Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు రాష్ట్రాలలోనూ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది మహిళలు ఉద్యమించారు. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటంలో మహిళా చైతన్యం ఉవ్వెత్తున ఎగిసిపడింది. లేడీ హైదరీక్లబ్, సోదరి సమాజం, ఆంధ్ర యువతీమండలి, ఆంధ్ర మహాసభలతో పాటే జరిగిన మహిళా సమావేశాలు స్త్రీలను ఉత్తేజితులను చేశాయి. 1922లో మార్గరెట్ ఇకజివమ్స్ ప్రోత్సాహంతో ''ది ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ అడ్వాన్స్మెంట్'' అనే సంస్థ ఏర్పడింది. 300 మంది సభ్యులతో హైదరాబాద్ మహిళా సభ ఏర్పాటు చేశారు. ఆ వివరాలు నేటి మానవిలో...
రూప్‌ఖాన్ పేట రత్మాంబదేశాయి సాహిత్యం ద్వారా మహాత్ముని సిద్దాంతాలను ప్రచారం చేసింది. వితంతువుల కోసం హాస్టళ్లను ఏర్పాటు చేశారు. ఎస్. సుందరీబాయి, సందిటి సత్యవతీబాయి, చాట్రాతి లక్ష్మీనరసమాంబ, పత్రికల ద్వారా స్త్రీల చైతన్యానికి కృషి చేశారు.
అఘోరనాథ్ చటోపాధ్యాయ భార్య నాంపల్లిలో బాలికల కోసం స్కూల్‌ని ప్రారంభించారు. సుమిత్రాదేవి, టి.ఎస్.సదాలక్ష్మి, ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయ్య సంఘ సంస్కరణలకు కృషి చేశారు. 1917లో పందిటి వీర రాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మలు ''ఆంధ్ర సోదరీ'' సమాజాన్ని నెలకొల్పారు. దీని ద్వారా పలు సంస్కరణలు చేపట్టారు. 1922లో మార్గరెట్ ఇకజిమ్స్ ప్రోత్సాహంతో ''ది ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ అడ్వాన్స్మెంట్'' అనే సంస్థ ఏర్పడింది. 300 మంది సభ్యులతో హైదరాబాద్ మహిళా సభ ఏర్పాటు చేశారు. ఇది పది మహాసభల వరకు నిర్వహిచింది. సరోజినీనాయుడు, పద్మజానాయుడు, శాంతాబాయి, కిర్లోస్కర్, మాసుమాబేగం, ప్రేమ మాసిలమణినాయుడు, జానంపల్లి కుముదినీదేవి, జమాలున్నాసీబాజీ, అహల్యాబాయి, సర్దూబాయి, రంగమ్మ ఓబుల్‌రెడ్డి, యోగసుశీలాదేవి, సుశాలా కడ్డీకర్, విమల, జ్ఞానకుమారి హెడా, బ్రిజ్రాణిగౌర్, సరోజనీ రేగాని, చంద్రమణి దేవి, సంగం వెంకట రామమ్మ, టి.వరలక్ష్మమ్మ, బూర్గుల అనంతలక్ష్మీదేవి, అలివేలు మంగ తాయారమ్మ, వి.రుక్మిణమ్మ మొదలైన వారు మహిళా ఉద్యమాలు నడిపించిన వారిలో వున్నారు. 1930లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ మొదలైనవారు ఆంధ్ర మహిళా సంఘాన్ని నెలకొల్పారు. మొదటి పది ఆంధ్ర మహాసభలతోపాటు జరిగిన పది మహిళా మహాసభలకు నండిపల్లి సుందరమ్మ, టి.వరలక్ష్మమ్మ, యల్లాప్రగడ సీతాకుమారి, మాడపాటి మాణిక్యమ్మ, బూర్గుల అనంతలక్ష్మీదేవి, నందగిరి ఇందిరాదేవి, యోగ్య శీలాదేవి, రంగమ్మ ఓబుల్‌రెడ్డిలు అధ్యక్షత వహించారు. ఈ మహాసభలు స్త్రీ జనోద్ధరణకు, స్త్రీ విద్యకు కృషి చేశాయి. 1947లో జరిగిన సత్యాగ్రహౌద్యమంలో విమలాబాయి మేల్కొటె, కమలమ్మ, అహల్యాబాయి క్రియాశీలకంగా పాల్గొన్నారు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్
మద్రాసు ప్రెసిడెన్సి (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) లోని రాజమండ్రిలో 1909 జూలై 15న మద్య తరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి రామారావు, తల్లి కృష్ణవేణమ్మ. 8 ఏండ్ల వయసులో మేనమామ సుబ్బారావుతో ఆమెకు వివాహమయింది. ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించారు. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు. బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పదేండ్లకే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించారు. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్ సైన్స్), 1942లో ఎల్.ఎల్.బి పూర్తిచేశారు. న్యాయశాస్త్రం చదివిన తర్వాత మద్రాసులో హైకోర్టులో సాధన ప్రారంభించింది.
దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. తన 12 ఏండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించారు. రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించారు. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏండ్ల వయసులోనే విరాళాలను సేకరించి ఆయనకు అందజేశారు. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందారు. తర్వాత కాలంలో మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు అయ్యారు. స్వాతంత్య్ర సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొంటూనే చదువును కొనసాగించారు. దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నపట్నంలో (ప్రస్తుత చెన్నైలో) ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది.1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకులుగా ఉన్నారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు, వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు. చెన్నైలో 70మంది కార్యకర్తలతో ఉదయవనం అనే పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచారు. 1971లో సాక్షారతా భవన్ని ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసి 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలయ్యారు. ఆ సమయంలోనే సి.డి.దేశ్ముఖ్తో పరిచయం పరిణయానికి దారి తీసింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేశారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. దుర్గాబాయి 1981 మే 9వ తేదీన హైదరాబాదులో మరణించారు.
అసామాన్య వ్యక్తిత్వం
మల్లు స్వరాజ్యం... తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతరం కూడా ఆమె రాజకీయ కార్యక్రమాల్లో క్రీయాశీలంగా పాల్గొన్నారు. సామాజిక మార్పుకోసం చిత్త శుద్దితో కృషి చేశారు.
ఈమె 1930లో భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. చాలా చిన్న వయసులోనే జాతీయో ధ్యమాన భాగ స్వాములయ్యారు. 1940లలో తెలంగాణ ప్రాంతం భూస్వామ్య వ్యతిరేక ఉద్య మంలో అట్టుడికిపోయున్నది. ఇందులో స్వరాజ్యం మమేకమైపోయారు. తొలిదశలో అన్నయ్య భీమిరెడ్డి నర్సింహారెడ్డి ద్వారానే ఆమెలో రాజకీయ చైతన్యం ఏర్పడింది. సామాజిక అణిచివేతను వ్యతిరేకిస్తూ స్వరాజ్యం పేదల పక్షం వహించారు. ఈ విధంగా తను జన్మించిన వర్గపు విధ్వంసానికి పూనుకున్న శక్తులవైపే స్వరాజ్యం నిలిచారు. తెలంగాణా సాయుధ సమరంలో సాగిస్తున్న కమ్యూనిస్టు గెరిల్లా దళాలకు నాయకురాలయ్యారు.
స్వరాజ్యం తండ్రి భీమిరెడ్డి రామిరెడ్డి సూర్యాపేట తాలూకాలో ఒక చిన్న భూస్వామి. ఇంట్లోని పురుషులతో ఆయన స్త్రీలను వేరుపరిచేవారు. కానీ పెద్ద జమీందార్ల వలె ఆడపిల్లల విద్యాబోధనకు అధ్యాపకుడిని ఏర్పాటు చేశారు. అలాగే బాలికలకు గుర్రపుస్వారీ, ఈత, వ్యాయామ శిక్షణా ఇప్పించారు. స్వరాజ్యం మూడో తరగతిలో ఉండగా తండ్రి చనిపోవడంతో వీరి చదువు ఆగిపోయింది. ఆయన మరణంతో వారి ఆర్థిక పరిస్థితిలో పెద్ద మార్పు వచ్చింది. ఆ సమయంలో స్వరాజ్యం తల్లి సొక్కమ్మ ధైర్యంగా కుటుంబాన్ని నడిపారు. ఆమె ప్రభావం పిల్లలపై పడింది. సొక్కమ్మకు ఐదుగురు సంతానం. గాంధీకి ఉప్పు సత్యాగ్రహం గురించి విన్న ఆమె తన మూడో బిడ్డకు స్వరాజ్యం అని పేరు పెట్టారు. రామిరెడ్డి చనిపోయేనాటికి ఐదో సంతానం ఇంకా పసికందే.
తెలంగాణ పల్లెల్లో వస్తున్న మార్పుల్ని ఎదుగుతున్న స్వరాజ్యం గమనించారు. బాల్యం నుండి ఆమెకు అన్ని విష యాలు తెలుసుకోవాలని ఆసక్తి. అలాగే ప్రతిదాన్ని ప్రశ్నించే స్వభావం. గోర్కి రచించిన 'అమ్మ' నవల 1942లో స్వరాజ్యం ఇంటికి చేరింది. దీని ప్రభావం ఆమెపై తీవ్రంగా పడింది. ఆ సమయంలోనే ఆంధ్రమహాసభ ఉద్యమం ప్రారంభయింది. ఆ సమయంలోనే స్వరాజ్యం తొలిసారి ఆంధ్రమహిళా సభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆరుట్ల కమలాదేవి ఇంట్లో రాజకీయ శిక్షణ తరగతులు జరిగేవి. వెట్టిచారికిరికి వ్యతిరేక పోరాటం ప్రారంభమైంది. అప్పటి నుండే ఆమె పూర్తిగా రాజకీయాల్లో మమేకమయ్యారు.
