Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు పెద్ద చదువులు చదివి, ఉద్యోగాల్లో స్థిరపడినా సరే.. ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కంగారుపడటం, అలజడికి గురవడం చూస్తుంటాం. ఇంకొందరు భర్త చెప్పినట్టు చేయడమే తప్ప సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఆయనది మెరుగైన ఆలోచనైతే అనుసరించడం తప్పేం కాదు. కానీ మనకంటూ అభిప్రాయాలూ ఆలోచనలూ లేకుంటే ఎప్పటికీ ఆధారపడే స్థితిలోనే ఉండాలి. కనుక మీ ఆలోచనా పరిధి పెంచుకుని, మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి. అందుకేం చేయాలో మానసిక నిపుణులు సూచిస్తున్నారు...
ప్రతిదీ తర్కించి చూడండి. లాభనష్టాలు బేరీజు వేయండి. అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత వస్తుంది.
క్లిష్టమైన అంశాలకు కాస్త సమయమిస్తే ఏం చేయాలో మార్గం తోస్తుంది. కాలం అన్నింటినీ పరిష్కరిస్తుందని ఊరికే అనలేదు.
తొందరపాటు నిర్ణయాలు వద్దు. అవతలి వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా, పూర్తిగా వినండి. అలాగే మీరు చెప్పేది అవతలి వాళ్లు వినేలా చేయడమూ ముఖ్యమే. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, ఉండాలి అనుకోవద్దు. మార్పు సహజమని గ్రహించాలి. ఆలోచనలో స్పష్టత, దాన్ని అంతే స్పష్టంగా వ్యక్తీకరించడం, అవసరమైనపుడు దఢంగా, స్థిరంగా ఉండటం... ఇవన్నీ మీమీద మీకు నమ్మకాన్ని పెంచుతాయి. అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
ప్రాజెక్టు విషయాలు మీరొక్కరే నిర్ణయించొద్దు. టీమ్ సభ్యులతో చర్చలయ్యాక ఏది ప్రయోజనకరమో స్పష్టత వస్తుంది. కొన్ని సార్లు మీ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారూ ఉంటారు. వారికి నచ్చజెప్పగలగాలి.
పదోన్నతి, బదిలీ లాంటివి కష్టమైన వ్యవహారాలే. అందులో మంచీ చెడులను విశ్లేషించినప్పుడు ఏది మేలో అర్థమవుతుంది. ఇంకా గందరగోళంగా ఉంటే భర్త, ఇతర సభ్యులతో చర్చించండి. అందరి అభిప్రాయాలూ విన్నాక నిర్ణయం తీసుకోండి. అది మీకు ఆమోదయోగ్యంగా ఉండాలి. ఫలితం ఏదైనా ఇతరులను తప్పు పట్టే స్థితి రాకూడదు.
మంచి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన సరిపోదు. సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం.