Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ విముక్తి పోరాటాల చరిత్రలో భారతీయులు సాగించిన స్వాతంత్ర సంగ్రామం సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహత్తర ఘట్టం. బ్రిటిష్ వలసపాలకుల నుండి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కోరుకుంటూ భరతగడ్డ మీద ఉన్న అన్ని సాంఘిక జనసముదాయాలు ఏకోన్ముఖంగా పోరుబాటన సాగాయి. ఈ పోరాటాలలో పురుషులతో పాటు మహిళలు కూడా ప్రత్యక్షంగా కీలక పాత్రను పోషించారు. ఆచార సంప్రదాయాలు, సామాజిక పరిమితులలో ఉన్న మహిళలు ఉద్యమకారులైన తమ కుటుంబ సభ్యులను బ్రిటిషు ప్రభుత్వ వ్యతరేక పోరాటాల దిశగా ప్రోత్సహిస్తూ స్వాతంత్య్ర పోరాటంలో అద్వితీయ పాత్ర పోషించారు. అయితే భారతదేశ దాస్య శృంఖలాల విముక్తికి తమ సర్వస్వం ఒడ్డి పోరాడిన అనేక మంది మహిళల గురించి నేటి తరానికి తెలిసింది తక్కువ. చాలామంది మహిళల పోరాట గాథలు చీకటి పుటల్లోనే ఉండిపోయాయి. ముస్లిం మహిళల విషయంలో ఈ వివక్ష మరింత ఎక్కువగా కనబడుతుంది. మాతృదేశం కోసం, జాతి జనుల కోసం పోరాడి, ఆనాటి పోరాటాలకు స్ఫూర్తి నిచ్చిన అలాంటి ముస్లిం మహిళల జీవితాల గురించి నేటి మానవిలో తెలుసుకుందాం...
ఈ సమరోజ్వల చరిత్రలో ముస్లిం మహిళలు కూడా పురుషులతో ధీటుగా తమదైన వీరోచిన పాత్ర నిర్వహించారు. ప్రథమ స్వాతంత్యసమరంలో ప్రధాన పాత్ర వహించిన ముస్లిం స్త్రీలు తమ అపూర్వ త్యాగాలతో, ఆత్మార్పణలతో చరిత్ర పుటలను ఎరుపెక్కించారు. అటువంటి వారిలో ప్రముఖులు అవధ్‌రాణి బేగం హజరత్ మహాల్. బ్రిటిష్ పాలకులు ఆమె భర్త నవాబ్ వాజిద్ అలీషాను అరెస్టు చేసి అవధ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాతృభూమి పరుల పాలవడంతో ఆగ్రహించిన ఆమె ప్రజల అండదండలతో బ్రిటిష్ సైన్యంపై విరుచుపడి తిరిగి తన రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా భారీ సంఖ్యతో చుట్టుముట్టిన బ్రిటిష్ సైనిక మూకలపై పోరాడి చివరకు సజీవదహనమైన అస్గరి బేగం, సాయుధంగా ఆంగ్ల సైన్యాలను నిలువరించిన బేగం జమిలా, కత్తిపట్టి కదనరంగాన శతృవును సవాల్ చేసిన సాహసి బేగం ఉమ్‌ద్దా లాంటి వారు ఎందరో ఉన్నారు.
దేశమంతా తిరిగి
బ్రిటిష్ పాలకుల దమననీతి, నిర్బంధాలకు భీతిల్లకుండా జాతీయోద్యమబాటలో నడిచిన స్త్రీలలో బీబీ అమ్మకు తొలి స్థానం లభించింది. ఆమె అసలు పేరు ఆబాదీ బానో బేగం. అయితే అందరిలో ఆమె బీబీ అమ్మగా చిరస్మరణీయ ఖ్యాతి గడించారు. అనితరసాధ్యమైన సాహనంతో, అద్భుతమైన ప్రసంగాలతో, ఆదర్మవంతమైన నేతృత్వంతో ఖిలాఫత్ ఉద్యమం కోసం దేశమంతా తిరిగి ఆమె నిధులను సమకూర్చారు. ఈ నిధులే భారత పర్యటన గావించిన గాంధీజికి ఉపయోగపడ్డాయి. ఈ దేశపు కుక్కలు, పిల్లులు కూడా బ్రిటిష్ బానిస బంధనాలలో నుండ వీలులేదని గర్జించిన ఆమె హిందూ, ముస్లింల ఐక్యతకు చివరి వరకు కృషి చేశారు. జాతీయోద్యమకారకులంతా తనను అమ్మ అని పిలుస్తున్నందున, బిడ్డల ఎదుట తనకు పర్దా అక్కరలేదని ప్రకటించి, పర్దాలేకుండా బహిరంగ సభలలో ప్రసంగించిన సాహసి ఆదాది బానో బేగం.
