Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలే వర్షాకాలం. పిల్లలు స్కూల్స్‌కి వెళ్ళడానికి మారం చేస్తారు. పెద్దలకు ఏదైనా స్పైసీగా, వెరైటీగా తినాలని ఉంటుంది. మరి రోజూ వెరైటీగా ఏం చేస్తాం. ఓ పక్క టైం అయిపతుంటుంది. టెన్షన్ పెరిగిపోతుంది. అందుకే సింపుల్‌గా, కాస్త వెరైటీగా ఉండే వాటిని ట్రై చేయాలి. దానికోసమే అన్నంతో తయారు చేసే కొన్ని స్పెషల్ రుచులు ఈ రోజు మీకోసం. ఓ సారి ట్రై చేయండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ కుటుంబ సొంతం అవుతుంది.
స్వీట్ కార్న్ రైస్
కావల్సిన పదార్థాలు: రైస్ - అర కేజీ, (అరగంట నీటిలో నానబెట్టుకోవాలి) కార్న్ - రెండు కప్పులు, ఉల్లిగడ్డ ముక్కలు - కప్పు, క్యాక్సిమ్ - కప్పు, అల్లం - 1/4 టీస్పూను, వెల్లుల్లిపేస్ట్ - 1/4 టీస్పూను, ఆలూ ముక్కలు - కప్పు, పచ్చిమిర్చి - 4 లేదా 5, గరం మసాలా - టీస్పూను, పసుపు - 1/4 టీస్పూను, జీలకర్ర - 1/4 టీస్పూను, నూనె - సరిపడేంత.
తయారు చేయు విధానం: ఉల్లిగడ్డ ముక్కలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన బియ్యం, ఆలూ, స్వీట్ కార్న్ వేయాలి. అలాగే కొద్దిగా నూనె, సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అంతలోపు కుక్కర్లో స్వీట్ కార్న్ రైస్ రెడీ అవుతుంది. స్టౌ ఆఫ్ చేసి కుక్కర్లోని ఆవిరి మొత్తం తగ్గనివ్వాలి. తర్వాత స్వీట్ కార్న్ రైస్‌ను బయటకు తీసి పాన్‌లో వేగుతున్న మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే స్వీట్ అండ్ స్పెషల్ స్వీట్ కార్న్ రైస్ రెడీ...
క్యాప్సికమ్ మసాలా రైస్
కావలసిన పదార్ధాలు: క్యాప్సికమ్ - రెండు, బియ్యం - 250 గ్రాములు, నెయ్యి - వంద గ్రాములు, ఆవాలు - చెంచా, కరివేపాకు - సరిపడా, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - మూడు, ధనియాలు - చెంచా, జీలకర్ర - చెంచా, మినప్పప్పు - చెంచా, దాల్చిన చెక్క - చిన్న ముక్క, పల్లీలు - అరకప్పు,
తయారు చేయు విధానం: ముందుగా బియ్యం కడిగి అన్నం కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్‌లో నెయ్యి పోసి వేడయ్యాక పల్లీలు, మినప్పప్పు, ధనియాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అవి వేగాక పక్కకు తీసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వండుకున్నరైస్లో ఆ పొడి కలపాలి. తర్వాత పాన్‌లో నెయ్యి పోసి కరిగాకా ఆవాలు, కరివేపాకు వేసి క్యాప్సికం ముక్కలు వేసి వేయించి సరిపడా ఉప్పు వేసుకుని కలపాలి. ఇప్పుడు ఇందులో అన్నం వేసుకుని కలపాలి పైన కొంచం నెయ్యి వేసుకొని తింటే రుచిగా ఉంటుంది.
కుబాలి రైస్
కావల్సిన పదార్థాలు: బియ్యం - ఆరకేజీ, శెనగపప్పు - రెండు కప్పులు, ఉల్లిగడ్డ - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు, గరంమసాలా - కొద్దిగా, పుదీన - రెండు కట్టలు, నిమ్మకాయ - ఒకటి, నెయ్యి - చిన్న కప్పు, మిఠాయిరంగు - చిటికేడి, పెరుగు - రెండు కప్పులు, పసుపు, ఉప్పు, కారం, నూనె - తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా బియ్యం కడిగి నానబెట్టాలి. అలాగే శెనగపప్పును కూడా శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఉడకపెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలను వేయించి, అవి ఎర్రగా వేగిన తర్వాత కారం, పసుపు, గరంమసాలా, ఉడికించిన శెనగపప్పును కూడా కలిపి కాసేపు స్టౌ మీద ఉంచి దింపాలి. ఈ మిశ్రమంలో పెరుగు, పుదీన, ఉప్పును కూడా చేర్చి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో ఎసరుపెట్టి, నానబెట్టిన బియ్యాన్ని ఎసరులో పోసి ముడోంతులు ఉడకగానే అన్నాన్ని వార్చేసి, అదే గిన్నెలో కాస్తా నెయ్యి పోసి అది వేడైన తర్వాత సగం అన్నాన్ని ఒక పొరగా వేసి, దానిపై శెనగపప్పు కూరను వేసి దానిపై మిగిలిన అన్నాన్ని మరో పొరలా వేసి ఆ పైన నెయ్యిను పొయ్యాలి. చివరిగా నిమ్మరసం, చిటికెడు మిఠాయిరంగును అన్నంపై చల్లి మూతపెట్టి పదిహేను నిమిషాలు పాటు ఉడికించాలి.
జీరా రైస్
కావల్సిన పదార్థాలు: బియ్యం - నాలుగు కప్పులు, జీలకర్ర - ఒక చిన్న కప్పు, కరివేపాకు - రెండు కట్టలు, పచ్చిమిర్చి - పది, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాలి. ఈ లోపు ఎసరు పెట్టి అది బాగా కాగిన తర్వాత బియ్యం పోసి అన్నం ఉడికిన తర్వాత పూర్తిగా వార్చేసి చల్లార్చాలి. ఒక బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత దాంట్లో జీలకర్రను ముందుగా వేసి దాన్ని వేగనిచ్చి కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలను వేసి అవి కూడా వేగిన తర్వాత అన్నాన్ని చేర్చి బాగా ఫ్రై చేయ్యాలి. ఈ మిశ్రమంలో ఉప్పును కూడా వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.