనివాస్ తిరుమలశెట్టి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పుట్టి పెరిగారు. యుఎస్‌లో ఎంబిఏ చేసి టి.రోవ్ ప్రైస్, మేరీల్యాండ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. తల్లి సుజాత చెన్నైలో పుట్టి పెరిగింది. పబ్లిక్ ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత ఆమె భర్తతో కలిసి యుఎస్‌కు వెళ్ళింది. ప్రస్తుతం ఆమె మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కౌంటీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచర్‌గా పని చేస్తుంది.
సొంతంగా రీసెర్చ్ చేసింది
చిన్నప్పుడు నుండి తల్లిదండ్రులు ఆర్తికి మన భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, సరైన వైద్య సదుపాయాలు లేక పోవడం గురించి చెబుతుండేవారు. దాంతో భారతదేశంలోని పేద పిల్లలకు ఏదైనా చేయాలని భావించింది. దాని కోసం రెండు సంవత్సరాలు రీసర్చ్ చేసింది. గూగుల్‌లో సర్చ్ చేసి ఇండియాలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉంటాయో అధ్యయనం చేసింది. ఇక్కడి పిల్లలు సరైన వైద్యం లేక ఇబ్బంది పడుతున్నారని, వారికి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ ఆలోచనతోనే ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది.
ఫండ్స్ రైజింగ్ కోసం
ఆర్తి చిన్నతనం నుండి ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటుంది. అక్కడి లైబ్రరీకి వెళ్ళి వాలెంటీర్‌గా వర్క్ చేసింది. అక్కడికి వచ్చే చిన్న పిల్లలక రీడింగ్ సపోర్ట్ అందించేంది. అలాగే అక్కడి అనాథ పిల్లలకు శాండ్విచ్లు, పేద మహిళలకు శానిటరీ ప్యాడ్స్ వంటివి పంపిణీ చేసేది. అలాగే అక్కడి తెలుగు సంఘాల వారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసినా, క్యాంప్‌లు నిర్వహించినా వాలెంటీర్‌గా పని చేస్తుంది. మూడు నెలల కిందట మేరిల్యాండ్లోని వారి ఇంటి తోటలో తల్లి సహకారంతో 200 టమాటో చెట్లను పెంచింది. అవి కాస్త ఎదిగిన తర్వాత అమ్మి ఆ వచ్చిన డబ్బును ఇండియాలోని పిల్లలకు వైద్యంలో అవగాహన కలించేందుకు ఉపయోగిస్తుంది. అలాగే తన తండ్రి పని చేసే ఆఫీసులో కూడా ఒక లెటర్ పెట్టుకుంది. తాను చేయబోతున్న సేవా కార్యక్రమాలకు సహకరించమని తన ప్రాజెక్ట్ గురించి వివరంగా రాసి ఒక లెటర్ తండ్రికి ఇచ్చింది. ఇది ఆ పిల్లల మెరిట్‌ను బట్టి ఇస్తారు. ఆర్తి చిన్నప్పటి నుండి చదువులో అగ్రభాగంలో ఉండేది. చదువులో ఫస్ట్ వుండటంతో పాటు ఇంత చిన్న వయసులో ఆర్తి సేవా భావానికి వారు ముగ్దులై 5 లక్షల రూపాయలు ఫండ్‌గా మంజూరు చేశారు. అలాగే తాను పసిపిల్లగా ఉన్నప్పటి నుండి ఆడుకున్న బొమ్మలన్నింటినీ జాగ్రత్తగా ఉంచి వాటన్నింటినీ ఫండ్ రైజింగ్ కోసం అమ్మేసింది.
