Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపికా గోవింద్... కట్టెలు ఏరుకుని బొగ్గు కాల్చి అమ్ముకునే కుటుంబంలో పుట్టింది. గొప్ప చదువులు చదుకుని జీవితంలో ఓ స్థాయికి రావాలనే ఆలోచన చేయడానికే ధైర్యం చేయని తెగలో పెరిగింది. అలాంటిది ఆమె ఏకంగా గాల్లో ఎగరాలనుకుంది. ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కన్నది. చివరికి తన కల నెరవేర్చుకుంది. ఇప్పుడు తన రాష్ట్రం నుండి ఎయిర్ హోస్టెస్ అయిన మొట్టమొదటి గిరిజన యువతిగా చరిత్రలో నిలిచిపోయింది.
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో కరింపలనులు అనే అతి చిన్న గిరిజన తెగలో పుట్టి పెరిగింది గోపికా గోవింద్. అలకోడ్ సమీపంలోని కవుంకుండి అనే ప్రాంతం వారిది. తల్లి విజిల, తండ్రి పి.గోవిందన్. వీరు అడవిలోని పుల్లల్ని కాల్చి బొగ్గు చేసి అమ్ముకునేవారు. అయితే గోపికా మాత్రం అక్కడితే ఆగిపోవాలనుకోలేదు. ఏదో సాధించాలని కలలు కన్నది. చిన్నతనంలో తమ ఇంటిపై నుండి విమానం ఎగురుతుంటే అందులో తానూ ఉండాలని కోరుకుంది. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఓ పత్రికలో తెల్లని షర్ట్‌తో ఓ అమ్మాయి ఫొటో కనిపించింది. తాను ఎవరో తెలుసుకుంటే ఎయిర్ హోస్టెస్ అని ఉపాధ్యాయులు చెప్పారు. అప్పుడు అనుకుంది తను కూడా అలా కావాలని. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి ఆమెకు ధైర్యం చాల్లేదు. చివరికి కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేదు.
కలను నిజం చేసుకోవాలని
కరింబాల తెగలోని అందరి అమ్మాయిల మాదిరిగానే గోపికా బాల్యం కూడా సాధారణంగా గడిచిపోయింది. అయితే అందరిలా తాను అక్కడే ఆగిపోవాలని భావించలేదు. ఆకాశాన్ని తాకడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. 12 ఏండ్ల వయసులో తాను కన్న కలను నిజం చేసుకోవాలని ప్రణాళికను రూపొందించుకుంది. ''చిన్నతనంలో నా ఇంటి పైన ఎగురుతున్న విమానాన్ని చూడటం, దానిలో నేనూ ఉండాలని కోరుకోవడం ఇప్పటికీ గుర్తుంచుకున్నాను. ఇప్పుడు కూడా ఎయిర్‌క్రాఫ్ట్ దగ్గరికి వెళుతున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నాను'' అని గోపిక చెప్పింది.
ఖర్చు భరించలేక...
బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఎయిర్ హోస్టెస్ కావాలంటే ఏం చదవాలో తెలుసుకుంది. అయితే ఆ చదువుకు పీజులు లక్షల్లో ఉంది. అంత ఖర్చుపెట్టే శక్తి తన కుటుంబానికి లేదు. అందుకే కన్నూర్‌లోని ఎస్.ఎన్. కాలేజీలో ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో చేరింది. పీజీలో చేరిందనే కానీ ఎయిర్ హోస్టెస్ కావాలనే ఆమె కోరిక మాత్రం తనతో పాటే రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అప్పుడే ఐ.ఏ.టి.ఏ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) వారు కస్టమర్ సర్వీస్ కోర్సును గవర్నమెంట్ స్కాలర్ఫిప్ ద్వారా చదవొచ్చని తెలుసుకుంది. ఎస్టీ విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వెంటనే దానికి అప్లై చేసింది. స్కాలర్షిప్ కూడా మంజూరు అయ్యింది. ఇక ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన కల నెరవేరబోతున్నందుకు ఎంతో సంతోషపడింది. అలా వాయనాడ్‌లోని డ్రీమ్ ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్సును కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్ ద్వారా చేరింది.
కోర్సు పూర్తి చేసింది
గోపిక చదువు, వసతి, భోజనం ఖర్చులకు అవసరమైన మొత్తం లక్ష రూపాయలను ప్రభుత్వమే కట్టింది. అయితే మలయాళ మీడియంలో చదువుకున్న గోపిక ఎయిర్ హోస్టెస్‌కు అవసరమరైన హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా శిక్షణ పొందింది. అలా కష్టపడి కోర్సు పూర్తి చేసింది. తర్వాత ఓసారి ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ కాలేదు. రెండోసారి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికయింది. త్వరలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో చేరనుంది. ప్రస్తుతం ఆమె శిక్షణ కోసం ముంబై వెళ్ళింది. ఆకాశంలో ఎగిరే విమానాన్ని దూరం నుండి చూస్తూ చప్పట్లు కొట్టడం తప్ప ఎప్పుడూ విమానం ఎక్కని గోపికా ఇకపై విమానంలోనే ఉద్యోగం చేయబోతుంది.
విజయానికి కారణం
''నేను ఆకాశాన్ని తాకాలని, ఎయిర్ హోస్టెస్‌ని కావాలనే నా కలను నాతో పాటే పెంచుకున్నాను. కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చివరికి నా తల్లిదండ్రులకు కూడా తెలియదు. గిరిజన అమ్మాయిల కోసం ఇలాంటి పథకాలు ఉన్నాయని నాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం నా కోర్సుకు అవసరమైన ఫీజు రూ.లక్ష చెల్లించింది. నేను ఏమీ చెల్లించాల్సిన అవసరం రాలేదు'' ఆమె చెప్పింది. ఆమె విజయానికి కారణం కేరళ ప్రభుత్వం, అకాడమీ అధ్యాపకులే అంటుంది గోపికా.
అవేంటో ఇప్పుడే చెప్పను
''నేను ఇంకా ఎంతో సాధించాలని, ఎన్నో విజయాలు అందుకోవాలనుకుంటున్నాను. అయితే వాటిని సాధించే వరకు అవేంటో ఎవరికీ చెప్పను'' అంటుంది గోపిక. కరింబాల సంఘం సభ్యులు ఎక్కువగా కన్నూర్‌లోని తలస్సేరి, తాలిపరంబ తాలూకాల్లో నివసిస్తున్నారు. పనియా, ఇరులర్ కమ్యూనిటీలతో పోలిస్తే కరింబాలకి తక్కువ మంది సభ్యులు ఉన్నారు. అలాంటి తెగ నుండి వచ్చి ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం సాధించడం నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు గోపిక ఎందరికో స్ఫూర్తిదాయకం.