Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సలోని భరద్వాజ్... విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆమె స్వదేశంలో కూడా ఏదైనా భిన్నంగా చేయాలని భావించారు. అప్పుడే మురికివాడల్లో నివసించే పిల్లల కోసం స్థాపించిన లోటస్ పెటల్ ఫౌండేషన్ ఆమె కంటబడింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ఆమె ఆ సంస్థ పనిలో ఎలా పాలుపంచుకున్నారో, నిరుపేద పిల్లలకు అది ఏవిధంగా సహాయపడుతుందో తెలియజేశారు. ఆ వివరాలు నేటి మానవిలో...
పదిహేడేండ్ల గుడియా కుమారి తన తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులతో కలిసి గురుగ్రామ్ మురికివాడలో నివసించేది. తండ్రి కార్ క్లీనర్‌గా పనిచేసేవారు. తల్లి ఇండ్లల్లో పని చేసేది. 2016లో గుడియా మొదటిసారిగా గురుగ్రామ్‌కు చెందిన లాభాపేక్ష లేని సంస్థ లోటస్ పెటల్ ఫౌండేషన్ పాఠశాలలో చేరినప్పుడు ఆమె 5వ తరగతి స్థాయికి సరిపోతుందని గుర్తించారు. ఆమె ఫౌండేషన్ టైలర్డ్ ప్రోగ్రాం, ప్రతిష్ఠాన్ లెర్నింగ్ సెంటర్, ఫాస్ట్-ట్రాక్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో చేరింది. దీని వల్ల విద్యార్థులు తమ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మూడేండ్లలో పూర్తి చేయగలిగారు. 11, 12 తరగతులలో ఆమె కంప్యూటర్ బేసిక్స్, డేటా ఎంట్రీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్‌పై ఒక సంవత్సరం వృత్తి శిక్షణా కార్యక్రమంతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లను ఎంచుకుంది. ఐదేండ్ల తర్వాత గుడియా 2021లో 12వ తరగతి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించింది. QA టెస్టర్‌గా యూనిఫై డాట్స్‌లో స్థానం పొందింది.
చిన్నగదిలో ప్రారంభమై
ప్రస్తుతం లోటస్ పెటల్ ఫౌండేషన్ ద్వారా మెరుగైన జీవితాన్ని అందుకునే ప్రయత్నంలో ఉన్న 1,400 మంది విద్యార్థులలో గుడియా ఒకరు. 2011లో కుశాల్ చక్రవర్తిచే స్థాపించబడిన ఈ ఫౌండేషన్ పట్టణ మురికివాడలకు చెందిన కేవలం ఏడుగురు పిల్లలతో ఒక చిన్న గదిలో ప్రారంభించబడింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇది గురుగ్రామ్‌లో నర్సరీ నుండి 12వ తరగతి వరకు రెండు క్యాంపస్‌లను కలిగి ఉంది. 160 మంది సిబ్బందితో రెండు విద్యా ప్రవాహాలు పట్టణ ప్రాంతాల నుండి వెనుకబడిన విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
విదేశాల్లో స్వచ్ఛంద కార్యకర్తగా
యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్, యుకేలో గ్రాడ్యుయేట్ అయిన సలోని ఓ జర్నలిస్ట్. యుకేలోని బిబిసి రేడియోలో, భారతదేశంలోని ప్రింట్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉంది. యుకేలో తన విద్యాభ్యాసం తర్వాత సలోని యుఎస్కిి వెళ్లి అక్కడ మహిళల కోసం సిన్సినాటి నిధుల సేకరణ చాప్టర్‌ను నిర్వహించింది. చాలా సంవత్సరాల తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు పరివర్తనను ప్రత్యక్షంగా చూడగలిగే సెక్టార్లో పనిచేయాలనే ఆలోచన వచ్చింది.
మొదటిసారికే దృష్టిలో పడింది
''ఇంగ్లండ్‌లో చదువుతున్నప్పుడు, ఆపై యునైటెడ్ స్టేట్స్ (యుఎస్)లో నివసిస్తున్నప్పుడు నేను చాలా నిర్మాణాత్మకమైన, వ్యవస్థీకృతమైన లాభాపేక్షలేని, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అక్కడ స్వచ్ఛందంగా వివిధ అవకాశాలను కనుగొనడం చాలా సులభం. లోటస్ పెటల్కి నేను 2012లో వచ్చాను. అప్పుడు అది షాపింగ్ ఆర్కేడ్లోని ఒక చిన్న గది. అక్కడ ఏడుగురు పిల్లలు మెట్ల మీద భోజనం చేసేవారు. అది అంతకు ముందు ఒక మురికివాడలో భాగం. ఆ గదే పాఠశాలగా అవకాశం ఉంది. దాంతో నా దృష్టి దానిపై పడింది'' అని సలోని గుర్తుచేసుకున్నారు. ఆమె BIT మెస్రా, IIM లక్నో పూర్వ విద్యార్థి అయిన కుశాల్‌తో చేరారు. అతను 12, 14 ఏండ్ల వయసు గల పిల్లలకు ఆంగ్ల మాధ్యమ అభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ×సవaలో ప్రపంచ పాత్రను కలిగి ఉన్నారు. అతను ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ తన ఇంటికి సమీపంలోని షాపింగ్ ఆర్కేడ్లోని అద్దె గది నుండి పని చేసేది. దాదాపు ఆరుగురు పిల్లలు, ఒక గణిత ఉపాధ్యాయుడు, మూడు కంప్యూటర్లతో అది ప్రారంభమైంది.
