Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్తింపు కోసం పోటీపడే ఈ ప్రపంచంలో కొందరు మాత్రం ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. వారు తమ కోసం కాదు తమ చుట్టూ ఉన్న ప్రపంచం కోసం తపిస్తారు. పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో బ్రిటీష్ వారి వేదన నుండి మనం మెల్లగా బయటపడుతున్న కాలమది. అప్పట్లో బ్రిటీష్ ఇండియా రాజధాని కలకత్తా. అత్యంత అభివృద్ధి చెందిన ఆ ప్రాంతం పునరుజ్జీవనంతో అలంకరించబడింది. ఆ యుగంలోనే ఒక యువ కవి పుట్టుకొచ్చింది. ఆమే టోరులతా దత్. రచయిత్రిగా, కవయిత్రిగా, అనువాదకురాలిగా, భాషావేత్తగా, వ్యాసకర్తగా, బహుభాషావేత్తగా, ఆంగ్లో-ఇండియన్ సాహిత్యంలో అత్యంత కీలకమైన వ్యవస్థాపక వ్యక్తిగా గుర్తింపుపొందారు. అత్యంత చిన్న వయసులోనే సాహిత్యంలో తనదైన ముద్ర వేసి కనుమరుగైపోయిన ఆమె పరిచయం నేటి మానవిలో...
టోరు దత్ 1856 మార్చి 4న కలకత్తాలో జన్మించారు. తండ్రి గోవింద్ దత్, తల్లి రాంబగన్ దత్. కలకత్తాలో క్రిస్టియన్ మిషనరీలకు ప్రభావితం చెందిన మొదటి కుటుంబం వీరిదే. వీరంతా పాశ్చాత్య జీవన విధానం, సాహిత్య అభిరుచులకు ప్రసిద్ధి చెందినవారు. టోరు ఆమె తోబుట్టువులు సాహిత్య వాతావరణంలో పెరిగారు. ప్రైవేట్ ఆంగ్ల ఉపాధ్యాయులచే ఇంటిలోనే వీరి చదువుకునేవారు. టోరు ఆరేండ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం క్రైస్తవ మతంలోకి మారింది. ఆమె తల్లి మొదట మతమార్పిడిని వ్యతిరేకించినప్పటికీ క్రమంగా దానిని అంగీకరించింది. ఆమె తన పిల్లలకు నిద్రపోయేటపుడు హిందూ ఇతిహాసాలు, క్రైస్తవ పురాణాలకు సంబంధించిన కథలను చెబుతుండేది.
అన్న మరణంతో...
టోరు అన్నయ్య అబ్జు 14 ఏండ్ల వయసులో క్షయవ్యాధితో మరణిస్తాడు. దాంతో టోరు కుటుంబంలో విషాదం నెలకొంది. తీవ్ర నిరాశతో ఆ కుటుంబం యూరప్‌కు తరలివెళ్లింది. సముద్ర మార్గం ద్వారా యూరప్‌కు ప్రయాణించిన మొదటి బెంగాలీ అమ్మాయిలలో టోరు, ఆమె సోదరి ఒకరు. కుటుంబం మూడు సంవత్సరాలు ఇంగ్లాండ్‌లో, ఒక సంవత్సరం ఫ్రాన్స్‌లో గడిపింది. అక్కడ టోరు బోర్డింగ్ పాఠశాలలో చదువుకున్నారు. దాని వల్లనే ఆమె ఫ్రెంచ్ భాషలో రచనలు చేయగలిగారు. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు అక్కచెల్లెళ్లు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ''లెక్చర్ ఫర్ ఉమెన్'కు హాజరయ్యారు.
సవాలుగా మారింది
1873లో 17 సంవత్సరాల వయసు గల టోరు కలకత్తాకు తిరిగి వచ్చారు. దాంతో ఆమె, తన అక్కను, సాహిత్యానికి, అక్కడి స్నేహితులకు దూరమయ్యాననే దుఃఖాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పాత, సంప్రదాయవాద, నిర్బంధ భారతీయ సమాజం ఆమెకు మరింత సవాలుగా మారింది. యూరప్‌లో ఉన్న తన స్నేహితుడికి ఆమె రాసిన ఒక లేఖలో ''మేము యూరప్‌ను విడిచిపెట్టినప్పటి నుండి నేను ఒక్క డిన్నర్ పార్టీకి లేదా ఏ పార్టీకి వెళ్ళలేదు. నా అమ్మమ్మ స్నేహితురాలు ఎవరైనా నన్ను చూస్తే అడిగే మొదటిది ప్రశ్న ఏమిటంటే నీకు పెండ్లి అయిందా'' అని రాసింది. అలాగే తన స్నేహితురాలు మేరీ మార్టిన్‌కు రాసిన ఇతర లేఖలలో ఆమె భారతదేశం తన ఇల్లు అని తెలుసుకోవడంతో పాటు దేశభక్తి గురించి ఎంతో మాట్లాడింది. ఆమె తన ఆరోగ్యం క్షీణించడం గురించి కూడా ఓ లేఖలో రాసుకుంది. అంటే యువ టోరుకు ఆమె మరణించబోతుందని కూడా తెలుసు.
మరణానికి ముందు
ఆమె చివరి తోబుట్టువులిద్దరిలాగే టోరు కూడా క్షయవ్యాధితో ఆగష్టు 30, 1877న మరణించింది. ఆమె కేవలం 21 సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికీ బెంగాలీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతంలో చాలా ప్రావీణ్యం సంపాదించారు. ఎన్నో పుస్తకాలను అందంగా అనువదించారు. తన మరణానికి ముందు సంవత్సరంలో ఆమె తన కవితా సంపుటిని ప్రచురించారు. అందులో ఎ షీఫ్ గ్లీన్డ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్-ఫ్రెంచ్ నుండి ఆంగ్లంలోకి అనువదించబడిన 165 కవితలు ఉన్నాయి. అయితే ఆ పుస్తకం అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. కానీ అది చూడటానికి టోరు జీవించి లేరు.
మొట్టమొదటి ఫ్రెంచ్ నవల
Le Journal de Mademoiselle d'Arvers అనే నవల పూర్తిగా ఫ్రెంచ్‌లో రాయబడింది. ఒక భారతీయ రచయిత రాసిన మొట్టమొదటి ఫ్రెంచ్ నవలగా ఇది నిలిచింది. టోరు మరణించిన తర్వాత ఆమె తండ్రి ఏన్షియంట్ బల్లాడ్స్, లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్‌తో సహా ఆమె రెండు రచనలను ప్రచురించారు. ఇందులో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించబడిన పద్యాలు, సాహిత్యం ఉన్నాయి. దత్ ది బెంగాల్ మ్యాగజైన్లో ఫ్రెంచ్ కవిత్వం, సాహిత్య వ్యాసాల అనువాదాలను కూడా ప్రచురించాడు. ఒంటరితనం, వాంఛ, దేశభక్తి, వ్యామోహం వంటి ఇతివృత్తాల చుట్టూ తిరిగే ఆమె రచనలకు జోడించడానికి ఆమె 1921లో లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ టోరు దత్ అనే పేరుతో అనేక లేఖలు కూడా రాశారు. ఈ విధంగా టోరు దత్ భారతీయ ఆంగ్ల రచనలో గొప్ప ఇతిహాసాలకు మార్గం సుగమం చేసిన మార్పు మేకర్, స్త్రీవాది. ఫ్రెంచ్, సంస్కృతంలో ఆమె రచనలు అత్యంత ప్రసిద్ధి చెందాయి.