Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడూ ఇడ్లీ, దోశ, ఉప్మా తినీ తినీ ఇంట్లో అందరికీ బోరు కొట్టేసి ఉంటుంది. అందుకే కాస్త వెరైటీగా ఈ ఆరోగ్యకరమైన కిచిడీలను ట్రై చేయండి. కచ్చితంగా తినేస్తారు.
సాగో రాజ్మా కిచిడి
కావల్సిన పదార్థాలు: రాజ్మా - కప్పు (కడిగి నానబెట్టాలి), సాబుదానా - రెండు కప్పులు, ఆలూ - రెండు (ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి), వేయించిన పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు - అరటీస్పూను, జీలకర్ర - అరటీస్పూను, కరివేపాకు - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి), పసుపు - పావు టీస్పూను, నిమ్మకాయ - ఒకటి, కొబ్బరి తురుము - టేబుల్ స్పూను, కొత్తిమీర - కట్ట, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: రాజ్మాలో ఒకటింపావు కప్పుల నీళ్లు పోసి సుమారు ఆరు గంటలసేపు నానబెట్టాలి. తర్వాత ఉడికించాలి. సాబుదానా కూడా నానబెట్టి ఉడికించి ఉంచాలి. ఆలూ ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. వెడల్పాటి పాన్‌లో నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర వేయవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము, పసుపు వేసి వేగాక ఆలూ ముక్కలు వేసి కలపాలి. ఉప్పు, ఉడికించిన రాజ్మా వేసి కలపాలి. తర్వాత ఉడికించిన సాబుదాన కూడా వేసి కలపాలి. ఇప్పుడు సుమారు పావుకప్పు నీళ్లు చిలకరించి మూత పెట్టి సిమ్‌లో ఐదు నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి వేరుసెనగపప్పు, నిమ్మరసం, కొబ్బరి తురుము, కొత్తిమీర కలిపి మూతపెట్టి అలాగే మరో ఐదు నిమిషాలు వేడిమీద ఉంచాలి.
క్వినోవా కిచిడి
కావల్సిన పదార్థాలు: క్వినోవా - రెండు కప్పులు, ఆలూ - రెండు (మీడియం సైజువి), వేయించిన పల్లీలు, గుప్పెడు, పసుపు - చిటికెడు, జీలకర్ర - టీస్పూను, పచ్చిమిర్చి - నాలుగు, కొబ్బరితురుము - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - టేబుల్‌స్పూను.
గమనిక: చిరుధాన్యాలతో పాటు ఇటీవల మర్కెట్లో లభిస్తోన్న మరోరకం ధాన్యమే క్వినోవా. ఇతర ధాన్యాలతో పోలిస్టే ఇందులో ప్రోటీన్లూ, గుండెకు మేలు చేసే మోనోఆన్శాచ్యురేటెడ్ కొవ్వుల శాతం ఎక్కువ. అయితే దొరకని వాళ్లు క్వినోవాకి బదులుగా బార్లీ, గోధుమ రవ్వనూ వాడుకోవచ్చు.
తయారు చేసే విధానం: ఆలూను ఉడికించి మెదిపి పక్కన ఉంచాలి. వేయించిన పల్లీల్ని మిక్సీలో వేసి చిన్న ముక్కలుగా చేసి తీయాలి. ముందుగా బాణలిలో క్వినోవాను కొద్దిగా వేయించి పక్కన ఉంచాలి. విడిగా మందపాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత వేయించిన క్వినోవా వేసి పది నిమిషాలు మీడియం మంటమీద ఉడికించాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు కూడా పోయాలి. పూర్తిగా ఉడికిన తర్వాత గరిటెతో ఓసారి కదిపి పక్కన ఉంచాలి. మందపాటి బాణలిలో నూనె పోసి జీలకర్ర వేయాలి. అవి చిటపటమన్నాక సన్నగా చీల్చిన పచ్చిమిర్చి వేసి ఓ నిమిషం వేయించాలి. తర్వాత మెదిపిన ఆలూ, ఉప్పు, పసుపు, పల్లీలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన క్వినోవా, కొబ్బరి తురుము వేసి కలపాలి. ఉప్పు సరిచూసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లి మూత పెట్టాలి.
ఓట్స్ కిచిడి
కావల్సిన పదార్థాలు: ఓట్స్ - కప్పు, పెసరపప్పు - అరకప్పు, కూరగాయలముక్కలు - కప్పు (క్యారెట్, బీన్స్, పచ్చిబఠాణీలు), మెంతి ఆకులు - అరకప్పు, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, అల్లం తురుము - టీస్పూను, కరివేపాకు - కొద్దిగా, పసుపు - పావు టీస్పూను, ఆలివ్ ఆయిల్ - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డముక్కలు - అరకప్పు, నీళ్లు - నాలుగు కప్పులు.
తయారు చేసే విధానం: పెసరపప్పులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. సగం ఉడికాక దించి పక్కన ఉంచాలి. పాన్‌లో నూనె పోసి కాగాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత అల్లం తురుము, మెంతి ఆకులు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. మిగిలిన కూరగాయ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి. రెండు కప్పుల నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లు మరిగాక ఓట్స్, సగం ఉడికించి పక్కన ఉంచిన పెసరపప్పు నీళ్లతోసహా వేసి కలపాలి. మిశ్రమాన్ని సిమ్‌లో ఉడికించి దించాలి.
కొర్రబియ్యం కిచిడీ
కావల్సిన పదార్థాలు: కప్పు, పెసరపప్పు - పావుకప్పు, పసుపు - చిటికెడు, నెయ్యి - టీస్పూను, ఉప్పు - తగినంత, అల్లం - అంగుళం ముక్క, క్యారెట్ - ఒకటి, బీన్స్ - నాలుగు, ఆలూ - ఒకటి, టమాటా - ఒకటి (చిన్నది), మునగాకు - కప్పు.
తయారు చేసే విధానం: కూరగాయలన్నీ చిన్న ముక్కలుగా కోయాలి. కొర్రబియ్యం, పెసరపప్పు కడిగి ఒకటిన్నర కప్పుల వేడినీళ్లు పోసి సుమారు రెండు నుంచి రెండున్నర గంటలు నానబెట్టాలి. ప్రెషర్‌పాన్‌లో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, మిరియాలు, కరివేపాకుతో తాలింపు పెట్టాలి. తర్వాత తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, ఆల్లం, పచ్చిమిర్చి కూడా వేసి వేగాక మిగిలిన కూరగాయల ముక్కలు, మునగాకు, ఉప్పు, పసుపు వేసి మూడు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన కొర్రబియ్యం, పెసరపప్పు, నీళ్లతో సహా పోయాలి. ఉప్పు సరిచూసి మూతపెట్టి మీడియం మంటమీద ఉంచి రెండు విజిల్స్ రానివ్వాలి. సిమ్‌లో మరో ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. ఆవిరిపోయాక మూత తీసి నెయ్యి కలిపి వడ్డించాలి.