Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక దశను దాటిన తర్వాత మన శారీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. హార్మోనల్ సమస్యల వల్ల లావు కావడం, చాలా సన్నగా ఉండటం, గర్భసంచి సమస్యలు ఇలాంటివన్నీ ఉంటాయి. ముఖ్యంగా పెండ్లి వరకు అమ్మాయిలు ఎంత బాగుంటారో పెళ్ళయ్యి అమ్మలయ్యాక మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తల్లులయ్యి యంగ్‌గా ఉంటూ ఫిట్నెస్ మెయింటైన్ చేసేవారు చాలా తక్కువే అని చెప్పాలి. గర్భవతులైతే నెలనెలా చెకప్‌లు చేయించుకుంటూ, డాక్టర్ల సలహాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని బానే చూసుకుంటారు. కానీ డెలివరీ తర్వాత వారి ఆలోచన అంతా పిల్లల మీదనే. పిల్లలకు ఏమైనా అయితే భరించలేక ఆసుపత్రికి పరిగెత్తే ఓ తల్లి తనకు ఎదురయ్యే గర్భసంచి, హార్మోనల్ సమస్యలను మాత్రం చాలా తేలికగా తీసుకుంటుంది. ఇలాంటి అమ్మలు ఎంతమందున్నారో మాటల్లో చెప్పలేం. అన్నిటికంటే ముఖ్యంగా నలభై ఏండ్లు దాటిన తర్వాత డాక్టర్లను అప్పుడప్పుడు కలసి చెకప్ చేయించుకోవడం ఎంతైనా అవసరం ఉంటుంది. అదే వారి మెనోపాజ్ దశను ఎలాంటి గందరగోళం లేకుండా దాటేందుకు దోహదపడుతుంది.
చాలామంది చెకప్‌లకు అయ్యే ఖర్చును చూసి వెనకడుగు వేస్తారు. వయసు పెరిగేకొద్దీ తీసుకోవలసిన ఆహారంలో నాణ్యత తగ్గిపోవడం మాత్రమే కాకుండా ఇలా చెకప్‌లు కూడా చేయించుకోకపోవడం వల్ల కూడా గైనిక్ సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇదంతా కుటుంబ, వ్యక్తిగత సమస్య అయితే సమాజం నుండి ఎదురయ్యే సమస్యలు చాలానే ఉంటున్నాయి. దేశం అభివద్ధి చెందుతుందని ఎంతో గొప్పగా చెబుతారు కానీ ఆడదాని విషయంలో ఆ అభివద్ధి చాలా వెనకబడి ఉంది. ఆరోగ్యం మీద అవగాహన ఉన్నవాళ్లు ఆసుపత్రులకు వెళ్లినా చాలా వరకు మనసు నొచ్చుకునే విషయాలు జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లను అనుమానించేలా మాట్లాడటం ఆసుపత్రులలో చాలామంది గమనించే ఉంటారు. గైనిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వివాహితలు అయినా కూడా ఎన్నో ఇబ్బందికరమైన సమస్యలను ఎదుర్కొనాలి.
భర్త వెంట లేకుండా ఆడవాళ్లు గైనిక్ సమస్యల చెకప్‌కి వెళితే కొన్ని ఆస్పత్రులలో చెకప్ చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆడవారి గైనిక్ సమస్యలకు కూడా మగవాడి సంతకం, మగవాడి తోడు కావాలని అడిగే సమాజంలో మనం ఉన్నాము.
మరొక సమస్య ఏమిటంటే గైనిక్ విభాగంలో మగవారు కూడా ఉండటం. మగవారి సమక్షంలో ఆడవారికి సాధారణంగానే కంఫర్ట్ తక్కువగా ఉంటుంది. అయినా సరే అక్కడున్నది డాక్టర్ మాత్రమే అనే విషయాన్ని మనసుకు నచ్చచెప్పుకున్నా ఒకోసారి మగవారి ప్రవర్తన కూడా ఆడవారిని మానసికంగా చాలా ఆందోళనలోకి నెట్టేస్తుంది.
ఆర్థిక స్థితి అంతంతమాత్రమే ఉన్నవారు ఇలాంటి చెకప్‌ల విషయంలో వెనకడుగు వేస్తారు. పిల్లల చదువులకో, ఏ పండుగ నాడు బట్టలకో పనికొస్తాయి ఈ డబ్బు అనే పిచ్చి ఆలోచనలో ఆడవారు సమస్యను నెత్తిమీదకు తెచ్చుకుంటారు. ఫలితంగా మహిళలు ఎంతోమంది అత్యధికంగా గైనిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆడవారిలో ఈ తీరు మారాలి అంటే వారు ఆరోగ్యం కోసం కాస్త ఖర్చుపెడుతూ, మంచి పోషకాహారం తినాలి మరి.