Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. దాన్నే ఉపాధిగా మలచుకుని డబ్బు సంపాదిస్తే.. అదే కోరుకున్న ఉద్యోగం. కానీ చాలామందికి కోరుకున్నది ఒకటుంటే చేసే ఉద్యోగం మరొకటి ఉంటుంది. అలాంటప్పుడు జీవితమంతా ఏదో ఉదాసీనతతో ఉంటుంటారు. అయితే నిజంగా ఇలా కోరుకున్న జాబ్ దొరక్కపోతే బాధపడాలా? కోరుకున్న ఉద్యోగం సంపాదించిన వారంతా చాలా సంతోషంగా ఉంటున్నారా ? అంటే... చాలావరకు కాదు అనే సమాధానం వస్తుంటుంది. ఎందుకంటే కోరుకున్న జాబ్ సంపాదించినప్పటికీ కొందరు ఆ ఉద్యోగంలో టార్గెట్స్ చేరుకోలేక ఒత్తిడికి గురవుతుంటారు. ఇక డ్రీమ్ జాబ్ రాకపోయినా ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి పొందుతున్న వారు ఎందరో ఉంటారు. అందుకే మీ జీవితంలో కోరుకున్న ఉద్యోగం గురించి ఉండే కొన్ని అపోహలను తొలగించుకోండి అంటున్నారు నిపుణులు.
వాస్తవానికి ఒక్క ఉద్యోగమనే కాదు.. ఏ విషయంలోనైనా సరే.. అనుకున్నది జరగకపోతే బాధగానే ఉంటుంది. అయితే అనుకున్న ప్రతీదీ జరుగుతుందన్న గ్యారంటీ లేదు. అలాంటప్పుడు కోరుకున్న ఉద్యోగం కాకుండా మరో ఉద్యోగం చేస్తున్నందుకు బాధ ఎందుకు? ఇది కాస్త తత్వంతో కూడుకున్నదైనా ఆలోచిస్తే అర్థం ఉందంటున్నారు నిపుణులు. ఇలా బాధపడటానికి ముఖ్య కారణం చిన్నతనం నుంచి ఈ రకమైన అపోహలో ఉండడమేనట. కోరుకున్న ఉద్యోగం అయినా.. మరేదైనా.. సంతోషమనేది వచ్చిన దానిని స్వీకరించే తత్వాన్ని బట్టి ఉంటుంది కానీ, పోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వచ్చేది కాదంటున్నారు. ఇకనుంచైనా ఈ అపోహను దూరం పెట్టాలి.
డ్రీమ్ జాబ్ లభిస్తే కష్టపడి పని చేయక్కర్లేదు అనుకుంటారు చాలా మంది. ఇది కోరుకున్న ఉద్యోగం లభించిన కొంతమందిలో ఉండే అపోహ. అసలు ఈ లోకంలో కష్టమనేది లేకుండా ఏ పని జరుగదని తెలుసుకోవాలి. కలలు కనే ఉద్యోగం లభించగానే కలిగే ఉత్సాహం నుంచి ఈ అపోహ పుట్టుకొస్తుందంటున్నారు నిపుణులు. 'డ్రీమ్ జాబ్ వస్తే కష్టపడనక్కర్లేదు' అనే వారిని కొంత కాలం తర్వాత ఉద్యోగం ఎలా ఉంది? అనే ప్రశ్న అడిగితే, మళ్లీ వచ్చే సమాధానం వేరుగా ఉంటుందట. ఎంత ఇష్టపడి చేసే ఉద్యోగం అయినా తోటి కొలీగ్స్‌తో పోటీ పడకపోతే ఉన్నతి సాధ్యం కాదు. అలాంటప్పుడు వారి కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కొత్త కొత్త అప్డేట్స్ కోసం పరితపించాల్సి ఉంటుంది. గతంలో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. మరిదంతా కష్టపడకుండా జరుగుతుందా. అందుకే ఇది కేవలం అపోహ మాత్రమే.
నచ్చిన ఉద్యోగం దొరికితే పదే పదే ఉద్యోగాలు మారక్కర్లేదనుకుంటారు కొందరు. ఇది కూడా అపోహే అంటున్నారు నిపుణులు. జీవితంలో ఎవరైనా కూడా ఒక సంస్థలో సుదీర్ఘకాలం పాటు పని చేయవచ్చేమో కానీ ఒకే సంస్థలో జీవితాంతం పనిచేయడం సాధారణంగా జరగదు. అలాంటప్పుడు కోరుకున్న ఉద్యోగం లభించినా ఎప్పటికీ అక్కడే పనిచేయడం సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది విషయంలో ఏవైనా మినహాయింపులు ఉంటే ఉండచ్చు కానీ, అందరి విషయంలోనూ, అన్ని సందర్భాలలోనూ ఇది సాధ్యం కాకపోవచ్చంటున్నారు నిపుణులు.