Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది 2022... ఆగస్టు 15... ఒకపక్క 75వ స్వాతంత్య్ర వేడుకలు సందర్భంగా దేశ ప్రధాని మహిళా శక్తి గురించి ఎర్రకోటపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. మరో పక్క ఆరేండ్ల పాటు మిల్కిస్ బానో చేసిన పోరాటం నీరుగారి పోయింది. ఆమె గుండె బద్దలయింది. ఆమెపై అత్యంత దారుణంగా సమూహిక లైంగిక దాడికి పాల్పడిన 11 మంది ముష్కరులు జైలు గోడలు దాటి స్వేచ్ఛగా బయటకు వచ్చారు. పూలదండలతో ఘనస్వాగతం అందుకున్నారు. ఆ నాటి దుర్ఘటన నుండి కాస్త కొలుకొని ఇప్పుడిప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్న ఆమెకు మళ్ళీ భయం మొదలయింది. బయటకు వదిలిన ఆ ముష్కరులను తిరిగి జైలుగు పంపాలని డిమాండ్ చేస్తున్న ఆమెకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే ఆగస్టు 27వ తేదీన మహిళా సంఘాల ఐక్యకార్యాచరణ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త పోరాటం జరగబోతోంది.
మార్చి3, 2002న జరిగిన గోద్రా అల్లర్ల గురించి మనందరికి తెలుసు. ఆనాటి ఆ ఘోర కలి ఇప్పటికీ మన కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. 2002 ఫిబ్రవరిలో గుజరాత్ నుంచి వందల మంది కరసేవకులు విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు వెళ్లారు. ఫిబ్రవరి 25న కరసేవకులు అహ్మదాబాద్‌కు వచ్చే సబర్మతీ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఫిబ్రవరి 27న గోద్రాలో రైలు ఆగినప్పుడు కొందరు రైలు మీద దాడి చేశాయి. రాళ్లు విసరడంతోపాటు కొన్ని బోగీలకు నిప్పు పెట్టాయి. ఈ ఘటనలో 59 మంది చనిపోయారు. కరసేవకుల మీద దాడి గురించి తెలియగానే హిందూ మూకలు ముస్లింల మీద దాడులకు దిగాయి. ముస్లింలను చంపడంతోపాటు వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో వెయ్యి మందికి పైగా చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
బిల్కిస్ బానో ఎవరు
బిల్కిస్ బానోది గుజరాత్‌లోని దహోద్ జిల్లాలో గల రంధిక్‌పుర్ గ్రామం. 2002 మార్చిలో బక్రీద్ రోజు దహోద్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. హిందూ మూకలు ముస్లింల ఇళ్ల మీద దాడులకు దిగాయి. ఆ దాడుల నుంచి తప్పించుకునేందుకు మూడేండ్ల కూతుర్ని తీసుకుని ఇల్లు విడిచి బానో పారిపోయింది. ఆమెతోపాటు 15 మంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మార్చి 3న బానో కుటుంబం ఛప్పర్‌వాడ్ గ్రామంలోని పొలాల్లో తలదాచుకున్నారు. చార్జ్ షీట్లో పేర్కొన్న ప్రకారం 20-30 మంది కర్రలు, గొలుసులతో బానో కుటుంబం మీద దాడి చేశారు. బిల్కిస్‌తో పాటు మరొక నలుగురు మహిళల మీద ముందు వారు దాడి చేశారు. ఆ తర్వాత లైంగికదాడి చేశారు. వారిలో బిల్కిస్ తల్లి కూడా ఉన్నారు. వారిలో బిల్కిస్ ఒక్కరే బతికి బయటపడ్డారు. ఆ దాడిలో బిల్కిస్ మూడేండ్ల కూతురు కూడా చనిపోయింది. ఆమె ఇతర కుటుంబ సభ్యులను చంపేశారు. అప్పుడు బిల్కిస్ ఐదు నెలల గర్భిణి.
