Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ భూమిపై కొన్ని బంధాలు ఎప్పటికి అంతం కావు. అందులో స్నేహం ఒకటి. ప్రేమ పేరుతో జీవితంలో దెబ్బతిన్నవారిని అనేక మందిని చూస్తునం. కానీ స్నేహం పేరుతో జీవితాల్ని నిలబెట్టిన ఎందరో స్నేహితులని చూస్తున్నాం. వందల కొద్దీ స్నేహితులు ఉండటం గొప్పకాదు. వందల సమస్యలను తీర్చే ఒకే ఒక స్నేహం ఉండటం గొప్ప. మంచి మిత్రులతో గడిపితే మన మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సహంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా కొందరు తమ స్నేహితుల గురించి మనతో ఇలా పంచుకుంటున్నారు.
వయసు అడ్డుకాదు
మా నాన్న నాగేశ్వర్ రావు, అమ్మ మంగతాయమ్మ. మాది హుజుర్నగర్. నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నేను వారికి ఒక్కదాన్నే. సింగల్ పేరెంట్‌గానే పెరిగాను. అమ్మమ్మ దగ్గర ఎక్కువగా ఉండేదాన్ని. తోడబుట్టిన వాళ్ళు లేక పోవడంతో ఎక్కువగా స్నేహితులతోనే గడిపెదాన్ని. కష్టం, సుఖం, సరదా, అల్లరి అన్ని వాళ్ళతోనే. నా జీవితంలో ఎక్కువ శాతం స్నేహితులతోనే గడిచిపోయింది. స్కూల్లో చదివేటప్పుడు అందరం సైకిల్స్ వేసుకుని వెళ్ళేవాళ్ళం. సెలవు వస్తే సైకిల్స్ వేసుకుని సరదాగా లాంగ్ డ్రైవ్ లాగా తొక్కుకుంటూ వెళ్ళేవాళ్ళం. నోట్సులు రాసుకోవాలన్నా, చదువుకోవలన్నా స్నేహితుల ఇళ్లకు వెళ్లిపోయేదాన్ని. చదువు అయ్యాక కూడా ఆటలు, పాటలు అన్ని వాళ్ళతోనే. కుటుంబంతో పంచుకోలేనివి స్నేహితులతో పంచుకోగలుగుతాం. స్నేహంలో దాపరికాలు ఉండకుండా ట్రాన్స్ పరెంట్గా ఉంటే ఆ స్నేహ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది అని నా అభిప్రాయం. ఏ బంధం అయిన తెగిపోయేది ఆర్ధిక లావాదేవీల దగ్గరే. కనుక బాగా ఆలోచించి ముందడుగు వేయాలి. స్నేహానికి వయసుతో నిమిత్తం లేదు అన్నట్టుగా నాకు రోజ్ మేరీ అనే టీచర్‌తో పరిచయం ఏర్పడింది. నేను వాలీబాల్ ప్లేయర్‌ని. డిగ్రీ అయ్యాక ఖాళీగా ఉండటం ఎందుకని హుజుర్‌నగర్‌లోని ఒక స్కూల్లో వాలీబాల్ కోచ్‌గా వెళ్ళాను. అక్కడే ఈవిడ పరిచయం అయ్యారు. నాకంటే 15 సంవత్సరాలు పెద్ద కూడ. ఆవిడతో పరిచయం స్నేహంగా మారి ఎన్నో విషయాలు తనతో పంచుకునేదాన్ని. ఒక స్నేహితురాలిగానే కాదు ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ఎప్పుడైనా ఆర్ధిక ఇబ్బంది ఎదురైన ఆవిడ ఎంతో సాయం చేసేవారు. నాకు పెండ్లి మీద అంత సుముఖత ఉండేది కాదు. చెప్పడానికి బంధువులు, తొడబుట్టిన వాళ్ళు లేనందువల్ల కొన్ని విషయాలలో అవగాహన ఉండేది కాదు. ఇది తెలుసుకున్న ఆవిడ నా పెండ్లి విషయంలో ఎంతో కౌన్సిలింగ్ చేశారు. చదువు, ఉద్యోగంతో పాటుగా జీవితంలో మనకంటూ ఒకతోడు కూడా అవసరమని చెప్పేవారు. తనకు తెసిన కుటుంబం వారినే చూసి నాకు పెండ్లి కూడా కుదిర్చారు. ఇలా ప్రతి విషయంలో నాకెంతో అండగా నిలిచారు. మా స్నేహానికి 30 వసంతాలు. ఇప్పటికి కలుస్తూనే ఉంటాము. రోజు పలకరించుకుంటూనే ఉంటాము. నేను తనను చూడాటానికి వెళ్తూనే ఉంటాను. స్నేహానికి వయసుతో నిమిత్తం లేదు అనటానికి మా స్నేహమే ఉదాహరణ.
