Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాఫీ, టీ.. ఈ పానీయాలు చేకూర్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వేడి పానీయాలు మానసిక ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే క్యాన్సర్ వంటి వ్యాధులను దరిచేరనివ్వవు. టీ తర్వాత ప్రజలు ఎక్కువగా తాగే హాట్ డ్రింక్స్‌లో కాఫీయే ఉంటుంది. అయితే టీలో లాగే కాఫీలో కూడా కెఫీన్ ఉంటుంది. కాఫీలోని కెఫీన్ శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే విద్యార్థులు పరీక్షల సమయంలో చురుకుగా ఉండేందుకు నిద్రరాకుండా కాఫీని తాగుతుంటారు. అయితే ఈ కెఫీన్‌ను మోతాదుకు మించి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. తాజాగా దీని వల్ల మరొక సమస్య వస్తుందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే తలనొప్పి వస్తుందని ఆ అధ్యయనం వివరిస్తోంది.
అధ్యయనం చెప్పిన విషయాలు: న్యూస్ టుడే మెడికల్ రిపోర్ట్ ప్రకారం అధిక మొత్తంలో తీసుకునే కెఫీన్ తలనొప్పికి దారి తీస్తుంది. ప్రతిరోజూ 400 మి.గ్రా లేదా నాలుగు కప్పుల కాఫీ తాగడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. రెండు వారాల కంటే ఎక్కువ రోజుల పాటు రోజుకు 200 మి.గ్రా కంటే ఎక్కువ కెఫీన్ తీసుకునే వారికి కూడా మైగ్రేన్ రావచ్చు. మైగ్రేన్ అంటే తలకు ఒక వైపు వచ్చే తీవ్రమైన తలనొప్పి. తలనొప్పి సమస్య వచ్చే రిస్కు ఉంది కదా అని మీరు వెంటనే కాఫీ తీసుకోవడం మానేయకూడదు. ఎందుకంటే ఉన్నట్టుండి కాఫీని తాగడం మానేసినా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కాఫీ తాగే అలవాటును నెమ్మదిగా తగ్గించడం మంచిది. మీరు కాఫీ వాడకాన్ని నెమ్మదిగా తగ్గిస్తే మైగ్రేన్ ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.
తలనొప్పి రాకుండా: కాఫీలో ఉండే కెఫిన్ అనేది ఒక్కో వ్యక్తి శరీరానికి ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. అయినా కూడా తలనొప్పి వంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఎక్కువగా కాఫీ తాగకపోవడమే మంచిది. మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారు కాఫీ తీసుకోవడం మానేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పితో పాటు అజీర్తి సమస్యలు, బ్లడ్ ప్రెజర్, గుండె వేగం పెరగడం, నీరసం, అతిమూత్రవ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా రావచ్చు. టెన్షన్, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కూడా తలనొప్పికి దారితీయవచ్చు. కెఫీన్‌ను తగ్గించినా మీకు మరింత ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు ఇది తీవ్రమైన అనారోగ్యాల సంకేతంగా నిలుస్తుంది.