ఖుదీరాంను రక్షించేందుకు
ఆదాది బానో బేగం బాటలో నడిచిన మరొక చిచ్చర పిడుగు నిషాతున్సీసా బేగం. ఆమె ఫైర్ బ్రాండ్‌గా పిలువబడిన మౌలానా హస్రత్ మొహాని భార్య. భర్త పలుమార్లు జైలుకు వెళ్ళినా అధైర్యపడకుండా ఉద్యమబాటన చివరికంటా నడిచిన మహనీయురాలు. విరుచుకు పడుతున్న భయానక వాతావరణంలో విప్లవ వీరుడు ఖుదీరాంను రక్షించుకునేందుకు విఫల ప్రయత్నం చేశారామె. బ్రిటిష్ గూఢాచారి వర్గాల కళ్ళు కప్పి జాతీయ ఉద్యమకారులకు సమాచారాన్ని చేరవేసే కొరియర్‌గా సఫియా వాజిద్ చురుకైన పాత్ర పోషించారు. ఇదే వరసులో కంటక ప్రాయమైన విప్లవబాటను ఎంచుకుని ఆత్మార్పణకు సిద్ధపడిన రజియా ఖాతూన్ లాంటి మహిళలు ఎందరో ఉన్నారు.
పెన్షన్ తిరస్కరించారు
స్వాతంత్య్రోద్యం వేగం అందుకున్న లక్ష్యసాధన దిశగా పరుగులిడుతున్న దశలో ఉద్యమంలో భాగస్వాములైన మహిళలు ఎందరో ఉన్నారు. ఈ తరంలోని ముఖ్యులలో ఒకరు జుబేదా బేగం. చిన్ననాటనే ఉద్యమ బాటన నడక ప్రారంభించిన ఆమె అద్భుత వక్త. సుసంపన్న కుటుంబంలో జన్మించిన ఆమె తన సర్వస్వం జాతీయోద్యమానికి సమర్పించారు. చివరి దశలో కటిక పేదరికం అనుభవిస్తూ కూడా ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ స్వీకరించ నిరాకరించారు. పెన్షన్ సీకరించటమంటే తన మాతృదేశ సేవకు ఖరీదు కట్టడమేనంటూ, ఎటువంటి ఆర్థిక సహాయం స్వీకరించకుండా గడిపారు. ఈ రకంగా భారత ప్రభుత్వం ఇవ్వజూపిన అనేక రకాల ఆర్థిక సహాయాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించిన వారెందరో ఉన్నారు.
యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలో
ఉద్యమంలో భాగంగా గాంధీజి అడుగుజాడల్లో నడిచిన ప్రముఖుల్లో శ్రీమతి అముతుస్సలాం ఒకరు. నైఖాళి మతకలహాల నివారణకు గాంధీజీ ఆమెను పంపారు. కలహాల నివారణకు గ్రామీణులు సహకరించకుండా మంకుపట్టు పట్టడంతో 22 రోజులపాటు నిరాహారదీక్ష పూని ఆ ప్రాంతంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పారు. ఒక మహిళ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో బహిరంగంగా పాల్టొనటం అదే ప్రథమమని ఆనాడు పలువురు శ్లాఘించారు. అలాగే జాతీయోద్యమకారుడైన భర్త, ఆమెను పర్దా పద్ధతి నుండి విముక్తి చేయడంతో, రబియాబీ మరింత ఉత్సాహంతో స్వాతంత్య్రోద్యమంలోని ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు సాగిన యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలో స్వయంగా పాల్గొనటమే కాక యుద్ధ వ్యతిరేక నినాదాలిచ్చి పలువుర్ని ఆశ్చర్యపరిచారు. ఎంతో మంది అనేక విమర్శలు చేసినప్పటికీ చివరి శ్వాస వరకు జాతీయోద్యమంలో పాల్గొనడం ఆమె మానలేదు. ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ముస్లింలు తమ భాగస్వామ్యాన్ని అందించారు. స్త్రీ, పరుష భేదం లేకుండా ఆ పోరులో పాల్గొన్నారు. అటువంటి వారిలో రాజారం గ్రామానికి చెందిన జైనాబి ఒకరు. పేద రైతు కుటుంబానికి చెందిన ఆమె పోరాట నాయకులకు తన ఇంట రక్షణ కల్పించారు.
బేగం హజరత్ మహాల్
ఆమె ఉత్తర భారతదేశంలోని అత్యంత సంపన్నమైన అవధ్ రాజ్యం అధినేత నవాబ్ వాజిద్ ఆలీషా సతీమణి. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్. ఆమె చిన్నపటి పేరు ముహమ్మద్ ఖానం. వివాహం తర్వాత ఆమె బేగం హజరత్ మహాల్ అయ్యారు. తమ రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి దాసోహం చేయమని బ్రిటిష్ వారు ఆజ్ఞాపిస్తే దాన్ని హజరత్ మహాల్ వ్యతిరేకిస్తుంది. దాంతో నవాబ్ వాజిద్‌ను బ్రిటిష్ వాళ్ళు బంధిస్తారు. ఆ తర్వాత ఆమె రంగంలోకి దిగి బ్రిటిష్ వారితో పోరాడి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటుంది.
