Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీరు ఎప్పుడైనా మీ జాకెట్ జిప్ ఒక చేత్తో వేసుకోవడానికి ప్రయత్నించారా? కూర్చిలో నుండి లేవకుండా ఎప్పుడైనా ప్యాంటు ధరించారా? కనీసం వీల్ చైర్లో ఉన్న వారి కోసం శాలువా, దుప్పటి లాంటివి కాకుండా శీతాకాలపు దుస్తులు వెతకడానికి ప్రయత్నించారా? ఇవన్నీ వికలాంగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను దూరం చేయడానికి ఉపయోగపడతాయి. అలాంటి వారి కోసమే సౌమితా బసు దుస్తులను డిజైన్ చేస్తుంది.
కోల్‌కతాకు చెందిన సౌమితా బసు 80 శాతం కదలలేని స్థితిలో వున్న ఓ వికలాంగురాలు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా ఆమె వీల్‌చైర్‌కు పరిమితమయింది. అయితే ఆ సమస్య ఆమె ఎదుగుదలను ఆపలేకపోయింది. తనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే దుస్తులకు లెబుల్ అయిన జియెనికా ఫ్యాషన్‌ను ప్రారంభించి వికలాంగుల కోసం బట్టలు తయారు చేస్తుంది.
పాదాల నొప్పితో...
ప్రస్తుతం సౌమితా మాస్టర్స్ చేయడానికి నెదర్లాండ్స్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఆమెకు అంగవైకల్యం రాకు ముందు మొదటిసారిగా పాదాల నొప్పి అనిపించింది. కాలం గడిచేకొద్దీ పాదాల నొప్పి పూర్తిగా ఆమెను నడవనీయకుండా చేశాయి. అప్పుడు ఆమె వయసు 30 ఏండ్లు. దవడల నుండి కాలి వరకు ఏమీ కదిలించలేకపోయింది. చికిత్స కోసం ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగింది.
పూర్తిగా మంచాన పడేసింది
2014లో ఆమె సోరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్టు అర్థమయింది. ఇది సోరియాసిస్ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసే ఆర్థరైటిస్లోని ఒక రూపం. ''నా వ్యాధి చాలా ప్రత్యేకమైంది. కాబట్టి ఇప్పుడు నేను చాలా ప్రత్యేకమైన వ్యక్తిని. వ్యాధి మూడు సంవత్సరాల వరకు నిర్ధారణ కాలేదు. అది చివరకు నన్ను పూర్తిగా మంచాన పడేలా చేసింది. నా అంతట నేను పక్కకు కూడా తిరగలేకపోయాను. అందరూ నా గురించి ఏవేవో మాట్లాడారు'' అని ప్రస్తుతం 39 ఏండ్ల సౌమిత చెప్పింది.
స్వయంగా తయారు చేస్తుంది
ఇప్పుడు సౌమితకు ప్రత్యేకమైన దుస్తులు అవసరమనిపించింది. అదే చివరికి 2019లో జియెనికా ఫ్యాషన్ పుట్టుకకు దారితీసింది. కోల్‌కతాలో ఉన్న జియెనికా వైకల్యాలు, శారీరక సవాళ్లతో బాధపడేవారికి దుస్తులు తయారు చేస్తుంది. స్వయంగా వారే ధరించగలిగేలా, ఇతరుల సహాయం అవసరం లేకుండా అనుకూలమైన దుస్తులను అందించే కృషి చేస్తుంది. ''నేను ఎప్పుడూ వీల్‌చైర్‌లో ఉండేదాన్ని. వీలైనప్పుడు క్రచెస్ని ఉపయోగించేదాన్ని. అయితే మెట్లు, చిన్న చిన్న ప్రవేశ మార్గాల వంటివి ఉండడంతో పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లడం చాలా కష్టంగా మారింది'' అని సౌమిత అంటుంది.
అడ్డంకులను అధిగమించడం
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తన 20వ దశకంలో మోటారు న్యూరాన్ వ్యాధితో బాధపడ్డారు. తన జీవితంలో ఎక్కువ భాగం వీల్‌చైర్‌లోనే గడిపారు. ఓ సందర్భంలో ఆయన ఇలా అన్నాడు. ''వైకల్యం ఉన్న వ్యక్తులు వారు ఎదుర్కొనే అనేక అడ్డంకుల కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. అవి శారీరక, ఆర్థిక సమస్యలు. ఈ అడ్డంకులను పరిష్కరించడం మన పరిధిలో ఉంది. ఈ అడ్డంకులను పరిష్కరించకపోతే ప్రపంచానికి ఎంతో కొంత తోడ్పడగల చాలా మంది వ్యక్తుల సామర్థ్యాన్ని కోల్పోతాము'' అంటారు.
