Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ విజయలక్ష్మి రమణన్... భారతదేశపు మొదటి మహిళా ఐఏఎఫ్ అధికారి. అప్పటి వరకు మగవారికే పరిమితమై మహిళలు లేని రంగంలో ఆమె అడుగుపెట్టారు. భారతదేశంలోని అనేక సైనిక ఆసుపత్రులలో తన సేవలు అందించిన ఆమె పరిచయం నేటి మానవిలో...
ఫిబ్రవరి 27, 1924న చెన్నైలో జన్మించారు రమణన్. 1943లో మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి పట్టభద్రురాలయ్యారు. ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలో ఎండీ పూర్తి చేసిన ఆమె 1955లో ఇండియన్ ఆర్మీలో చేరే ముందు సర్జన్‌గా ప్రాక్టీస్ చేశారు. తన వృత్తిలో ఆమె 1971లో రెండో స్థానంలో నిలిచారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) మొదటి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మొదట్లో భయపడ్డాను
మార్చి 2022 నాటికి ఐఏఎఫ్‌లో 1,640 మంది మహిళా అధికారులు ఉన్నారు. అప్పట్లో ఓ సందర్భంలో ఆమె తన పని గురించి మాట్లాడుతూ ''కొన్ని సంవత్సరాలుగా నేను వైమానిక దళంలో ఏకైక మహిళా అధికారిని. మొదట్లో మగవాళ్లతో కలిసి పనిచేయాలంటే భయపడ్డాను. కానీ ధైర్యంగా ఉన్నాను. దేన్నైనా ఎదుర్కోగలనని నాలో నేను అనుకున్నాను'' అన్నారు. రాజ్యసభ టీవీ (ఇప్పుడు సన్సద్ టీవీ)కి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇలా అన్నారు. ''నేను ఎమర్జెన్సీకి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. రాత్రికి రాత్రి చనిపోయినప్పటికీ నాకు ఎలాంటి పట్టింపూ లేదు. నాకు కాల్ వచ్చిన క్షణం, నన్ను పికప్ చేయడానికి పంపిన అంబులెన్స్ కోసం నేను వేచి ఉంటాను'' అంటున్నారు.
మార్పులు చేయాల్సి వచ్చింది
డాక్టర్ విజయలక్ష్మి రమణన్ భారత ఆర్మ్డ్ ఫోర్స్‌లో చేరారు. ఆమె భర్తతో పాటు ఐఏఎప్లో ఒక అధికారి కూడా ఆమెను దరఖాస్తు చేయమని కోరింది. మహిళా అధికారులు లేనందున వైమానిక దళం మహిళలకు యూనిఫారంతో సహా కొన్ని విషయాల్లో వెంటనే మార్పులు చేయాల్సి వచ్చింది. విజయలక్ష్మి ''ఎయిర్ ఫోర్స్ బ్లూస్'', టాన్ బ్లౌజ్‌తో తయారు చేసిన కస్టమ్ మేడ్ చీరను రూపొందించారు. ఆమె కోసం చేసిన ఈ తాత్కాలిక ఏర్పాటు మహిళలకు ప్రామాణిక ఎయిర్ ఫోర్స్ యూనిఫారంగా మారింది.
మేజర్ ర్యాంక్ పొందాను
మరొక ఇంటర్వ్యూలో యూనిఫాం గురించి మాట్లాడుతూ ''నాది ఒక విచిత్రమైన కేసు. నేను ఐఏఎఫ్‌లో చేరాను. మేజర్ ర్యాంక్ పొందాను. ఆర్మీ, నేవీలోని ఇతర మహిళా అధికారులు ప్యాంటు ధరించారు. నేను చీర కట్టుకున్నాను. కానీ స్లీవ్ సమస్యగా ఉంది. ఫుల్ స్లీవ్స్‌తో మెడికల్ ఆఫీసర్‌గా పని చేయలేకపోయాను. నా ప్రధాన కార్యాలయంతో అనేక కరస్పాండెన్స్‌ల తర్వాత బ్లౌజ్‌కు 3/4వ స్లీవ్‌లు ఉండాలని నిర్ణయించారు. అది కూడా అసౌకర్యంగా ఉండేది. ముఖ్యంగా డెలివరీలు చేయవల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది. అందుకే నేను మగవాళ్ళలా నా స్లీవ్లను చుట్టుకొని పని చేస్తానని చెప్పాను'' అన్నారు.
విశిస్ట్ సేవా పతకం
భారతదేశ సైనిక ఆసుపత్రులలో స్త్రీ జననేంద్రియ నిపుణురాలిగా పని చేయడంతో పాటు రమణన్ 1962, 1966, 1971 యుద్ధాల సమయంలో అధికారులకు వైద్య సంరక్షణను కూడా అందించారు. ఆమె సైనికాధికారులను కుటుంబ నియంత్రణ చేయించుకునేలా ప్రోత్సహించారు. జలహళ్లి, కాన్పూర్, సికింద్రాబాద్, బెంగళూరులోని సాయుధ దళాల ఆసుపత్రులలో కూడా పనిచేశారు. ఈ సమయంలో ఆమె నర్సులకు ప్రసూతి, గైనకాలజీని కూడా నేర్పించారు. తన సేవలకు గాను రమణన్ విశిస్ట్ సేవా పతకాన్ని అందుకున్నారు. ఈ గౌరవం భారతీయ సాయుధ సిబ్బందికి ఉన్నత ఆర్డర్ యొక్క విశిష్ట సేవ కోసం అందించబడింది. ఈ అవార్డు ఆమె పనిని గుర్తించింది.
రోగులకు ఉచిత వైద్యం
భారత సాయుధ దళాల మహిళలు, పిల్లలకు కూడా ఆమె చికిత్స చేశారు. విద్యార్థిగా ఆమె మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మెడిసిన్ చేస్తున్నపుడు ఆమె బాల్ఫోర్ మెమోరియల్ మెడల్, శస్త్రచికిత్సకు బహుమతిని అందుకున్నారు. ఆమె 1979లో పదవీ విరమణ చేసిన తర్వాత ఒక క్లినిక్‌ని స్థాపించారు. అక్కడ రోగులను ఉచిత వైద్యం అందించేవారు. ఆమె కర్ణాటక సంగీతంలో కూడా శిక్షణ పొందారు. తన 15 సంవత్సరాల వయసులో ఆమె ఆల్ ఇండియా రేడియోలో కళాకారిణిగా పనిచేశారు. రమణన్ అక్టోబర్ 18, 2020న బెంగళూరులోని జయనగర్‌లోని తన కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు.