Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్రోద్యమంలో మహిళలతి అనితరసాధ్యమైన పోరాటం. హక్కులు, సాధికారిత, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సాధించాలని చెప్పే ఐరోపా దేశాల మహిళా ఉద్యమాలకు ఏమాత్రం తగ్గకుండా స్వాతంత్య్రం కోసం సాగిన అన్ని రకాల పోరాటాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. వారి సాహసం, తెగువ, నాయకత్వం ప్రపంచంలోని మరే దేశ స్వాతంత్య్రోద్యమంలో కనిపించవని చెప్పవచ్చు. దేశం కోసం నిజమైన స్ఫూర్తి, మొక్కవోని సాహసం, నిబద్ధతలతో హింస, దోపిడీలను ఎదిరించారు. ఐరోనా అక్రమణదారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తొలి తిరుగుబాటుదారులు మహిళలే. కర్నాటకలో ఉల్లాల్ తీరంలో పోర్చుగోసు వారితో చావో రేవో అన్న రీతిలో అబ్బక్క రాణి పోరాడారు. ఆమె ధైర్యం, సాహసం పోర్చుగీసు జనరళ్ళను నిశ్చేష్టులను చేసింది. ఇలా ఎందరో మహిళలు తమ ప్రాణాలకు త్యగించి దేశం కోసం పోరాడారు. అలాంటి వారిలో కొందరిని ఈ రోజు మననం చేసుకుందాం...
1857 పోరాటం భారతీయ చరిత్రలో ఒక మైలురాలయి. అందులో చెప్పుకోదగిన ఘట్టం ఝాన్సీరాణి, లక్ష్మీబాయి ప్రదర్శించిన సాహసం. ఆమె ఝాన్సీ రాజు గంగాధరరావు భార్య. కుట్రాదారులైన బ్రిటీషర్లు ప్రవేశపెట్టిన 'డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్'ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఝాన్సీని అప్పగించేందుకు తిరస్కరించిన ఆమె 1857 తిరుగుబాటు సమయంలో పురుషవేషం ధరించి సాహసంతో పోరాటం చేస్తూ యుద్ధభూమిలో మరణించారు. ఆమె సాహసం విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడేందుకు అనేక మందికి స్ఫూర్తిని ఇచ్చింది. రామ్‌ఘడ్ రాజ్యపాలకురాలైన అవంతీ బాయి కూడా 1857 తిరుగుబాటు సందర్భంగా నాలుగు వేలమంది సైనికులను కూడగట్టుకొని సాహసంతో పోరాడింది.
విప్లవంలో మహిళలు
విప్లవోద్యమంలో మహిళలు వెనక్కి తగ్గలేదు. చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడిలో ప్రతిలాల్ వడ్డేదార్ చురుకుగా పాల్గొన్నారు. ఆమె మహిళా విప్లవ సంస్థ అయిన దీపాలీ సంఘంతో సంబంధాలు కలిగి ఉండి, ఢాకాలో విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. మరొక గొప్ప విప్లవకారిణి బీనా భౌమిక. బ్రిటిష్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌పై దాడి చేసే ప్రయత్నం చేశారు. కలకత్తా యూనివర్సిటీ స్నాతకోత్సవ సమయంలో, 1932లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఆమె అతడిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేసింది. దీనికి గాను ఆమెకు తొమ్మిదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించారు. 1939లో విడుదలైన తర్వాత ఆమె జుగాంతర్ విప్లవకారుల క్లబ్లో చేరారు. కలకత్తా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా ఉన్నప్పుడు 1942లో ఆమెకు మూడేళ్ళ జైలు శిక్ష పడింది.
గిరిజన మహళల పాత్ర
స్వాతంత్య్రోద్యమంలో గిరిజన మహిళలూ వెనకపడలేదు. నాగాలాండ్‌కు చెందిన రాణి గైదినిల్యూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏండ్ల తరబడి సాహసోపేతమైన పోరాటం చేశారు. ఆమె గాంధీతో స్ఫూర్తి పొంది, నాగాలాండ్‌లోని జెమి, లియాంగామాయి, రోంగ్మెరు తెగలను ఏకం చేశారు. స్వాతంత్య్రానంతరం కూడా ఆమె భారత దేశ సమగ్రతను పరిరక్షించేందుకు నాగా వేర్పాటు వాదులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాణి రాజమోహినీ దేవి తన జీవితాంతం గిరిజనులకు గాంధీ ఆలోచనా విధానాన్ని బోధిస్తూ గడిపారు.