డాక్టర్ కావాలని
ఇటీవల సెలవులకు ఇండియా వచ్చిన ఆమె ఇప్పటి వరకు యుఎస్‌లో సేకరించిన ఫండ్‌తో ప్రేరణ ఫౌండేషన్‌తో కలిసి ఒంగోలులోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శానిటరీ ప్యాడ్స్ పంపిణి చేసింది. ఈ నెల 30వ తేదీన చెన్నైలో ఓ అనాథాశ్రమంలోని పిల్లలకు హెల్త్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. చదువు, సేవాకార్యక్రమాలే కాకుండా ఆర్తి టెన్నీస్ ఆడటంలో, స్విమ్మింగ్ చేయడంలో, పియానో వాయించడంలో కూడా ప్రవీణ్యం సంపాదించింది. బ్యాట్మింట్లో గోల్డ్‌మెడల్ కూడా సాధించింది. చెస్ కూడా చాలా బాగా ఆడుతుంది. అలాగే స్కూల్ నుండి వచ్చిన తర్వాత ప్రతి రోజూ సాయంత్రం గంటసేపు పిల్లలకు ఫ్రీ ట్యూషన్స్ ఏర్పాటు చేసింది. పిల్లలందరూ సాధారణంగా హాలిడేస్ వస్తే హాయిగా విహారయాత్రలు చేయాలనుకుంటారు. కానీ ఆర్తి మాత్రం ఇండియాలోని పేద పిల్లలకు ఏదైనా చేయాలని భావించింది. తన తండ్రి సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో, తల్లి సొంత రాష్ట్రమైన చెన్నైలో ముందుగా కార్యమ్రాలను ప్రారంభించింది. ఫౌండేషన్ బాగా అభివృద్ధి చెంది ఫండ్స్ బాగా వస్తే తన సేవలను దేశవ్యాప్తం చేయాలనుకుంటుంది. చిత్తూరులో కూడా మెడికల్ క్యాంప్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. భవిష్యత్‌లో డాక్టర్ అయ్యి ఇండియాలో ఒక సెంటర్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆరోగ్యంపై దృష్టి
ఆర్తి ఐదేండ్ల వయసులో ఉన్నప్పుడు బ్లాక్ బోర్డ్ చూడలేకపోయేది. దాన్ని చూడాలంటే ఇబ్బంది పడేది. ఆ వయసులో తనకు చెప్పడం రాదు. తల్లిదండ్రులు అది గమనించి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. కాస్త సైట్ ఉందని తెలిసింది. వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించారు. దాంతో తన సమస్య పూర్తిగా పరిష్కారమయింది. ప్రస్తుతం తను గ్లాసులు కూడా ఉపయోగించడం లేదు. ఇలాంటి తన సొంత అనుభవం కూడా ఆర్తిపై ప్రభావం చూపింది. చిన్న వయసులో పిల్లలు తమకు సమస్య ఉందని కూడా చెప్పుకోలేరు. సమస్యను ముందే గమనిస్తే పరిష్కరించుకొని పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకే ఆర్తి పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టింది.
పిల్లల కలలు నిజం చేయాలి
నేను యుఎస్‌లో పుట్టి పెరిగాను. అక్కడ నాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు లేకుండా చదువుకుంటున్నాను. కానీ భారత దేశంలో పిల్లలకు ఇలాంటి అవకాశాలు లేవు. పేదరికంతో బాధపడుతున్నారు. సరైన ఎడ్యుకేషన్, సరైన వైద్యం లేక అనేక కష్టాలు పడుతున్నారు అని అమ్మా, నాన్న నాతో చెబుతుండేవారు. అది విన్నప్పుడు బాధగా ఉండేది. వారికి ఏదైనా హెల్ప్ చేయాలకున్నా. బాగా చదువుకుని చైల్డ్ డాక్టర్ కావాలనుకుంటున్నాను. చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే బాలకార్మికులుగా మారిపోతున్నారు. అలాంటి పిల్లలు తమ కలలను నిజం చేసుకోవడానికి నా వంతు సహకారం అందించాలి. ఆ ఉద్దేశంతోనే ''ఫ్రిజర్వింగ్ స్టూడెంట్ హెల్త్ ఫౌండేషన్'' అని దీనికి పేరు పెట్టి అమెరికాలో స్టార్ట్ చేశాము. మా అమ్మానాన్న చిన్నప్పటి నుండి నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. ఇలా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తాను అని అంటే దాన్ని ఎలా చేయాలి, కావల్సిన సపోర్ట్ ఇస్తున్నారు. పదిహేనురోజుల కిందటే సెలవులకు ఇండియా వచ్చి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. నా లక్ష్యం పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించడం. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే వాళ్లు బాగా చదువుకోగలరు. భవిష్యత్‌లో ఏమైనా చేయగలరు. వారి కలలను నిజం చేసుకోగలరు.
- ఆర్తి శ్రీనివాస్
ఆచరణలో పెడుతుంది
చిన్నప్పటి నుండి తనకు మన దేశ పరిస్థితులు, పేదరికం, పిల్లల సమస్యలు చెబుతుండేవాళ్ళం. అలాగే మన సొసైటీకి ఏదో ఒకటి చేయాలని నేర్పుతుండేవాళ్ళం. మేము చెప్పిన విషయాలను అర్థం చేసుకుని వాటిని ఇప్పుడు ఆచరణలో పెడుతుంది. మరో విషయం ఏమిటంటే మేము చెప్పాము కాబట్టి ఏదో చేయాలని కాకుండా తాను సొంతంగా ఇండియా పరిస్థితుల గురించి చాలా రీసెర్చ్ చేసింది. ఇప్పుడు ఇండియాకి వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇక్కడి పరిస్థితులు, రోడ్డు పక్కన ఉండే పేద ప్రజలను చూసి ఇంకా చాలా చేయాలని నాతో చర్చిస్తుంది. చిన్నప్పుడు కూడా ఒకరికి సాయం చేస్తే ఎలా సరిపోతుంది. చాలామంది ఉన్నారు కదా వారందరికీ సాయం చేయాలి అంటుంది. మేము చెప్పింది విని దాన్ని ఆచరణలో పెడుతున్నందుకు ఆర్తీని చూస్తే చాలా గర్వంగా ఉంది.
- సుజాత, ఆర్తి తల్లి
- సలీమ