Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోజనం చేసిన తర్వాత కొంత మంది కాసేపు నడుంవాలుస్తారు (భుక్తాయాసం). కానీ ఇది అంత మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బదులుగా నాలుగడుగులు అలా వేస్తే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రకుపక్రమించడం లేదా మొబైల్ ఫోన్లతో కుస్తీ పడితే ఆనక.. వచ్చే జబ్బులతో ఆసుపత్రుల చుట్టూ తిరగవల్సి వస్తుంది. ఫిట్‌గా ఉండాలంటే, ప్రతిరోజూ అందుకు కాస్తింత సమయం కేటాయించాలి. రోజంతా సమయం లేకపోయినా, కనీసం రాత్రి భోజనం తర్వాత అయినా 10 నిమిషాలపాటు టైం కేటాయించాలి. శారీరకంగా చురుకుగా ఉండాలంటే రాత్రి భోజనం తర్వాత వాకింగ్‌కు వెళ్లగలిగితే ఎన్నో శారీరక సమస్యలు దూరమవుతాయి. రాత్రి భోజనం తర్వాత నడిస్తే శరీరం గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇతర కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. నిజానికి, ఆహారం తిన్న 30 నిముషాలకే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ప్రారంభమవుతుంది. ఐతే నడవడం ద్వారా గ్లూకోజ్‌ను శరీరం ఉపయోగించుకుంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. మెటబాలిజం మెరుగుపరచడానికి సులభమైన మార్గాల్లో డిన్నర్ తర్వాత వాకింగ్ చేయడం ముఖ్యమైనది. నిద్ర సమయానికి ఎక్కువ కేలరీలను శరీరం వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేయడం చాలా అవసరం.
మాయో క్లినిక్ అధ్యయనాల ప్రకారం.. నడక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో ఎండార్ఫిన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగించి, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.