ఆంధ్రమహాసభ మహిళా విభాగం 1930లో ప్రారంభమైంది. 1942న తన 12 ఏండ్ల వయసున స్వరాజ్యం దీని సభ్యురాలయ్యారు. 1946లో కమ్యూనిస్టు పార్టీ సభ్యులయ్యారు. మరికొద్ది రోజుల్లో దేశానికి స్వాతంత్య్రం వస్తుందనగా పల్లెల్లో రజాకార్ల ఆగడాలు పెరిగిపోయాయి. ఆ హింసకు, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా 1948 నుండి 1951 సాయుధ పోరాటం జరిగింది. అందులో స్వరాజ్యం కూడా తుపాకి పట్టి పోరాడారు. ఎన్నో కష్టాలకు ఓర్చి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తర్వాత ప్రజాప్రతినిధిగా ఎన్నో సేవలు చేశారు.
సంగెం లక్ష్మీబాయి
రంగారెడ్డి జిల్లా ఘటకేసర్లో జూన్ 27 1911న సంగెం లక్ష్మీబాయి జన్మించారు. చిన్నతనం నుండి చురుకైన అమ్మాయి కావడంతో మాడపాటి హన్మంతరావు దృష్టిలో పడింది. గుంటూరు లోని శారదానికేతన్‌లో చదివించాలన్న మాడపాటి సలహాతో లక్ష్మీబాయిని శారదానికేతన్‌లో చేర్పించారు. 1927లో విద్వాన్ పరీక్షలో పాసైన ఆమె ఎనిమిదేండ్లు అక్కడే ఉన్నారు. హిందీ సాహితీ విదుషీ డిగ్రీని తీసుకున్నారు. ఆ సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1930 గాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యపరిచారు. కల్లు, సారా, విదేశీ వస్త్రదుకాణాల ముందు సత్యగ్రహాలు చేసి అరెస్టుయ్యారు. జైలులో ఉండి కూడా ఉద్యమపంథా వీడలేదు. స్త్రీల కోసం జైలులో ప్రత్యేక గదులు కట్టాలని పోరాడారు.
1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని అరెస్టయి ఏడాది జైలు శిక్ష అనుభవించారు. 1933లో మద్రాసు వెళ్లిన లక్ష్మీబాయి చిత్రకళలో డిప్లొమా పొందారు. ఐదు సంవత్సరాలు అక్కడే వుండి, 1938లో హైదరాబాద్‌లో గుల్బార్గా బాలికల స్కూలులో డ్రాయింగ్ టీచర్‌గా చేరారు. ఆ సమయంలో నారాయణగూడలోని లాల్‌బహదూర్ వెంకటరామిరెడ్డి వుమెన్ కాలేజీ హాస్టల్‌కి గౌరవ వార్డెన్‌గా నియమించారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలపెట్టి సాయుధపోరాటంలో పాల్గొన్నారు. విముక్తి పోరాటంలో మహిళలను నడిపారు. షోయబుల్లాఖాన్‌ను రజాకర్లు చంపినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను పలకరించడానికి కూడా ప్రజలు భయపడ్డారు. అయినా లక్ష్మీబాయి జంకలేదు. వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పలకరించి ఆదుకున్నారు. భారత్‌లో హైదరాబాద్ విలీనం అయ్యాక లక్ష్మీబాయి తన సేవ కార్యక్రమాలను విస్త రించారు. 1952లో హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ చౌరస్తాలో రెండెకరాల్లో వున్న సొంత ఇంట్లోనే స్త్రీసేవ సదన్‌ను ప్రారంభించారు. అదే సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ బాన్సువాడ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ అసెంబీకి ఎన్నికయ్యారు. 1954 నుంచి 1956 వరకు డిప్యూటీ విద్యాశాఖా మంత్రిగా పని చేశారు.
ఆమె హయాంలోనే తెలంగాణ జిల్లాలో బాలికల కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. మంత్రిగా సంపాదించిన ప్రతి పైసాను స్త్రీ సేవ సదన్కే ఉపయోగించారు. 1955లో ఆ సదన్కే ఇందిరా సేవా సదన్ అని రిజిస్ట్రేషన్ చేయించి అనాథ శిశువులకు, స్త్రీలకు ఉచిత విద్యను అందించడంతో పాటు వారి బాగోగులు చూసుకున్నారు. వీటి గురించి తెలుసుకున్న నెహ్రూ స్వయంగా వచ్చి సహాయం చేశారు. 1957లో మెదక్ లోక్‌సభకు పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. తర్వాత 1962,67 లోనూ ఎన్నికయ్యారు. 14 ఏండ్లు పార్లమెంటు సభ్యురాలిగా పని చేసిన ఆమె తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మొదటి మహిళ. 1972లో ఇందిరా సేవ సదన్‌లో ఇందిరా ఓరియంటల్ కాలేజీ నడిపి ఎందరో విద్యార్థులకు బంగారుబాట చూపించారు. 1979లో క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఆమె చనిపోయే వరకు స్త్రీ సంక్షేమం కోసం అలుపెరుగని సేవ చేశారు.