- మేజర్ జయసుధ.
కాంప్ కమాండర్, ఎన్.సి.సి.
ఎంతో శ్రద్ధ తీసుకునేది
మా నాన్న విశ్వనాధ్ సివిల్ ఇంజినీర్, అమ్మ సరస్వతి సంగీతం టీచర్. నేను పుట్టింది హైద్రాబాద్ అయినప్పటికీ పెరిగింది వైజాగ్. అమ్మ నాన్నలకు మేము ఇద్దరం సంతానం. నాకొక అక్క .తన పేరు నిహారిక. తను పాటలు రాసేది. ఇంటర్ వరకు నా చదువు వైజాగ్‌లోనే అయింది. బీకాం తర్వాత బిఏ మ్యూజిక్ చేశాను. ప్రస్తుతం ఎంఏ మ్యూజిక్ చేస్తున్న. నా స్నేహితురాలు శైలజ గురించి చెప్పాలంటే మేము కలిసి చదివింది చాలా తక్కువ కాలమే. ఇంటర్లో ఇద్దరం క్లాస్మేట్స్. తను నాకు చాలా స్పెషల్ ఫ్రెండ్. మనసుకు చాలా దగ్గరైన వ్యక్తి. తను పక్కన ఉంటే నేనెంతో సౌకర్యంగా ఫీల్ అవుతాను. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా గంగోత్రి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. రికార్డింగ్ కోసం వైజాగ్ నుండి చెన్నై వెళ్ళాలి. దాంతో కొన్ని పాఠాలు కాలేజ్‌లో మిస్ అవ్వాల్సి వచ్చింది. అపుడు శైలజ నేను మిస్ అయిన పాఠాలు అన్ని దగ్గరుండి చెప్పి నోట్స్‌లు ఇచ్చేది. తను నా విషయంలో సపోర్ట్ ఇవ్వడమే కాదు ఎంతో శ్రద్ధ తీసుకునేది. చదువుకోవడానికి ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. నాకు పాటల రికార్డింగ్ ఉంది అని తెలిస్తే నా గొంతుకు ఏమీ కాకుండా ఉండాలని నీళ్ళు కాచి చల్లార్చి ఇచ్చేది. నాకంటే కూడా తనే నా గొంతు విషయంలో శ్రద్ధ తీసుకునేది. వంట కూడా బాగా చేసేది. వాళ్ళ ఇంటికి చదువుకోడానికి వెళ్ళేటప్పుడు సాయంత్రం స్నాక్స్ భేల్పురి, చాట్ చేసేది. బైట నుంచి తెచ్చి తినడానికి ఒప్పుకునేది కాదు. బైట ఆహారం తీసుకుంటే నాకు ఏమవుతుందో అని ఆందోళన పడేది. ఒక సారి కాలేజ్ ప్రోగ్రాములో మమ్మల్ని పాటలు పాడమన్నారు. తాను కూడా పాటలు పాడేది. మేమిద్దరం పాటలు పాడతాము, డాన్స్ చేస్తాం అని దేవాదాస్ సినిమాలోని 'డోలా రే డోలా' పాటను ఎంచుకుని కాలేజ్ డుమ్మా కొట్టి విపరీతంగా ప్రాక్టీస్ చేసి, ఆ పాటకు సంబందించిన డ్రెస్ ఒకేలా ఉండాలని షాపింగ్ చేసి కుట్టించుకున్నాం. ఇద్దరం కాలేజ్ ప్రోగ్రామ్‌లో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకున్నాం. నేను ఎదుగుతున్న కొద్దీ తనెంతో సంతోషపడేది. పురస్కారాలు అందుకున్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా అభినందించేది.