జియోనికాను ప్రారంభించి
సౌమిత అహ్మదాబాద్‌లోని గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్స్ ఆగ్మెంటేషన్ నెట్వర్క్ మద్దతుతో జియెనికాను ప్రారంభించింది. పడుకుని ధరించగలిగే ర్యాప్-అప్ చీర, పరిమిత భుజం, చేయి కదలిక ఉన్నవారికి ఆర్మ్హోల్స్ నుండి తెరుచుకునే టాప్, బటన్లు లేని కుర్తా, క్రాల్ చేసే వ్యక్తులకు గాయాలను నివారించడానికి ప్యాంటులో మోకాలి ప్యాడ్లు, మహిళలు, పురుషులకు అనుకూలమైన ఇన్నర్‌వేర్స్. ఇవి ఆమె చేసిన కొన్ని బట్టలు మాత్రమే. ఆమె ఇంకా ఎన్నో ఆవిష్కరిస్తున్నారు.
సొంత అనుభవంతోనే
ఉత్పత్తుల ధర రూ. 600 నుండి రూ. 5000 మధ్య ఉంటుంది. ఆమె మాట్లాడుతూ ''మీరు స్థిరమైన శరీరాన్ని కలిగి ఉండలేనప్పుడు ఎవరైనా మీ దుస్తులను మార్చుకోవడం ఒక ప్రక్రియగా మాత్రమే కాదు శారీరకంగా కూడా చాలా కష్టం'' అంటుంది. ఆమెకు ఈ రంగంలో ఎలాంటి వృత్తిపరమైన శిక్షణ లేనప్పటికీ తన సొంత అనుభవాలే ఆమెకు అతిపెద్ద అభ్యాసాలు. అధికారిక శిక్షణ లేకపోవడమే తనకు మంచి చేసిందని ఆమె భావిస్తుంది. ఎందుకంటే ఇది వికలాంగుల పరిధి వెలుపల ఆలోచించేలా చేస్తుంది.
అతను పాఠశాలకు వెళ్ళగలిగాడు
చక్రాల కుర్చీలో ఉండే తొమ్మిదేండ్ల పిల్లవాడికి దుస్తులను డిజైన్ చేయడంలో తన అనుభవం గురించి ఆమె చెప్పింది. ''అతను తన ప్రామాణిక యూనిఫాం డిజైన్ కారణంగా పాఠశాలలోని రెస్ట్‌రూమ్‌లకు వెళ్లడంలో ఇబ్బంది పడ్డాడు. వీల్‌చైర్‌పై కూర్చున్నప్పుడు అతను టాయిలెట్‌కి వెళ్లి ఇతరుల సహాయం లేకుండా తనంతట తానుగా ధరించగలిగే షార్ట్‌లు తయారు చేయబడ్డాయి. పాఠశాలకు వెళ్లడం కొనసాగించడానికి ఇది ఎలా సహాయపడిందో అతను నాకు చెప్పాడు. ఈ దుస్తులు లేకుంటే అతను ఇంట్లోనే ఉండి చదువుకోవల్సి వచ్చేది. ఇలాంటి దుస్తుల కోసం అతను చాలా ఎదురుచూశాడు''.
అట్టడుగు వర్గాలకు
మహిళలు, వికలాంగులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పించడంలో సౌమిత శ్రద్ధ వహిస్తుంది. చాలా వరకు కుట్టుపనిని అట్టడుగు వర్గాల ప్రజలకు అప్పగించింది. ప్రస్తుతం ఆమె సొంత ఫ్యాక్టరీని నిర్మించే పనిలో కూడా ఉంది. ''లాభదాయకంగా ఉంటూనే ఇతరులను కలుపుకొని ఎలా ఉండాలనే దానిపై ఇతరులకు ఉదాహరణగా ఉండే కంపెనీలలో ఒకదానిని నేను నిర్మించాలనుకుంటున్నాను'' అంటున్నారు.
ఇప్పటికీ ఆరోగ్యా సమస్యలు
ఆమె తన సంస్థ గురించి మాట్లాడుతూ ''నా తల్లి అమితా బసు, జియెనికా సహ వ్యవస్థాపకురాలు. అయితే ఆమె నాకు కేవలం తల్లి మాత్రమే కాదు. ప్రాథమిక సంరక్షకునిగా ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి. కొన్ని రోజులు ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పటికీ తరచుగా అనారోగ్యానికి గురవుతాను. నాకు మా అమ్మ అవసరమైతే వ్యవస్థాపకురాలిగా, సహ వ్యవస్థాపకురాలిగా రెండు పాత్రల్లో ఉంటుంది. ఇది ఒక సవాలుగా మారింది'' అంటుంది.
శీతాకాలపు దుస్తుల కోసం
ఇప్పుడు సౌమిత అనుకూలమైన దుస్తులను మరింత కట్టుబాటుగా మార్చాలనే జియెనికా దృష్టిలో పని చేయగల ఒక విశ్వసనీయమైన బృందాన్ని నిర్మించడానికి ఎదురుచూస్తోంది. ''నేను త్వరలో శీతాకాలపు దుస్తుల విభాగంలోకి ప్రవేశించాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసా శీతాకాలంలో మాకు చాలా సమస్య ఉంటుంది. ప్రతి రోజు నా మనసు వేర్వేరు వేగంతో పనిచేస్తుంది. నా శరీరం ఒక వేగంతో పనిచేస్తుంటే, నా వ్యాపారం మరొక వేగంతో పనిచేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి నేను ప్రతి రోజు చాలా జాగ్రత్తలు తీసుకుంటాను'' అంటూ ముగించింది.