Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో మిషన్ కుట్టడం రాని మహిళలు దాదాపుగా ఉండేవారు కాదు. అలాగే కుట్లు, అల్లికలు కూడా. అప్పట్లో కుట్టడం, అల్లడం మహిళల నేర్పరితనానికి, తెలివితేటలకు గుర్తుగా భావించేవారు. చీరలకు డిజైన్లు కుట్టడం, జాకెట్లు కుట్టుకోవడం వచ్చిన మహిళలకు బాగా గుర్తింపు ఉండేది. గతంలో మహిళలు ఇల్లు గడవడం కోసం మిషను కొట్టడమే ప్రధాన వృత్తిగా ఉండేది. మిషన్‌తో పాటు విస్తళ్ళు కుట్టడం వంటి వాటితో మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేవారు. కాలం మారినకొద్దీ అవసరాలు మారాయి. ప్రస్తుతం బాగా చదువుకుంటూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత చదివినా, ఉద్యోగాలు చేసినా ఫ్యాషన్ మెరుగులు మాత్రం తగ్గలేదు. చాలా మంది కాస్త ఖాళీ సమయం దొరికినా కుట్లు, ఆల్లికలు చేసేవారు ఉన్నారు. వాటి కోసం ఉపయోగించిన దారాలు అయిపోయిన తర్వాత వాటి గొట్టాలు మిగిలిపోతాయి. వాటితో మా అమ్మ వివిధ రకాల బొమ్మలు తయారు చేసేది. అది నేను కూడా ఎన్నో బొమ్మలే చేసేదాన్ని. ఆ బొమ్మలను ఎలా తయారు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం.
ఉయ్యాలలో బొమ్మ
దీనికోసం కనీసం ఇరవై దారపుండ గొట్టాలను సేకరించుకోవాలి. అయితే వీటికోసం మనింట్లో మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. బజార్లో మిషను కుట్టేవాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. మొదటగా ఈ గొట్టాల్ని ఊలుతో చుట్టుకోవాలి. అప్పుడే మంచి రంగుతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలా అన్ని గొట్టాలనూ ఒకే రంగు ఊలుతో చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక గట్టి అట్టను తీసుకొని దానిని గుండ్రంగా కత్తిరించుకోవాలి. ఈ అట్టకు ఏదైనా రంగు పేపర్‌ను అతికించుకోవాలి. గ్లిట్టర్ షీట్స్ కూడా అతికించుకోవచ్చు. ఇప్పుడు గొట్టాలను రంగు పూసలలో అమర్చి తయారు చేయాలి. బంగారు రంగు పూసలు, గొట్టానికి చుట్టిన ఊలు రంగున్న పూసలు తెచ్చి వరసగా గుచ్చాలి. కొన్ని పూసలు మధ్యలో దారపుండ గొట్టం మరల పూసలు ఇలా గుచ్చి వరసగా దారాలు పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క దారం ఒక్కొక్క రంధ్రం నుంచి దూర్చి ముడివేయాలి. ఇలా అన్ని దారాలూ వరసగా ముడి వేయాలి. ఇవి సైజుల వారీగా కట్టుకోవాలి. అన్ని దారాలూ కట్టేశాక అట్ట పైభాగాన రంగు కాగితాన్ని అంటించాలి. ఇప్పుడు గుండ్రటి అట్టకు నాలుగు వైపుల నుంచి నాలుగు దారాలు పైకి కట్టాలి. ఈ దారాలకు మరల పూసలు గుచ్చి ముడి వేయాలి. ఈ నాలుగు దారాలు కలిపి ముడివేస్తే వేలాడ దీసే విధంగా తయారౌతుంది. గాలికి కింది పూసలు గొట్టాలూ ఊగుతుంటాయి.
ఫ్లవర్‌వేజ్
దీనిని ఫ్లవర్వేజ్గానే కాకుండా ఆర్గనైజర్‌గా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దారపుండ గొట్టాలను గుండ్రంగా వచ్చేలా ఒక దానికి మరొకటి పక్కనే పెట్టి అతికించాలి. నిలువుగా పక్కనపెట్టి అతికించాలి. అయితే గుండ్రంగా ఉన్న అట్ట మీద పెట్టి అతికించుకుంటే సులభంగా ఉంటుంది. దీనిని ఒక రోజంతా ఆరబెట్టి మరల ఈ గొట్టాలపైన మరల గొట్టాలు పెట్టి అతికించాలి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ మీద ఫస్ట్ ఫ్లోర్ వేసినట్టుగా ఉంటుందన్నమాట. బాగా ఆరిన తర్వాత రంగు వేసుకోవాలి. చెక్క రంగులా వేసుకుంటే బాగుంటుంది. ఇదేదో చెక్కతో చెక్కిన దానిలా ఉంటుంది. దీనికి లోపల ఫోమ్ షీటును గానీ గ్లిట్టర్ షీటును గానీ అతికించుకుంటే ఆర్గనైజర్‌గా బాగుంటుంది. చెవులకు పెట్టుకునే రకాలు, పిన్నీసులు, క్లిప్పుులు, స్లైడ్స్, టిక్‌టాక్‌లు వంటివి పెట్టుకోవచ్చు. ఫ్లవర్స్ పెట్టుకునేటపుడు లోపల గ్లిట్టర్షీటు అతికించకపోయినా బాగానే ఉంటుంది.