నా ఇంటర్ అయ్యాక డిగ్రీ హైద్రాబాద్‌లో చేసాను. తనకు డిగ్రీ అయ్యాక హైద్రాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. హైద్రాబాద్ వచ్చాక కూడా మేము కలుస్తూనే ఉండేవాళ్ళం. ఇప్పటికి మా స్నేహనికి 16 ఏండ్ల వయసు. ఉరకలు వేస్తూనే ఉంది. తను వివాహం అయ్యాక జర్మనీ వెళ్ళిపోయింది. అయినా కూడా మా స్నేహం కొనసాగుతూనే ఉంది. సినిమాలకు, షికార్లకు వెళ్ళటం, పార్టీలు చేస్కోవడం, ఫొటోలు దిగడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే స్నేహం అనుకుంటున్నారు చాలామంది. కానీ స్నేహం అంటే ప్రతిరోజు పలకరించుకోక పోయినా మనకు బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అర్ధారాత్రయినా సరే ధైర్యంగా ఫోన్ చేయకలిగాలి. అది నిజమైన స్నేహం.
- మాళవిక, నేపధ్య గాయని
అన్నీ తనతోనే పంచుకుంటాను
మా నాన్న ముత్యాల రావు, అమ్మ పేరు సత్యవతి. మాది హైద్రాబాద్. అమ్మ నాన్నలకు మేము ఐదుగురం సంతానం. నాకు ముగ్గురు అన్నయ్యలు. ఒక అక్క. మాది మధ్య తరగతి కుటుంబం. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెండ్లి చేశారు. విచిత్రం ఏమిటంటే చిన్నప్పటి నుంచి పెండ్లి అయ్యేవరకు నాకు స్నేహితులు అంటూ ఎవరూ లేరు. ఇల్లు బడి ఆ తర్వాత కాలేజ్. స్నేహం ఎప్పుడు ఎక్కడ మొదలుతుందో చెప్పలేము. కొన్ని స్నేహాలు చిన్నప్పుడు మొదలై మధ్యలో ఆగిపోతాయి. కొన్ని మధ్యలో మొదలై చివరి వరకు ఉంటాయి. మా స్నేహం కూడా అలాంటిదే అని చెప్పవచ్చు.పెండ్లయి ఇద్దరు పిల్లల తల్లిని అయ్యాక నాకొక స్నేహితురాలు దొరికింది. ఒక సారి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. కొద్దీ సేపటికి ఒకావిడ వచ్చి నన్ను గట్టిగా కావలించుకుంది. ఆవిడ ఎవరో నాకు తెలియదు. చాలా ఆశ్చర్య పోయాను. తన పేరు ఉమ అని, నన్ను చూడగానే స్నేహం చేయలనిపించింది అని తానొక చిన్నపాటి వ్యాపార వేత్తనని పరిచయం చేసుకున్నారు. నేను కూడా కొద్దీ సేపటిలోనే ఆవిడతో ఎన్నో ఏండ్ల పరిచయం ఉన్నదానిల కలిసిపోయాను. ఫంక్షన్ కాగానే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లింది. అలా మొదలైన మా స్నేహం ఇప్పటికి ఇరవై రెండు వసంతాలు పూర్తి చేసుకుంది. ఒక్క రోజు కూడా మాట్లాడకుండా ఉండలేము. ఒక్కోసారి మా మధ్యలో అలకలు, కోపాలు కూడా చోటు చేసుకుంటాయి. మళ్లీ మాములే.
భర్తతో, ఆత్త మామలతో, తోటికొడళ్లతో చెప్పుకోలేని విషయాలను స్నేహితులతో మాత్రమే చెప్పుకోగలము. నాకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే తనతో నా బాధలు పంచుకుంటాను. తన ఓదార్పు మాటలతో నా మనసు తేలికపడి హాయిగా నవ్వుకునేల చేస్తుంది. మేము కలిసి యాత్రలకు వెళ్తాము, గట్ టూ గాథేర్స్ చేస్కుంటాము. మా స్నేహం కుటుంబ స్నేహాలు దాకా వెళ్లాయి. సాఫీగా సాగిపోతున్న తన జీవితంలో ఒక పెద్ద కుదుపు. కిందటి సంవత్సరం తన భర్త కరోనాతో చనిపోయారు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి తనకు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చాము. బైటకి తీసుకెళ్లడం, తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం చేసేదాన్ని. స్నేహం అంటే పైసలతో సంబంధించింది కాదు. స్నేహం అంటే కష్టాల్లో, బాధల్లో తోడు ఉండడం. మా స్నేహం చివరి శ్వాస వరకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
- ప్రసన్న రామ్మూర్తి
చైర్మన్, సిటీ గ్రంధాలయం, హైదరాబరాద్