జాతీయ కాంగ్రెస్‌లో మహిళలు
మహిళలు బహిరంగ సభలు నిర్వహించారు. విదేశీ వస్తువులు అమ్మే దుకాణాలకు వ్యతిరేకంగా పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తూ, ఖాదీ అమ్ముతూ, స్వాతంత్య్రసమరంలో చురుకుగా పాల్గొన్నారు. జైళ్ళను ధైర్యంగా ఎదుర్కొని కటకటాల వెనక్కి వెళ్ళారు. మాతృభూమికి స్వేచ్ఛను సాధించేందుకు వందల, వేల సంఖ్యలో భారతీయ మహిళలు తమ జీవితాలను అంకితం చేశారు. 1942 సెప్టెంబర్ 29న బెంగాల్‌లోని తుమ్లూక్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ప్రదర్శనలో 73 ఏండ్ల మాతంగిని హజ్రా పాల్గొన్నారు. బ్రిటిష్ పోలీసులు ఆమెను కాల్చి చంపారు. ఆమెపై పలుమార్లు కాల్పులు జరుపుతుండగా వందేమాతరమని నినదిస్తూ చేతిలో జాతీయ జెండా రెపరెపలాడుతుండగా మరణించారు. భారత ప్రజల సేవకు తమ జీవితాన్ని అంకితం చేసేందుకు ఇండియాకు వచ్చిన ఆంగ్ల వనితలలో నెల్లీసేన్ గుప్తా ఒకరు. జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన అన్ని ఉద్యమాలలో అగ్రభాగాన నిలిచి పోరాడిన ఆమెకు మహాత్మాగాంధీ, సరోజినీనాయుడు స్ఫూర్తి. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 1933లో నెల్లీ ఎన్నికయ్యారు.
కెప్టెన్ లక్ష్మీ సెహగల్
భారతదేశం చూసిన అత్యంత సాహసోపేతమైన మహిళలలో లక్ష్మీ సెహగల్ ఒకరు. ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి మెడిసిన్ పూర్తి చేసి, వైద్యురాలిగా పని చేసేందుకు సింగపూర్ వెళ్ళారు. కానీ ఆమె కోసం అక్కడ వేరే అంశం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో సింగపూర్ బ్రిటిష్ పాలనతో ఉంది. అయితే ఆ దేశంపై జపాన్ దండెత్తడంతో దానికి లొంగిపోవలసి వచ్చింది. వేలాది మంది భారతీయులు ఆ సమయంలో జైలుపాలయ్యారు. అదే సమయంలో నేతాజీ భారతీయ ఖైదీలను విఎన్ఎలో చేరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిందిగా ఆహ్వానం పలికారు. అలా చేరిన వారిలో లక్ష్మీ ఒకరు. ఆమె సాహసానికి ముగ్ధుడైన నేతాజీ ఆమెకు రాణి లక్ష్మీబాయి రెజిమెంట్ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. బర్మా అడవులలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆమె శివంగిలా పోరాడారు.
సాహసి ప్రీతిలాల్
ప్రీతిలాల్ వడ్డేదార్ బెంగాలీ జాతీయ విప్లవ నాయకురాలు. చిట్టగాంగ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె కలకత్తాలో బెతూనే కాలేజీలో చదివారు. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె వివిధ విద్యార్థి సంఘాలలో పని చేశారు. అనంతరం చిట్టగాంగ్ విప్లవకారుల నాయకుడైన సూర్యసేన్ శిష్యురాలయ్యారు. సేన్ ప్రభావంతో ఆమె బ్రిటిష్‌వారిని తరిమికొట్టే ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్యశక్తి ముందు కాంగ్రెస్ బలహీన విధానాలు పనికిమాలినవని భావించారు. తన సహచరులతో కలిసి ప్రీతిలాల్ బెంగాల్లో అనేక దాడులను చేసి, సామ్రాజ్యవాదుల శక్తియుక్తులను సవాలు చేసి వారిలో కలవరం పుట్టించారు. ఆమె చేసిన అత్యంత సాహసోపేతమైన చర్య పహర్తాలి యూరోపియన్పై దాడి.
