Authorization
Tue April 08, 2025 03:25:07 pm
'ఊరికే టెన్షన్ పడతావు' అని సరదాకే అన్నా.. మనకు ప్రతి విషయంలో ఇది సాధారణమే. పిల్లలు తినకపోయినా, సమయానికి ఇంటికి చేరుకోకపోయినా, ఇంట్లో ఎవరిదైనా ఆరోగ్యం పాడైనా.. చెప్పుకుంటూ పోతే ఆందోళన, కంగారు కలిగించే జాబితా బోలెడు. ఇవన్నీ మన ఆరోగ్యంపైనే దుష్ప్రభావాల్ని చూపుతాయి. మరి మనలోని టెన్షన్ తగ్గాలంటే వీటిని పాటిస్తుండండి.
- మనసును శాంత పరిచే సాధనం. కంగారుగా అనిపిస్తే ప్రశాంతంగా ఉండే వాయిద్య సంగీతాన్ని వినండి. గుండె వేగం తగ్గడాన్ని మీరే గమనిస్తారు. ఒత్తిడి కలిగించే హార్మోను విడుదలను తగ్గించడంలో ఇది దివ్యౌషధం.
- అనుకూలమైన స్థలాన్ని ఎంచుకొని నిటారుగా కూర్చోండి. పళ్ల మధ్యలో నాలుకను మడిచి నోటి నుంచి గాలిని పీల్చి వదిలేయండి. తర్వాత ముక్కు ద్వారా 4 సెకన్లపాటు శ్వాస తీసుకొని 7 లెక్కపెట్టేంత వరకూ బంధించి వదిలేయాలి. మొదట చేసిన విధంగా నోటితో గాలిని 8 సెకన్లు బంధించి వదిలేయాలి. ఇలా మూడుసార్లు చేసి చూడండి. ఉపశమనం లభిస్తుంది. నిద్ర పట్టకపోయినా ఈ పద్ధతి ప్రయత్నించొచ్చు.
- ప్రతికూల ఆలోచనలు, ఆందోళనను తగ్గించడంలో వ్యాయామం బాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆలోచనలు చుట్టు ముడుతోంటే వ్యాయామాన్ని ఆశ్రయించేయండి. నిల్చొనే జాగింగ్, గెంతడం, ప్లాంక్.. ఇలా ఏవైనా సరే ఆపకుండా కనీసం 15 నిమిషాలు చేయాలి. అప్పుడు కంగారు తగ్గి స్పష్టంగా ఆలోచించేలా మెదడూ సిద్ధమవుతుంది.
- కాస్త పచ్చదనం, నీరు ఉన్న చోటికి వెళ్లండి. ప్రకతి, ఆకుపచ్చ, నీలం రంగులు మనసుకి ప్రశాంతతనిస్తాయి. మొక్కల మధ్య నడక, లేదా ఆ రంగులను కాసేపు తదేకంగా చూసినా మంచిదే.
- అక్షరాలను పేపర్‌పై ఉంచండి. ఏ విషయాలు కంగారు పెడుతున్నాయి? ఏ సమయంలో గుండె వేగం పెరుగుతోంది.. లాంటివి ఆలోచించి రాసేయండి. ఓసారి గమనించుకుంటే వాటిపై స్పష్టత వస్తుంది. ఉదాహరణకు ఉదయం మీకు బాగా కంగారుగా ఉంటుందనుకోండి. అలారం పెట్టుకొని మనసులో 'ఆందోళనకు ఇది సమయం కాదు..' అని చెప్పుకుంటూ ఉండండి... లేదూ కాస్త భిన్నమైన పనిని చేసుకుంటూ వెళ్లండి. ఆందోళన అల్లంత దూరానికి వెళ్లిపోతుంది.