Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం ఈ మధ్య ఇంట్లో వాడుకునే వాటిలో డిస్పోజబుల్ కప్పులు, గ్లాసులు వచ్చి చేరాయి. వాటిలో కొన్ని పేపర్ కప్పులు, కొన్ని ప్లాస్టిక్ కప్పులు ఉంటున్నాయి. పేపరు కప్పులు, గ్లాసులతో ఎలా బొమ్మలు చేసుకోవచ్చో చూద్దాం. అయితే ఈ పేపర్ కప్పులు కానీ గ్లాసులు కానీ వాడేశాక పనికిరావు. ఇవి ప్లాస్టిక్ డిస్పోజబుల్స్ వలె వాడాక కడిగి ఉపయోగించుకోవటం వీలు కాదు. కాబట్టి వీటిని వాడక ముందే బొమ్మలు చేసుకోవాలి. చిన్న కప్పులతో కొన్ని రకాల బొమ్మలు చేయవచ్చు. పెద్ద వాటితో కొన్ని రకాల బొమ్మలు చేయవచ్చు. మొదటగా చిన్న కాఫీ కప్పులతో ఎలా చేయాలో చూద్దామా...
పూలబుట్ట
ఒక చిన్న కాఫీ కప్పును తీసుకుని చివరిలో ఉన్న ముడిలాంటి దాన్ని కత్తిరించి వేయాలి. ఇది తర్వాత పనికొస్తుంది పారేయకండి. కత్తిరించిన చీలికలను క్రాస్‌గా ఒకదానిలో ఒకటి గుచ్చుతూ రావాలి. మా చిన్నతనంలో ఈ అల్లకం ఖాళీ సిగరేట్ పెట్టెలతో చేసేవాళ్ళం. ఏనుగు, కుక్కపిల్ల వంటివి అల్లి ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. ఇలా క్రాస్‌గా ముక్కలు దూర్చాక ఒక బుట్టలా వస్తుంది. దీనికి పూలబుట్ట కాడవలె ఇంతకు ముందు పక్కన పెట్టుకున్న ముక్కను అమర్చాలి. చిన్ని పూలబుట్ట తయారైంది కదా!
బెడ్‌ల్యాంప్
దీనికి పది, పన్నెండు చిన్న కాఫీ కప్పులు కావాలి. కాఫీ కప్పులకు ఎరుపు రంగును పెయింట్ చేయాలి. మధ్యలో ఒక కప్పును పెట్టి చుట్టూ ఆరుకప్పుల్ని పెట్టి అతికించాలి. ఇది ఒక గుండ్రని లైటులాగా కనిపిస్తుంది. ఈ కప్పుల మధ్యలో చిన్న చిన్న బల్బుల లాంటివి అతికిస్తే ఇంకా బాగుంటుంది. రెండు కప్పుల్ని తీసుకొని ఒకదానికొకటి బోర్లా వేసి అతికించాలి. దీనికి మరో కప్పును అతికిస్తే సరిపోతుంది. దీనికి ఇంతకుముందు తయారు చేసిన లైట్ లాంటి కప్పులను అతికిస్తే బెడ్‌ల్యాంప్ తయారయినట్టే.
వర్క్ టేబుల్ ఆర్గనైజర్
దీనికి రెండు పెద్ద సైజు కప్పులు, రెండు చిన్న కప్పులు కావాలి. ఒక కార్డు బోర్డును తీసుకుని దానికి ఎరుపు రంగును వేయాలి. రెండు పెద్ద కప్పులకు ఆకుపచ్చ రంగును వెయ్యాలి. రెండు పెద్ద కప్పులకు రెండు రెండు రంధ్రాలు పెట్టాలి. రెండూ ఒక దానికెదురుగా ఒక దానిని పెట్టినపుడు ఎదురెదురుగా వచ్చేలా రంధ్రాలు పెట్టాలి. రెండు వెదురు పుల్లలు తీసుకొని ఈ రంధ్రాల లోనికి దూర్చాలి. వెదురు పుల్లలు దొరకకపోతే విరిగిన పెయింటింగ్ బ్రష్‌లు, అయిపోయిన బాల్‌పెన్ రీఫిల్స్ వాడవచ్చు. వీటికి రంగులు వేసుకుంటే బాగుంటుంది. దొక పాత వస్త్రాన్ని తీసుకుని పుల్లల కిందుగా దూర్చి అతికించాలి. అంటే ఆ రెండు పుల్లలకు ఉయ్యాలలా అమర్చాలి. ఇప్పుడు మరో రెండు చిన్న కప్పులను తీసుకొని రంగులు వేసి పెట్టుకోవాలి. ఈ రెండు కప్పుల్ని కూడా కార్డుబోర్డుకు అతికించాలి. కాగితంతో తయారైన పూలను తీసుకుని ఈ కప్పులకు అతికించాలి. కప్పులు అతికించిన భాగం కాకుండా మిగిలిన భాగమంతా తడ్డి ఉన్నట్టుగా కాగితాలను అతికించాలి. ఇందులో పెన్నులు, పెన్సిళ్ళు, స్కెచ్‌లు పెట్టుకోవచ్చు. మధ్యలో ఉయ్యాల లాంటి దానిలో ఫోను పెట్టుకోవచ్చు.
డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్
ఒక కార్డుబోర్డును తీసుకొని గుండ్రంగా కత్తిరించాలి. దీనిమీద ఇంట్లో ఉన్న పాత వస్త్రాన్ని కత్తిరించి అతికించాలి. ఈ అట్టను పక్కన పెట్టుకుని ఆరు కాఫీ కప్పులను తీసుకోవాలి. ఒక్కొక్క కాఫీ కప్పుకు ఒక్కో రంగు ఊలు దారాన్ని చుట్టాలి. ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ వంటి రంగుల ఊలు దారాలతో అల్లి పెట్టుకుంటే కప్పులు అందంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కప్పుల్ని గుండ్రటి అట్టమీద అతికించడం మొదలుపెట్టాలి. గుండ్రటి అట్టమీద గుండ్రంగా వరుసగా కప్పుల్ని అతికిస్తే చూడ ముచ్చటగా ఉంటుంది. ఇవి ఆర్గనైజర్లాగా పనికొస్తాయి. ఒక్కో కప్పులో ఒక్కో వెరైటీ వేసుకుంటే వెతుక్కునే పని ఉండదు. ఎక్కువగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉపయోగపడుతుంది. తల పిన్నులు, పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు వంటివి వేసుకుంటే పిల్లలు స్కూళ్ళకు, పెద్ద వాళ్ళు ఆఫీసుకు వెళ్ళే పనిలో హడావిడిగా కంగారు పడాల్సిన పనివుండదు.
వాల్ హ్యాంగింగ్
ఒక గట్టి అట్టను గానీ కార్డ్బోర్డును గానీ తీసుకోవాలి. దీనికి మంచి రంగును కానీ గోల్డ్ రంగును కానీ పెయింట్ చేయాలి. లేదంటే మంచి డిజైన్ ఉన్న బట్టను కత్తిరించి అట్టకు అతికించాలి. దీని వెనకవైపు గోడకు వేలాడదీసుకునేలా గట్టి దారాన్ని అతికించాలి. ఇప్పుడు రెండు పెద్ద కాఫీ కప్పులను తీసుకొని వాటిమీద రంగు వేయాలి. ఇప్పుడు దీనిని నిలువుగా సగానికి కత్తిరించాలి. అంటే రెండు కప్పులు నాలుగు అర్థభాగాలుగా అయినాయి. ఇప్పుడు వీటిని కార్డ్‌బోర్డుపై నిలువుగా అతికించాలి. అంటే అవి చిన్న చిన్న పాట్ ల్లాగా ఉంటాయన్నమాట. ఈ కప్పుల్లో చిన్న పూల కొమ్మల్లాంటివి పెడితే అందంగా ఉంటుంది.
పువ్వులు
ఒక్కొక్క పువ్వుకు మూడు కప్పులు కావాలి. ఒక కప్పును తీసుకుని పైనున్న గట్టి భాగం తీసేయాలి. నిలువుగా చీలికలుగా కత్తిరించుకోవాలి. నిలువు చీలికలు చివరన గుండ్రంగా వచ్చేలా కత్తిరించుకోవాలి. రెండో కప్పును తీసుకుని దానినీ ఇలాగే నిలువు చీలికలుగా కత్తిరించాలి. నిలువుగా కత్తిరించాక మొదటి కప్పు కన్నా పొడవు తగ్గించుకోవాలి. చీలికల చివర్లు గుండ్రం చేసుకోవాలి. ఇప్పుడు మూడో కప్పును తీసుకొని నిలువుగా చీలికలు కత్తిరించాలి. అయితే దీని చీలికల పొడవు రెండవ కప్పు కన్నా చిన్నవిగా ఉండాలి. ఇలా మూడు కప్పులు కత్తిరించిన తర్వాత గులాబి రంగు పెయింట్ వేయాలి. ఒక రోజంతా ఆరబెట్టిన తర్వాత మొదటి పొడుగు చీలికలున్న కప్పులో రెండవ కప్పు పెట్టి అతికించాలి. మూడో కప్పును రెండో కప్పులో పెట్టి అతికించాలి. మూడు కప్పులు వరసగా పెట్టి అతికించాక పసుపు రంగు గ్లిట్టర్ షీటును గుండ్రంగా కత్తిరించి కప్పుల మధ్యలో ఫిక్స్ చేయాలి. ఇప్పుడు తామర పువ్వులా తయారయింది. దీనికి ఒక కాడను పెట్టాలి. దాని కోసం ఆకుపచ్చ రంగు కాగితాన్ని పెన్ను సహాయంతో గుండ్రంగా చుట్టి పువ్వుకు కాడను అమర్చాలి. ఇలా నాలుగైదు పువ్వులు చేసుకుని ఫ్లవర్‌వాజ్‌లో పెట్టుకోవచ్చు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్