అరుణా అసఫ్ అలీ
ఉపాధ్యాయురాలైన అరుణా అసఫ్ అలీ, జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలక సభ్యురాలరై, గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆమె నాయకత్వ పాత్ర పోషించారు. ఢిల్లీలో తొలి మేయర్‌గా ఎన్నికైన ఆమె 1975లో లెనిన్ శాంతి బహుమతిని, 1991లో అంతర్జాతీయ అవగాహనకు ఇచ్చే జవహర్ లాల్ నెహ్రూ అవార్డును, 1998లో భారతరత్నను పొందారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ఆమె అత్యంత ప్రముఖులు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె స్పందించిన తీరు సదాస్మరణీయం. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభాన్ని సూచిస్తూ గవాలియా ట్యాంక్ మైదానంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేసి, వేలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
తుదిశ్వాస దాకా దేశభక్తి - షహీద్ కనకలత
అసోంకు చెందిన కనకలత బారువా, క్విట్ ఇండియా ఉద్యమంలో జాతీయ జెండాను చేబూని ప్రదర్శనకు నాయకత్వం వహించారు. ఆమెను బ్రిటిష్ సేనలు కిరాతకంగా కాల్చి చంపారు. కలనకలత అసోంలోని నాటి అవిభజిత దర్శంగ్ జిల్లాలో బోరంగబరి గ్రామంలో కృష్ణకాంతి, కామేశ్వరి బారువాలకు జన్మించారు. ఆమె తాత ఘనాకాంత బారువా దర్శంగ్లో ప్రముఖ వేటగాడు. ఆమె పూర్వీకులు డొలా ఖరియా బారువా రాజ్యానికి చెందినవారు. అది ఒకనాటి అహౌమ్ స్టేట్ భాగం. వారు డొలా ఖరియా అనే బిరుదను త్యజించి బారువా బిరుదును నిలుపుకున్నారు. తల్లి ఆమెకు అయిదేండ్ల వయసులోనే మరణించారు. పునర్వివాహం చేసుకున్న తండ్రి కనకలత 13వ ఏట చనిపోయాడు. మూడవ తరగతి వరకు బడికి వెళ్ళిన ఆమె తన తమ్ముడిని చూసుకోవడానికి చదువు మానేయవలసి వచ్చింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆమె మృత్యువాహినిలో. అసోంలో గోV్ాపూర్ సబ్ డివిజన్‌కు చెందిన యువతతో ఏర్పాటైన డెత్స్వ్కాడ్ అది. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద 1942, సెప్టెంబర్ 20వ తేదీన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని వారు నిర్ణయించారు. ఆ పని చేసేందుకు నిరాయుధులైన గ్రామవాసులకు బారువా నాయకత్వం వహించి ఊరేగింపుగా బయలుదేరింది. ఊరేగింపు ముందుకు సాగింది. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ రేబతి మోహన్ సోమ్ హెచ్చరించారు. పోలీస్ హెచ్చరికలు లెక్కచేయకుండా ప్రదర్శన ముందుకు సాగింది. పోలీసులు వారిపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. కనకలతపై కాల్పులు జరపడంతో ఆమె చేతిలోని జాతీయ జెండా ముకుందకలోటి తీసుకోవడంతో, అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కనకలత, కలోటి ఇద్దరూ అమరులయ్యారు. చనిపోయినప్పుడు ఆమె వయసు పదిహేడేండ్లు.
విప్లవమే ఊపిరి : మాతంగిని హజ్రా
కొన ఊపిరి వరకు దేశ స్వాతంత్య్రంకోసం పోరాడిన మహిళా నాయకులలో మాతంగిని హజ్ర ఒకరు. బెంగాల్ రాష్ట్రంలోని తుమ్లుక్ జిల్లా హౌగియా గ్రామంలో పేద రైతు కుటుంబంలో పుట్టిన ఆమె పెద్దగా చదువుకోలేదు. అమెకు బాల్యంలోనే వివాహం జరిగింది. ఆమెకు 18 ఏండ్లపుడు భర్త చనిపోయాడు. గాంధేయవాదిగా అహింసా మార్గంలో స్వాతంత్య్రోద్యమంలో కడవరకు పోరాడిన ఆమెని మహిళాగాంధీగా పిలిచేవారు. 1905 నుంచి భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా 1942 సెప్టెంబర్ 29న మిడ్నాపూర్ ప్రాంతంలోని తమ్లక్ పోలీసు స్టేషన్‌ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి 72 ఏండ్ల మాతంగిని హజ్ర నాయకురాలు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మాతంగిని ప్రాణత్యాగం చేశారు.
ప్రజాసేవే ప్రాణం - బిఖాజీ కామా
భారత జాతీయ ఉద్యమంలో ప్రముఖురాలైన ఆమె బొంబాయిలో నిఖాజీ రుస్తుం కామాగా ఫ్రాంజీ పటేల్ ఫ్రాంజీ పటేల్ పార్సీలలో ప్రముఖులు. 1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు కామా ప్రజలను కాపాడే కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు సేవ చేస్తుండగా ఆ వ్యాధి సోకిన ఆమె చికిత్సకోసం యూరప్ వెళ్ళారు. జర్మనీలో స్టటర్గార్ట్లో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ సోషలిస్ట్ సదస్సులో భారత స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ 1907, ఆగస్టు 22న జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆమెను భారతీయ విప్లవ మాతగా అభివర్ణిస్తుంటారు. ఆమె సేవలను గుర్తిస్తూ గౌరవార్థం 1962 భారత్ తంతి, తపాలాశాఖ స్టాంపును విడుదల చేసింది. ఆమె పేరుతో గల ఓడ ఒకటి భారతీయ తీర దళాలలో ఉంది.