Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలకు ఆరోగ్యం పట్ల.. తినే ఆహారం పట్ల శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా కరోనా అనంతరం రోగనిరోధక శక్తిపై దృష్టి పెట్టడమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా రుచికరంగా పోషకాలు ఉండే ఆహారం తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అటుకుల్లో కూడా ఎన్నో పోషక విలువలు వీటిలో గ్లూకోజ్ గాని, కొవ్వు పదార్దాలు కాని ఉండవు. పిండిపదార్థాలు, ఖనిజాలూ, విటమిన్లూ, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అటుకులలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతాయి. దీంతో ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఇనుము అధికంగా ఉటుంది. గర్భిణీలు ఐరన్ లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి అటుకులను ప్రతి రోజూ కొంచెం మోతాదులో తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలున్న అటుకులతో చేసే కొన్ని వంటకాలు ఈరోజు మీకోసం...
అటుకుల దోస
కావలసిన పదార్థాలు: అటుకులు - అర కిలో, మజ్జిగ - ఒక కప్పు, బియ్యం - అర కిలో, పచ్చిమిర్చి - పది గ్రా, జీలకర్ర - రెండు చెంచాలు, తినే సోడా - చిటికెడు, నూనె - పావు కిలో, ఇంగువ - తగినంత, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా మజ్జిగని ఒక గిన్నెలోకి తీసుకుని కడిగిన అటుకుల్ని అందులో నానపెట్టాలి. బియ్యం నీళ్ళలో నానేయాలి. బియ్యం బాగా నానిన తర్వాత అటుకులు, బియ్యం కలిపి మెత్తగా రుబ్బుకొని, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, తినేసోడా వేసి బాగా కలపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఈ పిండితో దోసె పోసుకుని పైన నూనె వేసి రెండువైపులా కాల్చుకోవాలి.
అటుకుల లడ్డు
కావలసిన పదార్ధాలు: అటుకులు - కప్పు, పుటానా - పావు కప్పు, కొబ్బరి కోరు - పావు కప్పు, ఖర్జూరాలు - రెండు లేదా నాలుగు, గసగసాలు - రెండు నుండి నాలుగు చెంచాలు, బెల్లం - అరకేజీ, ఇలాచీపొడి - పావు చెంచాలు, నెయ్యి - తగినంత.
తయారు చేసే విధానం: అటుకులు పొడి మూకుడులో వేయించుకోవాలి. అవితీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మూకుడులో నెయి వేసి గసగసాలు, కొబ్బరి వేయించుకోవాలి. అవీ మిక్సీలో వేసుకుని బరకగా పట్టి, పుటానాకూడా వేసి బెల్లం, ఇలాచీ పొడి వేసి.. మరోసారి మిక్సీ లో తిప్పుకోవాలి.. అన్నీకలిపి బౌల్లోకి తీసుకుని ఖర్జూరం ముక్కలు వేసి వేడి నేయి వేసి బాగా కలిపి లడ్డులు చుట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి.
అటుకుల పాయసం
కావలసిన పదార్థాలు: అటుకులు - ఒక కప్పు, పాలు - రెండున్నర కప్పులు, బెల్లం తురుము - అరకప్పు, జీడిపప్పు - గుప్పెడు, కొబ్బరి తురుము - రెండు టీ స్పూన్లు, యాలకుల పొడి - అర టీ స్పూను, నెయ్యి - రెండు టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: అటుకులను ఓ నిమిషం పాటూ మంచి నీళ్లలో నాననివ్వాలి. తర్వాత నీళ్లు ఒంపేసి పక్కన పెట్టాలి. అటుకుల్లో కూడా నీరు ఎక్కువ శాతం లేకుండా పిండేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి పోసి జీడి పప్పు వేయించాలి. తర్వాత కొబ్బరి తురుము వేసి వేయించాలి. వేగాక పాలు పోసి బాగా మరిగించాలి. మరుగుతున్నప్పుడే బెల్లం తురుము వేసి ఉడికించాలి. బెల్లం బాగా కరిగిపోయేలా చూడాలి. బెల్లం పూర్తిగా కరిగాక అటుకుల్ని వేసి బాగా కలిపి ఉడికించాలి. చివరగా యాలకుల పొడి చల్లాలి. ఓ నిమిషం తర్వాత స్టవ్ కట్టేయాలి. అంతే అటుకుల పాయసం రెడీ.
అటుకుల ఇడ్లీ
కావాల్సిన పదార్ధాలు: బియ్యపురవ్వ - ఒకటిన్నర కప్పు, అటుకులు - ఒక కప్పు, పులిసిన పెరుగు - ఒక కప్పు, బేకింగ్ సోడా - చిటికెడు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా అటుకుల్ని పుల్లని పెరుగులో వేసి నానబెట్టాలి. అవి బాగా నానాక మెత్తగా చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో బియ్యపు రవ్వని వేయాలి. ఓ పదినిమిషాలు అలా వదిలేయాలి. రవ్వ మిశ్రమంలో ఉన్న నీటిని పీల్చేసుకుని గట్టి పడుతుంది. అప్పుడు కాస్త నీళ్లు పోసి, కాస్త ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఇడ్లీప్లేటులో వేసు కోవాలి. కాస్త నూనె లేదా నెయ్యి రాసుకుంటే ఇడ్లీలు అడుగంటకుండా వస్తాయి. ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి పదిహేను నిమిషాల పాటూ ఉడికించి దించేయాలి. దించే ముందు వేలితో నొక్కి ఇడ్లీలు ఉడికాయో లేదో చూడాలి. ఇడ్లీలు స్పాంజిలా మృదువుగా వస్తాయి. కొబ్బరి చట్నీతో వీటిని తింటే భలే టేస్టీగా ఉంటుంది.