పోలీసులకు పిర్యాదు చేసింది
స్పృహ తప్పిన బిల్కిస్ చనిపోయిందనుకుని వదిలేయడంతో ఆమె బతికిపోయింది. స్పృహలోకి వచ్చి దగ్గర్లోని ఆదివాసీ మహిళను అడిగి బట్టలు తీసుకుంది. తర్వాత ఒక హోం గార్డ్ సాయంతో లింఖేడా పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ కాన్స్టేబుల్ సోం భాయి గోరీ ఆమె ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారంటూ ఆ తర్వాత గోరీకి శిక్ష పడింది. బిల్కిస్ బానోను గోద్రా పునరావాస శిబిరానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. మొదట్లో కేసు నమోదు చేసిన పోలీసులు సరైన ఆధారాలు లేవంటూ కేసును మూసేశారు. దాంతో తనకు ఎలాగైనా న్యాయం జరగాలని బిల్కిస్ జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. విచారణ కోసం సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దాంతో సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది.
పోరాటం ఫలించిన రోజు
విచారణ తర్వాత 18 మందిని నిందితులుగా సీబీఐ చార్జ్ షీట్ వేసింది. వీరిలో ఇద్దరు డాక్టర్లు, అయిదుగురు పోలీసులు కూడా ఉన్నారు. నిందితులను కాపాడేందుకు చనిపోయిన వారికి పోస్ట్ మార్టం సరిగ్గా నిర్వహించలేదని సీబీఐ తెలిపింది. దాంతో సమాధులను తవ్వి మృతదేహాలను తీసి మళ్లీ పోస్ట్ మార్టం నిర్వహించగా దేహాల నుంచి తలలను వేరు చేసిన విషయం తెలిసింది. చివరకు 2008లో సీబీఐ స్పెషల్ కోర్టు 11 మందిని దోషులుగా తేల్చి జీవితకాల కారాగార శిక్ష విధించింది.
నా గురించి ఆలోచించరా..?
ఆగస్టు 15 నుంచి 20 ఏండ్ల కిందట జరిగిన దుర్ఘటన గుర్తుకు వస్తుంది. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నాశనం చేసిన 11 మంది నేరగాళ్లు విడుదల చేశారని తెలిసి నా గుండె పగిలిపోయింది. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నాశనం చేసిన వారిని ఎలా విడుదల చేశారు. ఆ విషయం విని షాక్ అయ్యాను. ఏ స్త్రీకి న్యాయం ఇలా ముగుస్తుంది? దేశంలోని న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. వ్యవస్థపై నమ్మకం ఉంది. నా కష్టాలను నేను నెమ్మదిగా పరిష్కరించుకుంటున్నాను. సమాజంతో కలిసి జీవించడం నేర్చుకుంటున్నాను. ఈ ఖైదీల విడుదల మరోసారి నా నుండి శాంతిని దూరం చేసింది. న్యాయంపై నా విశ్వాసం సన్నగిల్లింది. ఈ దుఃఖం, అస్థిరమైన నమ్మకం నా ఒక్కదానికి మాత్రమే కాదు. న్యాయస్థానాలలో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి మహిళది. దోషులను విడుదల చేయడానికి ముందు నా భద్రత గురించి ఏమైనా ఆలోచించారా? ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. భయం లేకుండా, ప్రశాంతంగా జీవించే హక్కును నాకు తిరిగి ఇవ్వాలి.
