Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలర్ఫుల్గా కనిపించే ఫాస్ట్‌ఫుడ్ అంటే చాలు... పిల్లలు ఎగిరిగంతేస్తారు. పిల్లలే కాదు పెద్దలకు కూడా అదే ఇష్టం. అయితే బయటి ఆహారం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని మనందరికీ తెలుసు. అందుకే కలర్ఫుల్గా ఉండే ఫాస్ట్‌ఫుడ్ మనింట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వాటిలో మంచూరియా ఒకటి. రకరకాల మంచూరియాను ఎంచక్కా ఇంట్లోనే చేసుకొని తినేద్దాం...
ఆలూతో
కావలసిన పదార్థాలు: ఆలూ - నాలుగు, ఉల్లిగడ్డ - రెండు, క్యాప్సికమ్ - రెండు, మొక్కజొన్నపిండి - అర కప్పు, మైదా - అర కప్పు, వంట సోడా - చిటికెడు, పచ్చిమిర్చి - నాలుగు లేదా ఆరు (ముక్కలుగా చేసుకోవాలి), ఉప్పు - రుచికి సరిపడా, కారం - టీస్పూను, నూనె - తగినంత.
తయారు చేయు విధానం: ముందుగా ఆలూను సన్నగా చిప్స్ లాగా తరుక్కుని వాటికి కొద్దిగా ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. మిగతా కూరగాయలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న బౌల్ తీసుకొని అందులో మైదా, మొక్కజొన్నపిండి, వంటసోడా వేసి అరకప్పు నీరు పోసి మృదువుగా కొద్దిగా గంటె జారుగా కలుపుకోవాలి. మరొక గిన్నెలో కొద్దిగా నీరు పోసి వేడి చేయాలి. అందులో కలుపుకున్న చైనీస్ మంచూరియాను సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కొద్దిగా గట్టిపడుతుండగానే స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి అందులో ఆలూ, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. దీనికి మంచూరియా కూడా కలిపి వేయించుకోవాలి. సర్వ్ చేసే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు అలంకరించి అందించాలి. ఇదే పద్ధతిలో పనీర్‌తో కూడా చేసుకోవచ్చు. ఆలూ ముక్కల స్థానంలో పనీర్ ముక్కలు కలుపుకోవాలి.
కాలీ ఫ్లవర్‌తో
కావలసిన పదార్థాలు: కాలీ ఫ్లవర్ - ఒకటి, మైదా - మూడు చెంచాలు, కార్న్ ఫ్లోర్ - తగినంత, నూనె - సరిపడా, అజీనామోటో - సరిపడా, ఉల్లికాడలు - కొన్ని, ఉప్పు - తగినంత, కారం - తగినంత, పసుపు - చిటికెడు, రెడ్ కలర్ - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట, టమోటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ - సరిపడగా తీసుకోవాలి,
తయారు చేసే విధానం: కాలీ ఫ్లవర్‌ను పువ్వుల్లా కట్ చెయ్యాలి. ఒక బౌల్ తీసుకుని మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, కలర్ కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నిలో నూనె వేడిచేసుకుని బాగా కాగాక కలిపిన మిశ్రమంలో కాలీ ఫ్లవర్‌ను ముంచి నూనెలో ఎర్రగా వేయించాలి. తర్వాత వేరే మూకుడులో నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. అందులో సోయా సాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, అజీనామోటో వేసి బాగా కలిపి ఉంచుకోవాలి తర్వాత వేయించిన కాలి ఫ్లవర్‌ను ఇందులో వెయ్యాలి. పైన కొత్తిమిరతో అలంకరించుకోవాలి. అంతే కాలి ఫ్లవర్ మంచూరియా రెడీ.
క్యారట్‌తో
కావలసిన పదార్థాలు: తురిమిన క్యారట్ - కప్పు, ఉప్పు - తగినంత, కారం - తగినంత, శనగపిండి - రెండు కప్పులు, కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, ఉల్లిగడ్డ తరుగు - టేబుల్‌స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను, సోయాసాస్ - టేబుల్‌స్పూను, నూనె - కొద్దిగా, టొమాటో సాస్ - టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - టీ స్పూను, వాము - చిటికెడు.
తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో తురిమిన క్యారట్, శనగపిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లిపేస్ట్, ఉప్ప, కారం, వాము కొద్దిగా నీళ్లు పోస ికలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె పోసి కాగాకా కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. మరొక స్టవ్‌పై గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి కాగాక ఉల్లిగడ్డ ముక్కలు వేయించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయాసాస్, టొమాటో సాస్ కూడా వేసి వేగాక మొత్తం గ్రేవీలాగా అవుతుంది. ఇప్పుడు అందులో వేయించి పెట్టుకున్న క్యారట్ మంచూరియాలను వేసి కలిపి బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి.
మీల్మేకర్తో
కావలసిన పదార్థాలు: మీల్మేకర్ - రెండు వందల గ్రాములు, ఉల్లిగడ్డ - వంద గ్రాములు, క్యారెట్ - వంద గ్రాములు, బఠాణీలు - వంద గ్రాములు, అల్లంవెల్లుల్లి - వంద గ్రాములు, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - పది, కార్న్ ఫ్లోర్ పౌడర్ - రెండు స్పూన్లు, అజినోమోటో - స్పూను, సోయాసాస్ నాలుగు స్పూన్లు, వెనిగర్ - నాలుగు స్పూన్లు, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా, మైదా - రెండు స్పూన్లు, రెడ్ కలర్ - స్పూను.
తయారు చేసే విధానం: ముందుగా మీల్‌మేకర్‌ను నీటిలో నానబెట్టుకుని పదినిమిషాల పాటు ఉడికించు కోవాలి. అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, బఠాణిలను కొద్దిగా ఉడికించుకోవాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్ పౌడర్, సోయాసాస్, అజినోమోటో, ఉప్పు, కలర్ వేసుకోవాలి. వెనిగర్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసి వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేయించుకోవాలి. మరొక పాత్రలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, వెల్లుల్లి వేసి వేగిన తర్వాత వేయించుకున్న మంచూరియాను వేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి. అంతే మీల్మేకర్ మంచూరియా రెడీ.