Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలసరి అనేది సాధారణమైన సమస్య. అయితే మారుతున్న రుతువులను బట్టి నెలసరిసమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు వేర్వేరుగా ఉంటాయి. వేసవిలో, చలికాలంలో, వర్షాకాలంలో వాతావరణంలో జరిగే మార్పులు నెలసరి సమయాల్లో పలురకాల ఇబ్బందులకు గురిచేస్తాయి. ప్రస్తుతం వర్షాల ప్రభావం వల్ల వాతావరణం చాలా చల్లగానూ చుట్టుపక్కల ప్రాంతాలు చిత్తడిగానూ ఉంటాయి. నెలసరి సమయాల్లో నిరంతరం మార్చుకునే ప్యాడ్లు, టాంపాన్ల వల్ల యోని ప్రాంతాన్ని పదే పదే నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండటం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, రిప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి యోని ఇన్ఫెనెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా వర్షాకాలంలో కొన్ని అలవాట్ల వల్ల మనకు నెలవారీ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి గురించి తెలుసుకుని దూరంగా ఉండటం ఎంతైనా మంచిది.
శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి
శుభ్రత అంటే చాలామంది దృష్టిలో పదేపదే కడగడం. కానీ అది చాలా తప్పు. అది అతి శుభ్రత అవుతుంది.
వాతావరణంలో తేమశాతం ఎక్కువైతే సహజంగానే పీహెచ్ స్థాయిలు తగ్గుతాయి. నెలసరి సమయాల్లో ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం, ప్యాడ్ లేదా టాంపాన్ మార్చుకున్న ప్రతిసారి యోనిని కడగడం చేస్తారు. అయితే మెత్తని శుభ్రమైన పొడిబట్టతో యోని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి.
యోనిలో సహజంగా తేమను నిర్వర్తించడానికి మంచి బాక్టీరియా ఉంటుంది. కానీ మన అతిజాగ్రత్త వల్ల సబ్బులు, ఇతర వాష్లను ఉపయోగించి పదే పదే శుభ్రం చేయడం వల్ల అక్కడ మంచి బాక్టీరియా పోయి ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది.
బిగుతు వస్త్రాలకు దూరం
బిగుతుగా ఉన్న టాప్స్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ చాలామంది బిగుతుగా ఉన్న జీన్స్, లెగ్గింగ్స్ వంటివి వేసుకోవడం వల్ల యోని ప్రాంతంలో మెల్లగా చెమట శాతం పెరుగుతుంది.
అప్పటికే యోని ప్రాంతంలో ఉన్న తేమకు ఈ చెమట జతకలిస్తే ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బాక్టీరియా చాలా తొందరగా వృద్ధి చెందుతుంది.
నెలసరి సమయాల్లో యోని ప్రాంతాల్లో తేమ అయినా, చెమట ద్వారా ఏర్పడే తేమ అయినా తగినంత గాలి ప్రవాహం ఉంటేనే అవి ఆరిపోతాయి. కాబట్టి వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి. కాటన్ దుస్తులు ధరిస్తే మరింత మంచిది.
పొడిగా ఉంచే మార్గం
యోని ప్రాంతం పొడిగా ఉండాలంటే వేసుకునే ప్యాడ్ లేదా టాంపాన్ లను పూర్తిగా తడిచిపోయేవరకు ఉంచుకోకూడదు.
ఇంటి పనులు చేసేటప్పుడు ధరించిన దుస్తులు ఏమాత్రం తడి తగిలినా వాటిని మార్చుకోవాలి.
అవాంచిత రోమాలు
చాలామంది బయటకు చెప్పుకోవడానికి చాలా షేమ్‌గా భావించే విషయం. యోని ప్రాంతంలో అవాంచిత రోమాలు.
నెలసరి సమయంలో ఎక్కువగా ఉన్న అవాంచిత రొమాల వల్ల తడిశాతం ఎక్కువగా ఉండిపోయి ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి.
అందుకని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వాటిని తొలగించుకోవడం ముఖ్యం.
చాలామంది చేసే పొరపాట్లు
దిగువ, పేద తరగతి కుటుంబాలలో మహిళలు, అమ్మాయిలు చాలామంది ఇంట్లో ఉన్న వస్త్రాలను నెలసరి సమయాలలో వాడుతారు. పైగా వాటిని ఉతికి ప్రతి నెలా వాటినే ఉపయోగిస్తారు.
ప్రతిసారి ఇలా ఉపయోగించడం వల్ల యోని ప్రాంతం చాలా తొందరగా సున్నితత్వాన్ని కోల్పోతుంది.
చర్మం కందిపోవడం, యోని ప్రాంతం తేమ ఎక్కువగా ఉండటం, బాక్టీరియా పెరుగుదల వేగంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా యోని సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
కాబట్టి వర్షాకాలంలో నెలసరి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో తేమ స్థాయి నిలకడగా ఉండేలా చూసుకోవాలి. దురద, మంట ఇతర సమస్యలు ఏవైనా ఎదురైతే గైనకాలజిస్ట్‌ను కలవాలి.