Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండగంటే చాలు ఎవరికైనా కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఇక పిల్లల సందడైతే చెప్పాల్సిందేముంటుంది. కొత్త బట్టలు, పిండి వంటల కోసం ఎదురు చూస్తుంటారు. వినాయక చవితికి చేసే ఉండ్రాళ్లు, లడ్డాలు, కుడుములు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వాటినే కాస్త వెరైటీగా ఆరోగ్యాన్నిచ్చే గోధుమలు, రాగులతో కూడా చేసుకోవచ్చు. అలాంటి వినాయక చవితి స్పెషల్ వంటకాలు ఈరోజు మీకోసం...
గోధుమ ఉండ్రాళ్లు
కావలసిన పదార్థాలు: గోధుమపిండి - అరకప్పు, ఉప్పు - కొద్దిగా, బెల్లం - కప్పు, ఇలాచీపొడి - అర చెంచా, నెయ్యి - నాలుగు చెంచాలు, కొబ్బరి కోరు - రెండు చెంచాలు, డ్రై ఫ్రుట్స్ - కొన్ని.
తయారు చేయు విధానం: చవితి ముందు రోజే శుచిగా ఉండే వస్త్రాలతో గోధుమపిండిలో కొద్దిగా ఉప్పుకలిపి ఆ గట్టి చపాతి పిండిని చిన్నచిన్న ఉండలుగా కొన్ని గుండ్రంగా కొన్ని కోలగా పొడవుగా జంతికలమాదిరి సన్నగా చేసుకొని. ఒక చేటలో లేదా పళ్ళెంలో కొద్ది పొడిపిండి చల్లి గాలికి నీడలో ఉంచాలి. చవితి రోజు ఉదయం మూకుడులో నేతిని రెండు చెంచాలు వేసి ముందుగా డ్రై ఫ్రుట్స్ తరువాత కొబ్బరి వేయించాలి. అవి వేగాక బెల్లం నీళ్ళలో నానబెట్టి ఆ రసాన్ని పూర్తిగావడకడుతూ మూకుడులో పోసి ఈ ఆరిన గోధుమ ఉండ్రాళ్ళను ఆ బెల్లం నీళ్ళలోవేసి ఇలాచీపొడి చల్లి కలుపుతూ చిన్న మంటపై కొద్దిసేపు లోపల వరకు ఉడికేలా చూసుకుని కొద్దిగా గోధుమపిండి నీళ్ళలో కలిపి ఇందులో వేసి చిక్కబడ్డాక పొయ్యిమీద నుండి దించి మిగిలిన నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రుట్స్ కొబ్బరితో కలిపి ఉడికించకపోతే వాటిని విడిగా తీసి ఉంచుకుని పైన అలంకరించు కోవాలి. చాలా రుచిగా ఉండే వీటిని ఫ్రీజ్‌లో పెట్టుకుని చల్లగా తింటే ఇంకా రుచిగా ఉంటుంది.
జిల్లేడుకాయలు
కావాల్సిన పదార్ధాలు: బియ్యం రవ్వ - రెండు, తరిగిన బెల్లం - కప్పు, పచ్చి కొబ్బరి తురుము - రెండు కప్పులు, గసగసాలు - టీ స్పూను, బాదం, జీడిపప్పు పలుకులు, కిస్మిస్ - రెండు టీ స్పూన్లు, నెయ్యి - కొద్దిగా, ఏలకుల పొడి - చిటికెడు.
తయారు చేయు విధానం: గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌమీద పెట్టి, మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి, రవ్వ పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత చల్లార్చాలి. మరొక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి, కొద్ది నీరు చల్లి ఐదు నిమిషాలు ఉడికించి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని, వేయించిన గసగసాలు, ఏలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. బియ్యపు రవ్వతో చేసిన పిండి ముద్దను తీసుకొని పూరీలా అదిమి మధ్యలో కొబ్బరి ముద్ద పెట్టి అన్ని వైపులా మూయాలి. దీనిని పొడవుగా లేదా, కుడుము ఆకారంగా చేసుకొని ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించాలి. అంతే జిల్లేడు కాయలు రెడీ.
బియ్యం ఉండ్రాళ్ళు
కావలసిన పదార్దాలు: బియ్యం రవ్వ - కప్పు, నూనె - రెండు చెంచాలు, జీలకర్ర - అర స్పూను, ఉప్పు - అర స్పూను, సెనగపప్పు - మూడు స్పూను, నీళ్ళు - రెండు కప్పులు,
తయారు చేసే విధానం: మిక్సిలో బియ్యం ఆడించి.. వచ్చిన రవ్వను జల్లించి దీన్ని ఉండ్రాళ్ళకు వాడుకోవాలి. ముందుగా దళసరి గిన్నె తీసుకుని కప్పు రవ్వఅయితే రెండు కప్పుల నీళ్ళు గిన్నెలో పోసి సెనగపప్పు వేసి జీలకర్రతో పాటు రెండు స్పూన్ల నూనె కలపాలి. బాగా మరుగుతున్న నీటిలో రవ్వ కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. పూర్తిగా రవ్వ పోసికలిపి మూత పెట్టాలి. అలా సిమ్‌లో ఐదు నుంచి పదినిమిషాలలోపు ఉంచితే రవ్వ పలుకు లేకుండా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి మగ్గాక వెడల్పు పళ్ళెం లేక బేసినలోకి ఈ రవ్వను తీసి చల్లారనిచ్చి తడి చేతికి కొద్దిగా నేయి రాసుకుని ఉండలుగా చుట్టాలి... అంతే ఉండ్రాళ్ళు రెడీ.
రాగిలడ్డు
కావలసిన పదార్ధాలు: రాగి పిండి - కప్పు, నెయ్యి - అర కప్పు, చెక్కర లేక బెల్లం - కప్పు, అవిసె గింజలు లేక నువ్వుల పప్పు - చెంచా, చిన్నగా ముక్కలు చేసిన జీడిపప్పు - రెండు చెంచాలు.
తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రాగిపిండి వేసి చిన్న మంటపై వేయించుకోవాలి. అది వేగి నోట్లో చిటికెడు వేసుకుంటే పొడి కరకరలాడాలి అలా కదుపుతూ కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకొని చేయి పట్టే వేడి ఉండేవరకు చల్లర్చుకోవాలి. ఇప్పుడు కొద్ది బరకగా పొడి కొట్టుకున్న చెక్కర గాని, బెల్లం సన్నని తురుము గాని కలుపుకుని వేయించి ఉంచుకొని ఉన్న నువ్వులు, జీడిపప్పు పొడివేసి.. వేడి నేతిలో ఈ పిండిని సున్నుండలా కలుపుతూ ఉండలు చుట్టాలి. ఇవి రుచికి చాలా బావుంటాయి ఆరోగ్యానికి ఎంతో మంచివి.