మహబూబ్ ఫాతిమా
పదా చాటున జీవితాలు గడిపే కులీన వర్గానికి చెందిన ముస్లిం ఆడపడుచులు బ్రిటిస్ వ్యతిరేక పోరాటాలలో బహిరంగంగా రంగం మీదకు రావటం జాతీయోద్యమ ప్రారంభ దినాలలో చాలా విశేషం. ఆనాడు సాంఘిక జనసముదాయానికి చెందిన మహిళలైనా జైలుకు వెళ్ళటానికి అంతగా ముందుకొచ్చేవారు కాదు. అటువంట వ్యతిరేక వాతావరణంలో శ్రీమతి మహబూబ్ ఫాతిమా ఢిల్లీలో అరెస్టయి జైలుకెళ్ళి సంచలనం సృష్టించారు.
హమీదా తయ్యాబ్జీ
బ్రిటీషు బానిస బంధనాల నుండి విముక్తి కోరుకున్న భారతీయ దృఢసంకల్పంతో ఆ దిశగా ముందుకు సాగారు. పోరుబాటలో దీక్ష చేపట్టారంటే వారిని మార్గం మళ్లించడం ఎంతటి క్రూరత్వానికైనా సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వం ఎంతటి దారుణాలకు పాల్పడినా ఉద్యమకారులు పోరుబాట తప్పలేదు. ఈ వైఖరికి పురుషులైనా, స్త్రీలైనా తేడా కన్పించలేదు. భయానక హింసకు కూడా ఏమాత్రం వెనకడుగు వేయక మున్ముదుకు సాగిన సాహస మహిళలు జాతీయోధ్యమంలో పలువురు దర్శనమిస్తారు. ఆ మహిళలలో చెప్పుకోదగ్గవారు శ్రీమతి హమీదా తయ్యాబ్జీ. గుజరాత్ రాష్ట్రానికి చెందిన తయ్యాబ్జీ కుటుంబానికి చెందిన హమీదా తయ్యాబ్జీ 1911లో బరోడాలో జన్మించారు. ఆమె సీనియర్ కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసం గావిస్తున్న సమయంలో తన కుటుంబీకులతో పాటు జాతీయోద్యమంలో పాల్గొనేందుకు చదువును మధ్యలో వదిలేశారు. భారత జాతీయ క్రాంగెస్ యువజన సమితిలో సభ్యురాలయ్యారు. జాతీయోద్యమంలో భాగంగా జరిగిన అన్ని ప్రధాన సంఘటనలలో ఆమె పాల్గొన్నారు. పలుపార్లు జైలు శిక్షలు కూడా అనుభవించారు.
బేగం ముహమ్మద్ ఆలం
భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటున్న భర్తల అడుగుజాడల్లో నడుస్తూ, తమదైన ప్రత్యేక పాత్రను నిర్వహింఇచన ముస్లిం మహిళలు ఎందరో ఉన్నారు. ఆ మహిళలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రస్తావనలు చాలా అరుదుగా కన్పిస్తాయి. జీవిత భాగస్వాములు బ్రిటిష్ ప్రభుత్వ దాష్టీకాలకు గురవుతూ, తరచుగా జైలు పాలవుతున్నందున ఎదురవుతున్న ఆర్థిక సామాజిక ఇక్కట్లతో పాటుగా మనోవ్యధను జీవితమంతా భరిస్తూ ఉద్యమాలకు ఊపిరి పోసిన మహిళామణుల త్యాగం అనిర్వచనీయం. అటువంటి మహిళలు చూపిన తెగువ, చాటిన దేశభక్తి, త్యాగనిరతి, చరిత్రలో తమదైన స్థానం ఏర్పర్చుకున్నాయి. ఆ విధమైన చరిత్రను సృష్టంచి మహిళలో బేగం ముహమ్మద్ ఆలం ఒకరు. ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టరÊ ముహమ్మద్ ఆలం భార్య. లహౌర్కు చెందిన ఖాన్ షేక్ మియా ఫిరోజుద్దీన్ కుమార్తె. ఆలం లండన్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసుకొని లాహౌర్‌లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 1921లో వృత్తిని త్యజించి జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. ఆనాటి నుండి బేగం ఆలం భర్త కార్యక్రమాలకు పరోక్షంగా మద్దతునిస్తూ జాతీయోద్యమంలో భాగం పంచుకున్నారు.
- ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమద్ రచించిన 'భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు' నుండి సేకరణ