Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుడప్పుడూ ఇంట్లోంచి చెడువాసన రావడం సహజం. అందులోనూ వర్షాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చెడు వాసనలను తొలగించడానికి చాలామంది మార్కెట్లో దొరికే రూమ్ ఫ్రెష్నర్స్ వాడుతుంటారు. అయితే వివిధ రసాయనాలతో తయారైన వీటి కంటే ఇంట్లో లభించే పదార్థాలతోనే ఇంటిని సువాసనభరితం చేసుకోవడం ఎంతో ఆరోగ్యకరం. కాబట్టి ఇంటిని పరిమళభరితంగా తీర్చిదిద్దే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలేంటో తెలుసుకుందాం.
ఒక చిన్న పాత్రలో కొన్ని నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద చిన్న మంటపై మరిగించాలి. అందులో కొన్ని దాల్చిన చెక్క ముక్కలు లేదా పొడి వేయాలి. దీంతో ఇంట్లోని చెడు వాసన తొలగిపోయి.. మంచి వాసన వస్తుంది. దాల్చిన చెక్కకు బదులుగా కాఫీ గింజలు లేదా నిమ్మ, ఆరెంజ్, యాపిల్ తొక్కల్ని లవంగాలతో కలిపి వేసి మరిగించొచ్చు.
ప్రస్తుతం వివిధ రకాల డిజైన్లు, మోడళ్లలో ఉన్న సెంటెడ్ క్యాండిల్స్ మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి. వాటిని వెలిగించి చెడు వాసనలను పారదోలండి.
ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో కర్పూరం వేసి ఓ మూలకు ఉంచండి. ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది. అలాగే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.
కిచెన్‌లో నాన్‌వెజ్ వండినప్పుడు వచ్చే నీచు వాసన వెంటనే పోదు.. ఇదేవిధంగా కిచెన్‌లో నుంచి ఇంకా ఏమైనా చెడు వాసన వస్తున్నట్టయితే.. ఒక చిన్న గిన్నెలో వైట్ వెనిగర్‌ని తీసుకుని దాన్ని కిచెన్ ప్లాట్‌ఫాంపై ఉంచండి. అది చెడు వాసనలన్నింటినీ తొలగిస్తుంది.
కొంతమంది ఎప్పుడు చూసినా కిటికీలు, తలుపులు మూసే ఉంచుతారు. దీనివల్ల బయటి గాలి లోపలికి రాదు.. లోపలి గాలి బయటికి పోదు. దీంతో ఇంట్లోని గాలి తాజాదనాన్ని సంతరించుకోదు. అందుకే చెడు వాసన వస్తుంటుంది. కాబట్టి ఇంట్లో కొన్ని కిటికీలైనా సరే తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల కేవలం ఇంట్లోని వాసనే కాదు.. బాత్రూమ్స్లో ఉండే వాసన కూడా బయటికి పోతుంది.
సబ్బులు, క్యాండిల్స్ తయారీలో వాడే కల్తీ లేని ఎసెన్షియల్ ఆయిల్స్‌ని కూడా ఇంటిని సువాసనభరితం చేయడానికి వాడొచ్చు. వీటి ప్రభావం చాలా సేపటి వరకు ఉంటుంది.
రోజ్మేరీ వంటి కొన్ని సువాసనాభరిత ఆకులు కూడా మార్కెట్లో లభిస్తాయి. వీటిని తెచ్చుకుని ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉంచండి. ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది. ఫలితంగా మనసుకు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.