Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోదావరి పరులేకర్.. స్వాతంత్య్ర సమరయోధురాలు.. రచయిత.. సామాజిక కార్యకర్త. మార్క్సిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ప్రభావితమై రైతులు, శ్రామిక వర్గం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. మహారాష్ట్రలో అత్యంత దారుణమైన జీవితం అనుభవిస్తున్న వర్లీ ఆదివాసీల కోసం తిరుగులేని పోరాటం చేశారు. వారిని చైతన్యపరిచేందుకు అహర్నిశలూ శ్రమించారు. భారతదేశంలోని అట్టడుగు, అణగారిన వర్గాల కోసం ఆమె చేసిన సేవకు గాను లోకమాన్య తిలక్ అవార్డు, సావిత్రిబాయి ఫూలే అవార్డు లభించింది. ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ఆమె జీవితం పరిచయం నేటి మానవిలో...
గోదావరి పరులేకర్ 1907 ఆగస్టు 14న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. ఆమె తండ్రి లక్ష్మణరావు గోఖలే ప్రఖ్యాత న్యాయవాది. బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టడంతో బాగా చదువుకునే అవకాశం దొరికింది. ఫెర్గూసన్ కాలేజీ నుండి పట్టభద్రురాలయ్యారు. తర్వాత న్యాయశాస్త్రం అభ్యసించారు. మహారాష్ట్రలోనే మొదటి మహిళా లా గ్రాడ్యుయేట్‌గా చరిత్ర సృష్టించారు.
విద్యార్థి ఉద్యమంలో
కాలేజీలో చదువుకునే రోజుల్లో గోదావరి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. సత్యాగ్రహాలలో పాల్గొని 1932లో జైలుకు సైతం వెళ్లారు. అయితే బ్రిటిష్ పాలనలో సుఖంగా జీవిస్తున్న కుటుంబానికి గోదావరి స్వాతంత్య్రోద్యమంలో పని చేయడం నచ్చలేదు. దాంతో ఇల్లు వదిలి ముంబైలో సామాజిక సేవకురాలిగా చేరాలని నిర్ణయించుకున్నారు.
అక్షరాస్యత ప్రచారంలో...
ముంబై వచ్చిన గోదావరి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరారు. ఆమె అందులో మొదటి మహిళా జీవితకాల సభ్యురాలు. 1937లో ఆమె మహారాష్ట్రలో అక్షరాస్యత ప్రచారాన్ని నిర్వహించారు. 1938లో కార్మికవర్గ సమస్యల పరిష్కారంలో భాగంగా గృహ కార్మికులను సంఘటితం చేశారు. 1938-39లో మహారాష్ట్రలోని థానే జిల్లాలో రైతులను సంఘటితం చేసింది.
కమ్యూనిస్టు పార్టీతో పరిచయం
సర్వెంట్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నప్పుడు ఆమెకు శ్యాంరావుతో పరిచయం ఏర్పడింది. ఒకే భావాలు కలిగిన ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరి సిద్ధాంతాలు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి సరిపోలేదు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆ సొసైటీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరికి నచ్చలేదు. ఆ సమయంలో దీన్ని వదిలేయడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారు. కొన్ని ఘర్షణల తర్వాత వారు ఆ సంస్థను విడిచిపెట్టి 1939లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. బ్రిటిష్ పాలనను కూలదోయడానికి శ్రామికవర్గం, రైతులను సంఘటితం చేయడం ఉత్తమ మార్గమని గోదావరి నమ్మారు. ఆ సమయంలోనే ఆమె మార్క్సిజం నుండి ప్రేరణ పొందారు. సిపిఐ ఆధ్వర్యంలో ఆమె ముంబైలో కార్మికవర్గ మొదటి యుద్ధ వ్యతిరేక సమ్మెను నిర్వహించారు. ఆ సయమంలో ఎందరో నేతలు జైలుపాలయ్యారు. అయినప్పటికీ కూడా ఆమె నిరసనలకు నాయకత్వం వహించారు. ఈ సమ్మెలో పాల్గొన్నందుకు గోదావరి 1940 నుండి 1942 వరకు జైలు శిక్ష అనుభవించారు
