Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కారణంగా ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఉద్యోగులకు దొరికింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మంచి మాత్రమే కాదు చెడు కూడా జరిగింది. ఈ సమయంలో బెడ్‌పై పడుకొని వర్క్ చేయడం లేదా బాగా ముందుకు వంగి కూర్చోవడానికి అలవాటు పడ్డారు ఉద్యోగులు. అయితే వీటివల్ల శరీర భంగిమ లేదా బాడీ పోశ్చర్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అలాగే ఉద్యోగుల్లో వెన్నునొప్పి వస్తోంది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలామంది మళ్లీ ఆఫీసులకు వెళ్తున్నారు. వీరిలో ఎక్కువమంది వెన్నునొప్పి, బాడీ పోశ్చర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు ఆర్థోపెడిక్ వైద్యులు, ఫిజియోథెరపిస్ట్‌లు వెల్లడిస్తున్నారు. అందుకు కారణం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో అలవర్చుకున్న అలవాట్లను ఆఫీసులో కూడా కొనసాగించడమేనని చెబుతున్నారు. స్లిప్ డిస్క్ అనే తీవ్రమైన వెన్నునొప్పి సమస్య బారిన కూడా పడి ఆర్థోపెడిక్ ఆసుపత్రులు, ఫిజియోథెరపిస్ట్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వెన్నునొప్పి చికిత్సలకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక మహిళా ఉద్యోగులపై లాక్డౌన్ మరింత ప్రభావం చూపింది.
ఈ సమయంలో సహాయకులు రాకపోవడంతో ఇంటి పనులను మహిళలే చేసుకోవాల్సి వచ్చింది. అలా ఉద్యోగం చేసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం వల్ల శరీరంపై ఎక్కువ ఎఫెక్ట్ పడి ఇంతకుముందు ఉన్న చిన్న సమస్యలు కూడా ఇప్పుడు మరింత తీవ్ర సమస్యగా మారాయి.
గతంలో వెన్ను నొప్పి కాస్త ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత ఇది మరింత పెరిగిందని ఉద్యోగినులు డాక్టర్లకు చెప్తున్నారు. డాక్టర్ల సలహాల మేరకు ఫిజియోథెరపీ సెషన్స్‌కు హాజరవుతుండటంతో పాటు మెడిసిన్స్ తీసుకుంటున్నారు.
లాక్డౌన్ల సమయంలో చాలా మంది ఉద్యోగులు బ్యాడ్ సిట్టింగ్‌కు అలవాటు పడ్డారు. మంచిగా కూర్చునే అలవాటు పూర్తిగా మర్చిపోయారు. ఆఫీసులలో కూడా ఇలాగే కూర్చుంటున్నారు. దీనివల్ల వారిలో నడుము, వెన్ను, మెడ, భుజాల నొప్పులు తలెత్తుతున్నాయి.
చాలా మంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ప్రారంభించారు, కానీ ఆఫీసులు తిరిగి ఓపెన్ చేయడం, పని ఒత్తిడి పెరగడం వల్ల ఎవరూ కూడా వ్యాయామం చేయలేకపోతున్నారు. నిజానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు పని గంటలు పెరగడం, సరైన సమయంలో విరామాలు లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా వారిపై నెగిటివ్ ఎఫెక్ట్ పడింది. విటమిన్ డి లోపం కూడా ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేసింది.
లాక్డౌన్ సమయంలో అవకాశం ఉన్నవారు కొందరు తెలివిగా ఇంట్లోనే ఆఫీస్ వాతావరణం ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి వారిలో మెడ నొప్పి వెన్ను నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా రాలేదు కానీ మిగతా వారిలో మాత్రం ఆరోగ్య సమస్యలు అధికంగానే కనిపిస్తున్నాయి. ముందుకు వంగి పని చేయడం అనేక సమస్యలకు దారితీస్తుందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.
సరైన సిట్‌డౌన్ సమయం 30-45 నిమిషాల మధ్య ఉంటుందని కానీ ఈ రోజుల్లో ప్రజలు టీవీ షోను పూర్తి చేయడానికి గంటల తరబడి కూర్చుంటున్నారని, దీని వల్ల దీర్ఘకాలిక సమస్యలు తప్పవని అంటున్నారు. డాక్టర్ల ప్రకారం రోగులలో 60శాతం మంది 30-47 ఏండ్ల మధ్య వయస్కులున్నారు. వీరికి నయం కావడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు అంటున్నారు.