Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజువారీ జీవనశైలిని బట్టి పనుల్లో ఆక్టివ్ ఉండటం జరుగుతుంది. అయితే ఆడవారు ఇంట్లో పనులు, బయట ఉద్యోగాలు చేస్తూ మానసికంగా అలసిపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా పిల్లల తల్లులలో ఈరకమైన అలసట స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అలసట అనేది మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. మైండ్‌ను ఆక్టివ్ చేయడానికి కనీసం సరైన సమయం కూడా దొరకనంతగా మారిపోతుంది ఒక్కోసారి. అలాంటప్పుడు తీసుకునే కొద్దిపాటి విశ్రాంతి అయినా చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. రోజులో చిన్నపాటి విశ్రాంతి వల్ల కలిగే అద్భుతమైన మార్పులు ఇవే...
మరింత ఉత్సహం: చాలామంది ఒక ఫ్లో లో పని చేస్తున్నప్పుడు దాన్ని మధ్యలో ఆపితే చాలా డిస్టర్బ్ అవుతారు. విశ్రాంతి తర్వాత దాన్ని అదే వేగంతో కొనసాగించడంలో ఇబ్బంది పడతారు. అయితే ఇలా విరామం తీసుకుని, ఆ విరామంలో కాసింత విశ్రాంతి తీసుకోవడం అలవాటు అయితే అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. విశ్రాంతి తర్వాత మరింత ఉత్సహంగా పనిని కొనసాగించే శక్తి వస్తుంది. కాబట్టి చిన్న పాటి విశ్రాంతి మెదడును రిఫ్రెష్ చేస్తుంది.
ఒత్తిడికి మంచి బ్రేక్: పనులు ఎక్కువైతే సాధారణంగానే మానసికంగా అలసిపోయి ఒత్తిడికి లోనవుతారు. అలా నిరంతరం ఒత్తిడి ఎదుర్కొనే వారు చేస్తున్న పని మధ్యలో ఒక క్రమమైన బ్రేక్ తీసుకుని విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆ ఒత్తిడిని కూడా ఒక క్రమంలో తగ్గించడానికి అలవాటు పడతారు. ఒత్తిడి మానసిక ఆరోగ్యం పైన మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి విశ్రాంతి ఆ రెండింటిని పరిష్కరిస్తుంది.
క్రియేటివిటీ: పనులు చేసేటప్పుడు ఏదైనా కష్టంగా లేక తర్వాత ఏమిటి అని ఆలోచన, ఇదింకా అవ్వలేదే అనే చిరాకు ఉన్నప్పుడు చిన్న బ్రేక్ దానిలో కాస్త విశ్రాంతి తీసుకుంటే పనిలో చేయాల్సిన మార్పులు, ఆ పనిలో చేస్తున్న తప్పులు అర్థమైపోతాయి. విశ్రాంతి తర్వాత ఉత్సహంగా పని చేసే అవకాశం దొరుకుతుంది.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది: ఆగకుండా ఏదో పని చేస్తున్నప్పుడు శరీరమే కాదు మెదడు కూడా తొందరగా అలసిపోతుంది. ఆ మెదడుకు కాసింత విశ్రాంతి ఇచ్చామంటే రిలాక్స్ అయ్యి దాని పనితీరు పెరుగుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి స్థాయి కూడా మెరుగవుతుంది.
ఏకాగ్రత: చేసేపని మీద ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఏకాగ్రత లేకపోతే గంటలో చెయ్యాల్సిన పనిని ఇరవై నాలుగు గంటల సమయం ముందుంచినా చెయ్యలేము. అందుకే పని మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుంటే తర్వాత పనిమీద ఏకాగ్రత పెరుగుతుంది. ఆ ఏకాగ్రత పని సులువుగా సమర్థవంతంగా పూర్తి అయ్యేలా చేస్తుంది.
ఈవిధంగా మహిళలు తమ రోజువారీ పనులలో చిన్న చిన్న బ్రేక్‌లు తీసుకుంటూ ఆ సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల రోజుమొత్తం ఎలాంటి గందరగోళం లేకుండా సజావుగా గడిచిపోతుంది. చిన్న బ్రేక్స్ ఆడవారి ఆరోగ్యానికి పెద్ద ఉపశమనాన్ని ఇస్తాయి. అంతేకాదు చేస్తున్న పని విషయంలో ఆ బ్రేక్స్‌లో కొన్నిసార్లు అద్భుతమైన ఆలోచనలు కూడా రావచ్చు. ఎవరు చెప్పొచ్చారు ఆ ఆలోచనలే పనిని మరొక స్థాయికి తీసుకెళ్లి అద్భుతాన్ని సష్టించవచ్చేమో. అందుకే విశ్రాంతి అనేది మానసిక శారీరక ఆరోగ్యానికే కాదు పని సవ్యంగా జరగడానికి కూడా ముఖ్యమే!