Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్విందర్ ఎస్ సింగ్... ఆమె వయసు అప్పుడు కేవలం ఏడేండ్లు మాత్రమే. అయితే విభజన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు, దాని తర్వాత జరిగిన పరిణామాలు తనకు ఇంకా స్పష్టంగా గుర్తున్నాయి. భారతదేశం స్వాతంత్య్రం పొందిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత 1947 విభజన సమయంలో జరిగిన భయానక సంఘటనల వల్ల లక్షలాది మంది జీవితాలు కోల్పోయారు. నిర్వాసితులుగా మిగిలిపోయారు. అలాంటి వారిలో ఆమె కూడా ఒకరు.
ప్రస్తుతం ఎనభై రెండేండ్ల హర్విందర్ ఎస్ సింగ్ వయసు 1947లో కేవలం ఏడేండ్లు. అయితే విభజన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు, దాని తదనంతర పరిణామాలు తనకు ఇంకా స్పష్టంగా గుర్తున్నాయని చెప్పారు. ఢిల్లీలో శరణార్థిగా జీవితాన్ని ప్రారంభించిన జీవితాన్ని గుర్తుచేసుకున్నారు.
మంచి జీవితాన్ని గడిపాము
''నా నాన్న, తాత, మామ రావల్పిండి (పాకిస్తాన్) జిల్లాలోని గుజార్ ఖాన్‌లో భూస్వాములుగా ఉన్నారు. వారిని అందరూ ఎంతో గౌరవించేవారు. మాకు ఏ విషయంలోనూ కొరత లేదు. ఎన్నో ఆస్తులు ఉన్నాయి. మంచి జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళం. మాకు ఆయిల్, రంపపు మిల్లులు ఉన్నాయి. మా నాన్న కూడా న్యాయవాది. ప్రతి సంవత్సరం మేము వేసవిలో కచ్చితంగా శ్రీనగర్ వెళ్ళేవాళ్ళం. అలా ఆ సంవత్సరం కూడా వెళ్ళాము. అకస్మాత్తుగా విభజన ప్రకటన వెలువడింది. బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి స్వాతంత్య్రం లభించినందుకు మేము చాలా సంతోషించాము.
బొమ్మ కోసం ఏడ్చాను
కానీ ఈ ప్రకటనతో మేము ఆశ్చర్యపోయాము. హత్య చేయవలసిన వ్యక్తుల జాబితాలో మా కుటుంబం పేరు అగ్రస్థానంలో ఉంది. గుజార్ ఖాన్‌కు తిరిగి రావద్దని మా నాన్న జూనియర్లలో ఒకరి నుండి మాకు టెలిగ్రామ్ వచ్చింది. దాంతో మేము మరికొన్ని నెలలు శ్రీనగర్‌లో ఉండిపోయాము. ఒకరోజు ప్రజలు బారాముల్లాలోకి ప్రవేశించారని, మేము వెంటనే నగరం నుండి బయలుదేరాలని ప్రకటన వచ్చింది. ప్రతి ఒక్కరూ తమకు దొరికిన రవాణా పద్ధతిలో అక్కడి నుండి వెళ్లిపోయారు. జమ్మూకి కారులో ఉన్నదంతా తీసుకుని అర్ధరాత్రి బయలుదేరాము. అప్పటికి ఇక మేము గుజార్ ఖాన్ వద్దకు తిరిగి వెళ్లలేమని మాకు తెలుసు. మేము అన్నీ కోల్పోయాము. నేను శ్రీనగర్‌లో వదిలిపెట్టిన నా బొమ్మ కోసం ఏడవడం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. ఆ సమయంలో చాలా మందిని ఊచకోత కోశారని ఆ తర్వాత నాకు తెలిసింది. గుజార్ ఖాన్‌లో మా అమ్మ, మా మేనత్త కూడా కాల్చి చంపబడ్డారు.
ఢిల్లీలో శరణార్థి జీవితం
''జమ్మూ నుండి మేము ఢిల్లీకి ప్రత్యేక విమానంలో చేరుకున్నాము. విమానం గుజార్ ఖాన్ నుండి ఒక కుటుంబం కోసం వేచి ఉందని చేసిన ఒక ప్రకటన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఢిల్లీలో ఎక్కడికి వెళ్లాలో మాకు తెలీదు. మాకు తెలిసిన ఏకైక ప్రదేశం కరోల్ బాగ్. అది చాలా పెద్దది. మేము కారులో ఉన్నాము. కారులో ఉన్న మానాన్నను చూసి అరిచాము. మేము తిరిగి నాన్నఉ కలిశాము. మా తర్వాత నాన్న విమానంతో వచ్చాడు. కానీ ఢిల్లీకి ఎప్పుడు వచ్చాడో మాకు తెలీదు. మా వస్తువులలో కొన్నింటితో ఢిల్లీకి చేరుకున్నాము. మొదట్లో మేము మా అమ్మానాన్నల దగ్గరే ఉండేవాళ్లం. మా తాతగారు మా అందరినీ ఎలా తీసుకెళ్తాడో అని అందరూ కంగారు పడ్డారంట.
మా పరిస్థితి తెలుసుకొని
ఒకరోజు గాంధీజీ, నెహ్రూ ఉన్న సమావేశానికి మా నాన్న, తాతగారు వెళ్లారు. ఇక్కడకు ఎందుకు వచ్చారని నాన్నను అడిగారు. మా పరిస్థితి తెలుసుకుని పృథ్వీరాజ్ రోడ్డులో మాకోసం ఒక ఇల్లు కేటాయించారు. మేము అక్కడ కొంత కాలం ఉండిపోయాము. తర్వాత అక్కడి నుండి మేము బయటకు వెళ్లాము. మాకు హార్డింగ్ బ్రిడ్జ్‌లో టెంట్లు కేటాయించబడ్డాయి.
కాస్త కోలుకుంటే
కాలక్రమంలో మా నాన్న, తాత, మామయ్య గురుగ్రామ్‌లో ఆయిల్ మిల్లును ఏర్పాటు చేసి సా మిల్లును ఏర్పాటు చేశారు. మా అమ్మ, అమ్మమ్మల ఆభరణాలను దీని కోసం ఉపయోగించారని ఆ తర్వాత నాకు తెలిసింది. మా నాన్న న్యాయవాది కాబట్టి తన కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నేను పెద్దదాన్ని అయిత తర్వాత ఒక సంఘటన జరిగింది. మా ఆయిల్ మిల్లుకు మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయింది. శరణార్థులమని స్థానికులు పెద్దగా మా గురించి పట్టించుకోలేదు. మంటలను ఆర్పేందుకు వచ్చిన ట్యాంకర్‌కు సంబంధించిన నీటిని కూడా కట్ చేశారు.
విభజన జరగకపోతే...
నేను హిస్సార్ నుండి బీఎడ్, హోషియార్పూర్ నుండి ఎంఏ చేసి నా చదువును పూర్తి చేసాను. విభజన జరగకపోతే మా కుటుంబ పరిస్థితి మరోలా ఉండేది. అప్పటి నుండి నాకు ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాలలో ఒకటి అప్పటి వరకు మంచి మంచి బట్టలు వేసుకున్న అమ్మాయి అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత కనీసం వేసుకోవడానికి ఒక్కజత బట్టలు కూడా లేకపోతే ఆ పరిస్థితి ఎంతటి కష్టంతో కూడుకున్నది'' అంటూ ఆమె తన మాటలు ముగించారు.