Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు వేసే ప్రతి అడుగూ అప్రమత్తంగా ఉండాలి. అంతే వేగంగానూ.. అడుగు లేయాలి. ఎక్కువ సమయాన్ని వృథా కానివ్వకుండా విలువైన నిర్ణయాన్ని అందించాలి. అప్పుడే సామర్థ్యం ఉన్న ఉద్యోగిగా పేరు పొందొచ్చు. విధుల్లోనూ నిరూపించుకోవచ్చు. ఉద్యోగులను ఎంపిక చేసే మేనేజర్ స్థాయిలో మీరున్నప్పుడు అర్హతతోపాటు నైపుణ్యాలున్న వారిని తేలికగా గుర్తించి వారిని చేర్చుకోవడంలో ఆలస్యం చేయకూడదు. వేగంగా ఆలోచిస్తూ, అవతలి వారి సామర్థ్యాలను వెంటనే గుర్తించగలిగేలా ఉంటేనే మీవల్ల సంస్థకు ప్రయోజనమెక్కువ.
సమయానికి తగినట్టుగా, విశ్లేషణాత్మకంగా అలాగే వ్యూహాత్మకంగా ఆలోచించడం నేర్చుకోవాలి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టును తీసుకోవాలా వద్దా అనే అధికారం మీకిచ్చినప్పుడు వీలైనంత త్వరగా నిర్ణయం చెప్పగలగాలి. ఆ అంశంపై కూలంకషంగా పరిశోధన చేస్తే పూర్తిగా అవగాహన పొందొచ్చు. దీంతో ధైర్యంగా ముందడుగు వేయొచ్చు. అలాగే బృందంతో కలిసి ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఈ ప్రాజెక్టును వాళ్లతోనే కలిసి చేయాల్సి ఉంటుంది. అందుకే వారేం చెబుతున్నారో వినాలి. మీ అభిప్రాయమే కాకుండా, కొన్ని చోట్ల సహచరుల అభిప్రాయాల్నీ, ఆలోచనల్నీ తీసుకుంటూ ఉండాలి. ఏదైనా అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు గడువుని నిర్దేశించుకోవాలి. దాని ప్రకారం ఓ ప్రణాళిక వేసుకోవాలి. సంస్థకు సంబంధించి బయట నుంచి ఏదైనా ఆర్డరు తీసుకోవాల్సినప్పుడు దాని వల్ల ప్రయోజనాలు ఎక్కువా, తక్కువా అని వేగంగా తెలుసుకోవాలి. లేదంటే ఆ తర్వాత ఆర్డరు దొరకకపోవచ్చు. దీనివల్ల సంస్థకు నష్టం రావొచ్చు. ఇటువంటప్పుడు ఆ ఆర్డరు ఎంతవరకు ఉపయోగపడుతుందో గుర్తించగలగాలి. దీనికి నిపుణులతో చర్చించాలి. మీ బృందంతో మాట్లాడి, మీ నిర్ణయాన్ని త్వరగా చెప్పగలగాలి. అప్పుడే సామర్థ్యం, వేగంగా ఆలోచించగలిగే నైపుణ్యాలు అలవడతాయి.