- బిల్కిస్ బానో
పతనావస్థలో పాలనారంగం
దేశ స్వాతంత్య్రపు అమృతోత్సవ రోజును భారతమాతకు ప్రతిరూపాలని ప్రస్తావించబడుతున్న భారతీయ ''నారీశక్తుల'' నొసట విషపుకాట్లు పెట్టి ముఖాలకు మసిపూసిన కారుచీకటి రోజుగా చరిత్రకెక్కించిన దారుణ దృశ్యం మన దేశంలోని స్త్రీల అస్తిత్వాన్ని అథోస్థితికి విసిరికొట్టింది. మనకు మన దేశపు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. నేనైతే ఇది 200 సంవత్సరాలు ఏలిన ఆంగ్లేయులు ఏర్పర్చిన చట్ట వ్యవస్థనో కాదో తెలియని అజ్ఞానంలో ఉన్నాను. పితృస్వామ్య నేర వ్యవస్థకు కిరీటం పెట్టి సంబరాల్లో మునిగి మురిసిపోతున్న పాలనారంగం దాన్ని అనుసరిస్తూ మానవీయ సాంస్కృతిక విలువల్ని కోల్పోయిన పతనావస్థలో వెనకకాళ్ళ ప్రయాణంలో మధ్యయుగాల్లోకి చేరుకున్న హీనమైన దశలో ఉన్నది. కుల, మత, లైంగిక, ఆర్ధిక రాజకీయ అభద్రతల్లో కూరుకుపోయిన సమాజంలో చచ్చి బతుకుతున్న భారతస్త్రీలు ఇక అనుక్షణం మా ఉనికి హత్యాచారాల పాలేనన్న సంకేతం కాదా ఈ దుశ్చర్య అని ప్రశ్నిస్తున్నది.
- అనిశెట్టి రజిత,రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక
దుర్మార్గమైన విధానాలకు నిదర్శనం
భారత స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలలో ప్రధాని మోడీ ఆగస్టు 15న జెండా ఎగురవేస్తూ మహిళలను కించపరిచే ప్రవర్తననూ, సంస్కృతినీ పౌరులు మానుకోవాలని, నారీశక్తి గురించీ చాలా గొప్పగా చెప్పారు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా అదే రోజు ఆయన స్వరాష్ట్రమైన గుజరాత్లో బిల్కిస్ బానోపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మూడేండ్ల కూతురును చంప,ి ఆమె కుటుంబ సభ్యులలో 13 మందిని హతమార్చిన 11 మంది నేరస్తులను జైలు నుండి విడుదల చేసారు. దీన్ని బట్టి పాలకులకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదనేది తేటతెల్లమవుతోంది. 2002లో ఈ ఘటన జరిగిన తరువాత బిల్కిస్ బానో అనేక వేధింపులనూ, బెదిరింపులనూ తట్టుకొని పోరాటం చేసింది. 2008లో నిందితులకు శిక్ష పడింది. ఆ రోజు ఈ ఘటనలపై న్యాయపోరాటంలో బిల్కిస్ బానోకు తోడుగా నిలిచిన తీస్తా సేతల్వాద్ను నేడు జైలుపాలు చేశారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన 11 మంది నెరస్తులను మాత్రం స్వీట్లు తినిపిస్తూ సత్కరించి జైలు నుండి తీసుకువచ్చారు. ఇటువంటి చర్యలు మహిళల ఆత్మ స్థైర్యాన్ని మరింత దెబ్బ తీయడమే కాక నేరస్తులు మరింత రెచ్చిపోవడానికి దారి తీస్తాయి. మహిళల పట్ల అనుసరిస్తున్న దుర్మార్గమైన విధానాలకు ఇది నిదర్శనం. పైగా నేరస్తులు బ్రహ్మణులనీ కనుక సత్ప్రవర్తన కలవారనీ వాదించడం మరింత విడ్డూరంగా ఉంది. సత్ప్రవర్తన అంటే మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడడమనే కొత్త నిర్వచనాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న బేటీ బచావో నినాదాన్ని ఆచరణలో పెట్టాలంటే ఈ నేరస్తులను తక్షణం తిరిగి జైలుకు పంపాలి. బిల్కిస్ బానోకు న్యాయం చేయాలి.