ఉయ్యాల
గతంలో పెద్దపెద్ద తూగుటుయ్యాలలు ఇంటి హాల్లో దర్శనమిస్తుండేవి. అయితే ఆ తర్వాత కేన్ ఉయ్యాలలే ఎక్కువగా రాజ్యమేలుతున్నాయి. అందుకే మనం కేన్ ఫర్నిచర్‌లోని ఉయ్యాలను చేసుకుందాం. దీనిని పక్షి గూడుగా కూడా మార్చుకోవచ్చు. ఏది కావాలన్నా మీ ఇష్టం. మొదటగా దారపుండ గొట్టాలను అడ్డంగా చిన్న చిన్న రింగులుగా కత్తిరించాలి. దీనిని కత్తెరతో కన్నా ప్లాస్టిక్ బాటిల్స్ కత్తిరించే బ్లేడుతో బాగా వస్తాయి. ఒక దారపు గొట్టంతో 10 రింగులు వస్తాయి. ఇలా దాదాపు ఇరవై గొట్టాలను కత్తిరించి పెట్టుకోవాలి. ఒక బెలూన్ తీసుకొని ఊది చివర ఒక దారం కట్టాలి. దానిమీద దోసకాయ ఆకారంలో ఒక గీత గీసుకోవాలి. అది వదిలిపెట్టి మిగతా స్థలమంతా దారపు గొట్టాల రింగుల్ని అతికించాలి. ఒక ప్లేట్లో ఫెవికాల్ వేసి కొద్దిగా నీరు పోసి గొట్టపు రింగుల్ని అందులో వేసి కలబెట్టాలి. ఒక ఫోర్ సెప్స్‌తో ఒక్కొక్క రింగను తీసుకొని బెలూన్ మీద పెడుతూ అతికించాలి. మొదటగా గీసుకున్న గీత తప్ప మిగతా భాగమంతా మొత్తం అతికించాలి. బాగా ఎండాక బెలూన్ను పగలగొట్టి తీసేయాలి. ఇప్పుడు మనకు నచ్చిన రంగును వేసుకోవాలి. చెక్క రంగును వేసుకుంటే కేన్ ఫర్నిచర్‌లా కనిపిస్తుంది. దీనిపైన గొలుసుతో కట్టి వేలాడదీస్తే ఉయ్యాలలా కనిపిస్తుంది. గొలుసు కోసం ఇంట్లో వాడని రోల్డ్‌గోల్డ్ చైన్ వాడవచ్చు. గొట్టపు రింగుల లోపల స్పాంజి ముక్కలు పెట్టి దానిమీద రెండు పక్షి బొమ్మల్ని అతికించాలి. కొద్దిగా గడ్డివేసి నాలుగైదు తెలుపు రంగు ధర్మోకోల్ బాల్స్‌ను అతికించాలి. ఈ ధర్మోకాల్ బాల్స్ పక్షి గుడ్లన్న మాట. ఇలా కూడా అలకరించుకోవచ్చు. ఉయ్యాలగా ఉంచుకుంటే దానిలో ఒక పాప బొమ్మను పెట్టుకుంటే బాగుంటుంది.
ఇల్లు
ఒక వెడల్పాటి అట్టను ఇంటికి బేస్‌గా తెచ్చి పెట్టుకోవాలి. దానిమీద తెల్లని పేపర్ అతికిస్తే బాగుంటుంది. దీని మీద నాలుగు వైపులా గోడలు కట్టినట్టుగా దారం గొట్టాలతో కట్టాలి. దీనికోసం ఏం చేయాలంటే ఒక తెల్లని కాగితం గోడ సైజులో కత్తిరించుకొని దానిపై గొట్టాలు వరసగా పడుకోబెట్టి అతికించాలి. ఇలా నాలుగు వైపులా గోడలు తయారు చేయాలి. ఇంటి ముందు వైపు వాకిలి ఉండాలి కదా! ఆ ఖాళీ వదిలి గోడలు కట్టాలి. మేడకట్టడానికి దీనిమీద ఒక అట్టను పెట్టాలి. మరల దీనిమీద ఇందాక కట్టినట్టుగా గోడ కట్టాలి. దీనిపైన ఏటవాలుగా రెండు అట్టలు తయారు చేసి పూరింటి మీద పెట్టినట్టుగా పెట్టాలి. దీనికి గార్డెన్ కూడా పెట్టవచ్చు. ఒక గొట్టాన్ని పెట్టి మరొక గొట్టాన్ని దూరంగా పెట్టి మధ్యలో చైన్లు అతికిస్తే గార్డెన్ వలె ఉంటుంది. ఇంజనీరింగ్ చదవకుండానే ఇలా ఇల్లు కట్టేయవచ్చు. ఐస్‌క్రీం పుల్లల్ని తెచ్చి నిచ్చెన బొంగుల్లా పెట్టాలి. అటొకటి, ఇటొకటి ఐసు పుల్లల్ని పెట్టి మధ్యలో దారపు గొట్టాల్ని అతికించుకోవాలి. ఇలా అక్కడొకటి, అక్కడొకటీ అతికిస్తే నిచ్చెన తయారవుతుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్