Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలతో మంచి అనుబంధం పెంచుకోవాలంటే ఏం చేయాలి..? అమ్మలందరి ప్రశ్న అదే... ఎందుకంటే వాళ్ళని బెదిరించి, బయపెట్టి మాట వినేలా చేసే రోజులు పోయాయి. చిన్నతనంలో అమ్మ ఏం చెబితే అదే పిల్లలు వినేవారు. అమ్మ చెంగుపట్టుకు తిరుగుతూ, అమ్మ చెప్పే కథలు వింటూ.. అమ్మే లోకంగా వుంటారు పిల్లలు. ఆ సమయంలో నయాన్నో, భయాన్నో వాళ్ళు చెప్పినట్టు వినేలా చేయచ్చు. కాని కాస్త పెరిగి ప్రిటీన్స్లోకి వచ్చాకా, ఎదురుతిరగటాలు, అలకలు, అబ్బో అమ్మకి బోల్డంత ఓపిక కావాలి. కానీ ఆ పేచీలు లేకుండా చేయటానికి కొన్ని చిట్కాలు వున్నాయి.
పిల్లలతో సమయం గడపటం: ఈ మాట చెప్పగానే.. రోజు చేసేది అదే కదా అంటారు ఎవరైనా. కాని సమయం గడపటం అంటే... రోజూ వారి పనుల మద్య వాళ్ళతో మాట్లాడటం కాదు.. అచ్చంగా వాళ్ళతో మాత్రమే గడపటం. దానికి అమ్మ కొన్ని సమయాలని ఫిక్స్ చేసుకోవాలి. సాధారణంగా ఉదయాన్నే నిద్రలేపేటప్పుడు హడావుడిగా టైం అయిపోయింది అంటూ పిల్లలని లేపుతుంటారు.. అలా కాకుండా ఓ పది నిమిషాల ముందు పిల్లలని లేపండి. పక్కన కూర్చుని ఓ నాలుగు మాటలు సరదాగా మాట్లాడండి. అప్పుడు చూడండి చక, చకా ఎలా రెడీ అవుతారో. అలాగే ఉదయం వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళతో అవి, ఇవి మాట్లాడుతూ వుండాలి. అవి చాలా సాధారణ విషయాలు.. పేపర్లో న్యూస్ గురించో, ఇంట్లో మొక్కల గురించో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించో చాలా, చాలా క్యాజ్యువల్ టాక్ జరగాలి.
పిల్లలతో ఆడిపాడాలి: క్రికెట్ నుంచి షటిల్ దాకా, అలాగే కారమ్స్, యూనో ఇలా ఎన్నో గేమ్స్ వున్నాయి .. వాటిలో ఏదో ఒకటి ఆడండి. మ్యూజిక్ వినటం ఇష్టంగా వుంటుంది పిల్లలకి. వాళ్ళతో కలసి పాటలు వినటం, వాళ్ళు డాన్స్ చేస్తుంటే చేయలేకపోయినా చూడటం అన్నా చేయాలి. ఇక రంగులంటే పిల్లలతో పాటు మనకి ఇష్టమేగా.. డ్రాయింగ్, కలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా పిల్లలతో కలసి ఏమేం చేయచ్చో అన్నీ చేయటమే. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళకి ఓ ఫ్రెండ్‌లా వాళ్ళ అల్లరిలో భాగం కావాలి. వాళ్ళకి కావాల్సింది ఓ ఫ్రెండ్ లాంటి అమ్మ. ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూ, జాగ్రత్తలు చెబుతూ, కోప్పడుతూ ఉంటే అమ్మ వాళ్ళకి పరాయిగా కనిపిస్తుంది. అర్ధం చేసుకోదు అనుకుంటారు. అలా కాకుండా వాళ్ళను అర్థం చేసుకుంటూ వాళ్ళతో కలిసిపోతే ఎప్పుడూ మీతో ఉండటానికి ఇష్టపడతారు.