- నాగలక్ష్మి, సెంట్రల్ సిటీ కార్యదర్శి, ఐద్వా
క్రూరమైన పరిహాసానికి అనుమతి
బిజెపి ప్రభుత్వం ఎంత రెండు నాల్కల ధోరణితో వ్యవహరించగలదో ఆగష్టు 15, 2022 ఉదయం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఒక ఉదాహరణ. అక్కడేమో మహిళల హక్కులు, గౌరవం, స్త్రీ శక్తి గురించి మాట్లాడతారు. మరోవైపు అదే రోజు మధ్యాహ్నం గుజరాత్ మతమారణకాండలో సామూహిక అత్యాచారానికి గురై, కుటుంబసభ్యులను కళ్ళ ముందే కోల్పోయిన బిల్కిస్ బానోపై క్రూరమైన పరిహాసానికి అనుమతి ఇస్తారు. పైగా ఆ సంఘటన జరిగిన 2002లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే. బిల్కిస్ బానో కుటుంబాన్ని అతి దారుణంగా చంపి, సామూహిక అత్యాచారం చేసిన నేరస్థులను గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయటమంటేనే ఈదేశంలో మహిళా హక్కులు, గౌరవం మీద వాళ్లకున్న చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమవుతోంది. నేరస్తులని ఈ విధంగా విడుదల చేయటం బిల్కిన్ బానోతోపాటు, న్యాయవ్యవస్థను నమ్ముకున్న అనేక బాధిత మహిళల మీద జరిగిన మరొక ఘోర అత్యాచారం. రేపిస్టులను ఇలా పౌరసమాజంలోకి వదిలి వేస్తే, బాధితురాలికే కాక సమాజానికే ముప్పు వాటిల్లుతుంది. న్యాయం కోసం ధైర్యంగా నిలబడ్డ బిల్కిస్ బానో, ఇతర బాధిత మహిళలకు సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత మనందరిదీ. అత్యంత హేయంగా అత్యాచారం చేసి ఆమె మూడు సంవత్సరాల పాపను బండకేసి తల పగలగొట్టి చంపిన ఆ 11 మంది దోషులకు ఇచ్చిన క్షమాభిక్షను ఉపసంహరించి వారిని తిరిగి జైలుకు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
- కె. సజయ, తెలంగాణ మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటి
బిల్కిస్ కుటుంబం ప్రమాదంలో వుంది
11 మందిని విడుదల చేస్తున్నారని తెలిసిన వెంటనే బిల్కిస్‌ను కలిసేందుకు ఆమె భర్తకు ఫోన్ చేశాను. అయితే ఎక్కడున్నారో చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. వెళ్ళే ముందు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్. అక్కడికి వెళ్ళిన తర్వాత కలవగలనో లేదో అనే భయం ఉంది. అలాగే వెళ్ళిపోయాను. చాలా ప్రయత్నించినా దొరకలేదు. తిరిగి రావడానికి టికెట్ బుక్ చేసుకుంటే అతనే నాకు ఫోన్ చేశాడు. ఎంతో అనుమానంగా చివరకు గోద్రాకు రమ్మని చెప్తే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక రెండు మూడు అడ్రెసులు చెప్పారు. ముందు వాళ్ళ భద్రత చూసుకుని తర్వాత ఎక్కడ కలవాలో నాకు చెప్పారు. దీన్ని బట్టి వాళ్ళు ఎంతటి భయంతో బతుకుతున్నారో అర్థమవుతుంది. చివరు వారిని కారులో కూర్చొని మాట్లాడాను. ఇప్పుడు చేసే ఈ పోరాటంలో పిల్లలపై ప్రభావం పడకుండా వాళ్ళను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చేందుకు మేము సాయం చేస్తామని చెప్పాము. అలాగే వాళ్ళు చేసే లీగల్ ఫైట్‌కు కూడా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పాము. ఆ నిందితులు బయటకు వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామో చూడండి అంటూ బెదిరించారు. దాంతో ఆ గ్రామంలోని 50 కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయాయి. కాబట్టి నిందితులు మళ్ళీ జైలుకు పంపిస్తేనే బిల్కీస్ భానోతో పాటు మిగిలిన వారంతా ప్రశాంతంగా జీవించగలుగుతారు.
- ఖలీదా పర్వీన్, సామాజిక కార్యకర్త
- సలీమ