Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ పనైనా సరే భారంగా ఫీలయితే అస్సలు చేయాలనిపించదు. అందుకే రోజువారీ పనులు కాకుండా అదనంగా పనులేవైనా చేయాల్సి వచ్చినప్పుడు వాటిని బరువుగా అనుకోవద్దు. ఉదాహరణకు పండుగలు, శుభకార్యాలకు ఇంట్లో బూజు దులపడం, వస్తువులన్నీ శుభ్రం చేసుకోవడం.. మొదలైనవి చేస్తుంటాం. అయితే ఇవన్నీ చేసుకోవడం కాస్త కష్టమే అయినా వీటి వల్ల శరీరానికి అందే వ్యాయామం ఎక్కువే! ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలా ఎంజారు చేస్తామో.. ఇంటి పనులన్నీ కూడా అంతే ఉత్సాహంతో చేస్తే అలుపన్నది అంత త్వరగా దరిచేరదు. పైగా పనులు కూడా త్వరగా పూర్తవుతాయి.. ఒంటికి వ్యాయామమూ అందుతుంది.
మనం ఎంత డల్‌గా ఉన్నా సరే.. మంచి ఫాస్ట్‌బీట్ పాట ఒకటి విన్నామనుకోండి.. అంతే.. మనలో ఎక్కడ లేని ఊపొచ్చేస్తుంది. ఈ టెక్నిక్‌ని ఇంటి పనులు చేసేటప్పుడు అప్త్లె చేస్తే విసుగనిపించకుండా ఆడుతూ పాడుతూ పని ముగించేయచ్చు. మ్యూజిక్ వింటున్నప్పుడు అలసట తెలియదు కాబట్టి సునాయసంగా పనుల్ని పూర్తి చేసేస్తాం.
ఇల్లు ఊడవడం, తుడవడం లాంటి పనులు చేయడానికి చాలామంది శ్రద్ధ చూపరు. కానీ ఈ పనుల వల్ల భుజాల్లోని కండరాల్లో కదలికలు జరిగి.. అవి మరింత దృఢమవుతాయి. అలాగే వెన్నెముక కూడా నిటారుగా ఉంటుంది.
ఇంట్లో మనం చేసే చాలా పనులు నిల్చొని చేయాల్సి వస్తుంటుంది. దీనివల్ల 'కాళ్లు లాగేస్తున్నారు!' లేదంటే 'నడుం నొప్పి వస్తుంది' అని నీరసించిపోతుంటారు కొందరు. కానీ ఇలా నిలబడి, అటూ ఇటూ తిరుగుతూ పనులు చేయడం వల్ల కూడా శరీరానికి చక్కటి వ్యాయామం అందుతుందంటున్నారు నిపుణులు. తద్వారా కాళ్లు, నడుం భాగంలోని కండరాలు దృఢమవుతాయని చెబుతున్నారు.
ఇంట్లో చేసే పనుల్లో భాగంగా బరువులెత్తడం, వస్తువులను ఒకచోట నుంచి మరోచోటుకి మార్చడం.. వంటివి చేయడం సహజం. వీటి వల్ల కూడా శరీరానికి మంచి ఎక్సర్సైజ్ అందుతుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల వెన్నెముక దృఢంగా అవడంతో పాటు.. భవిష్యత్తులో మోకాళ్ల సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే నడవడం, వంగడం.. లాంటి పనుల వల్ల కూడా శరీరానికి చక్కటి వ్యాయామం అందుతుంది.
ఇంట్లో ఉండే షెల్ఫ్‌లు, వస్తువులు శుభ్రం చేసేటప్పుడు మన భుజాలను పైకి, కిందికి కదపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల భుజాల్లోని కండరాల్లో కదలికలు జరిగి అవి మరింత దృఢమవుతాయి.
బట్టలు ఉతికి, ఆరేసే క్రమంలో పొట్టలోని కండరాలకు మంచి వ్యాయామం అందుతుంది. అలాగే శరీరంలోని అనవసర క్యాలరీలు కూడా ఖర్చవుతాయి. కాబట్టి ఎప్పుడూ వాషింగ్ మెషీన్‌పై ఆధారపడకుండా.. అప్పుడప్పుడూ చేత్తో ఉతకడం అలవాటు చేసుకోండి.
బట్టలు ఇంట్లోనే ఇస్త్రీ చేసుకోవడం వల్ల భుజాలు, కాళ్ల పిక్కల్లోని కండరాలకు వ్యాయామం అందుతుంది.. అలాగే డబ్బూ ఆదా అవుతుంది. ఈ పనులన్నీ మీ కుటుంబ సభ్యులతో కూడా చేయించండీ. వారికీ వ్యాయమం చేసినట్టుగా ఉంటుంది.