రైతులు, ఆదివాసీలతో కలిసి
జైలు నుండి విడుదలైన తర్వాత ఆమె రైతులను సంఘటితం చేయడంపై దృష్టి సారించింది. అఖిల భారత కిసాన్ సభలో చేరారు. మహారాష్ట్ర కిసాన్ సభను స్థాపించారు. ఆమె ఆ సభకు మొదటి సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు చూశారు. ఆమె తన జీవితాన్ని థానేలోని వార్లీ కమ్యూనిటీ పోరాటానికి అంకితం చేశారని చెప్పాలి. ఆదివాసీ ప్రజలు సంపన్న భూస్వాములచే బలవంతంగా బంధించబడి వారి ఇండ్లలో వెట్టిచాకిరి చేసేవారు. వార్లీ స్త్రీలు భూస్వాములచే లైంగిక దాడులకు గురయ్యారు. ఆ రోజుల్లో అత్యంత దారుణమైన ఆచారం ఒకటి ఉండేది. తమ ఇంటి ఆడపిల్లకు పెండ్లి చేసేందుకు డబ్బు లేక గత్యంతరం లేక భూస్వామి వద్ద అప్పుతీసుకునేవారు. ఆ డబ్బుకు వడ్డీగా పెండ్లి కూతురిని భూస్వామి వద్దకు పంపాల్సి వచ్చేది. ఇది అ రోజుల్లో ఉన్న అత్యంత ఘోరమైన ఆచారం. దీనికి వ్యతిరేకంగా గోదావరి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మహిళలను చైతన్యపరిచి భూస్వాములపై తిరుగుబాటు చేశారు. ఆడపిల్ల తరపు భర్త శ్యాంరావుతో కలిసి 1945 నుండి 1947 వరకు వార్లీ ఆదివాసీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. తర్వాత కాలంలో ఆమె తను రాసుకున్న పుస్తకంలో ఈ విషయాలన్నీ పొందుపరిచారు.
ఆదివాసీ ప్రగతి మండల్
స్వాతంత్య్రం తర్వాత కూడా గోదావరి వార్లీలు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆమె 1961లో శ్యాంరావుతో కలిసి ఆదివాసీ ప్రగతి మండల్ (గిరిజన ప్రగతి మండలి)ని స్థాపించారు. కమ్యూనిస్టు పార్టీ 1964లో చీలిపోయింది. ఆ సమయంలో థానే జిల్లాలో భార్యాభర్తల నాయకత్వంలో పార్టీ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లోకి వచ్చింది. మహారాష్ట్రలోని 163 మంది పార్టీ నాయకులలో శ్యాంరావు, గోదావరి ఇద్దరూ జైలులో ఉన్నారు. తర్వాత కాలంలో శ్యాంరావు, గోదావరి రాష్ట్ర సచివాలయానికి ఎన్నికయ్యారు. 1965లో శ్యాంరావు మరణానంతరం గోదావరి సిపిఐ(ఎం)కి నాయకత్వం వహించారు. 1986లో అఖిల భారత కిసాన్ సభకు తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విధంగా తన జీవితాంతం రైతులు, ఆదివాసీల కోసం అహర్నిశలూ శ్రమించిన ఆమె 8 అక్టోబర్ 1996న మరణించారు.
రచనలు
గోదావరి ఉద్యమం కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను తన పుస్తకాల్లో పొందుపరిచారు. ఆమె రాసిన పుస్తకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినది 'జెవా మనుస్ జగ హోటో' (ది అవేకెనింగ్ ఆఫ్ మ్యాన్). ఇది 1970లో ప్రచురించబడింది. ఈ పుస్తకం 1972లో సాహిత్య అకాడమీ అవార్డును సైతం అందుకుంది. అలాగే దీనికి జవహర్లాల్ నెహ్రూ అవార్డు, సోవియట్ ల్యాండ్ అవార్డు కూడా లభించింది. ఈ పుస్తకం ఇంగ్లీష్, జపనీస్తో పాటు అనేక భాషలలోకి అనువదించబడింది. ఇంకా ఆమె ఆదివాసీ తిరుగుబాటు: పోరాటంలో వార్లీ రైతుల కథ, బండివాసాచి ఆథ్ వర్ష్ (ఎనిమిదేళ్ల జైలు శిక్ష) అనే పుస్తకాలు కూడా ఆమె రచించినవే.