నేను చేయదలచింది ఇదే
''కుశాల్ సేవాభావం కలిగిన వ్యక్తి. నేను స్వచ్ఛంద సంస్థలో ఏమి చేయాలనుకుంటున్నానో దాని ఎంపికను నాకు ఇచ్చాడు. నేను కమ్యూనికేషన్లను నిర్వహించడం, లోగో, చిత్రాలు తీయడం, ఆ స్థలాన్ని ఒకచోట చేర్చడం ద్వారా నా పని ప్రారంభించాను. ఆ సమయంలో లోటస్ పెటల్కి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొనడానికి ప్రజలను ప్రేరేపించాను'' అని సలోని చెప్పారు. త్వర్వాత ఆమె స్వచ్ఛంద సంస్థ కోసం నిధుల సేకరణను కూడా ప్రారంభించారు. ఉపాధ్యాయులు, సలహాదారులు, కౌన్సెలర్లు ఇలా చురుగ్గా పాల్గొన్న సుమారు 50 మంది సేవాగుణం కలిగిన వారు ఇచ్చిన విరాళాలతో సంస్థ ఓ భవనంలోకి మారింది. దాంతో మరిన్ని కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. ఇతర పాఠశాలలు సైతం సహాయం కోసం ఫౌండేషన్‌ను సంప్రదించడం ప్రారంభించాయి.
ప్రవేశ ప్రక్రియను క్రమబద్ధీకరించి
పాఠశాలను నిర్మించడం, అనుభవాన్ని గడించడం, సరైన పిల్లలు ప్రయోజనం పొందేలా చూసేందుకు పాఠశాల తన ప్రవేశ ప్రక్రియలను క్రమబద్ధీకరించింది. విద్యార్థులు వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. వారు ఆస్తి లేదా దుకాణం కలిగి ఉండకూడదు. పెద్ద పిల్లలకు, నర్సరీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉండగా 12వ తరగతి వరకు పిల్లలకు విద్యను అందించడం పట్ల తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అనే అంశాన్ని తెలుసుకునేందుకు పాఠశాల వారి కుటుంబాలను కలుసుకుంటుంది. పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇస్తారు.
ఉచితానికి విలువ లేదని
''పిల్లలు పోషకమైన భోజనం అందుతుందా లేదా అనేది కూడా నిర్ధారించాలనుకుంటున్నాము. ప్రోటీన్ తీసుకోవడం సరిగ్గా ఉన్నప్పుడే వారు చదువుపై దృష్టిపెట్టగలరు'' అని డోనర్ డెవలప్మెంట్, ఎల్పిఎఫ్ శ్రుతి సక్సేనా చెప్పారు. పాఠశాల ప్రారంభంలో ఉచిత సేవగా ప్రారంభించినప్పటికీ ఇప్పుడు సంవత్సరానికి రూ. 14,000 టోకెన్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. ''మేము వేసవి, చలికాలం రెండింటికీ యూనిఫాంలు, బూట్లు, పాఠశాల సామాగ్రి మొదలైనవాటిని అందజేస్తాము. కాబట్టి ప్రతి బిడ్డపై మేము చేసే వాస్తవ వ్యయం సంవత్సరానికి రూ. 60,000. అయితే అన్నింటినీ ఉచితంగా ఇస్తున్నప్పుడు దానికి సరైన విలువ లేకపోవడం మేము గ్రహించాము. అందుకే మేము ఫీజులను ప్రవేశపెట్టాము. ఏదో ఒక విధంగా ఫీజు రీఫండ్ అయ్యేలా అకాడమీ చూసుకుంది. ఉదాహరణకు తల్లిదండ్రులు హాజరయ్యే ప్రతి పేటీఎమ్(ఉపాధ్యాయులు - తల్లిదండ్రుల సమావేశం) సమావేశం కోసం కొంత మొత్తంలో డబ్బు వారికి తిరిగి ఇవ్వబడుతుంది. దీని వల్ల తల్లిదండ్రులు కూడా పేటీఎమ్‌లకు హాజరవుతారు. వారి వార్డు పురోగతి గురించి తెలుసుకుంటారు'' అని శృతి చెప్పారు.
రుతుక్రమంపై అవగాహన
చదువుతో పాటు జెండర్, మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంపై కూడా వీరి దృష్టి పెట్టారు. నేర్చుకోవడంతో పాటు చాలా అన్‌లెర్నింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతాయని సలోని చెప్పారు. ''బహిష్టు సమయంలో బయటికి వెళ్లకూడదని చాలా మంది అమ్మాయిలు తమ సంఘాల నుంచి తెలుసుకున్నారు. అప్పటికే వారిలో మూఢనమ్మకాలు, విశ్వాసాలు పాకాయి. పిల్లలు 4వ తరగతిలో ఉన్నప్పుడు శరీరం మారడం ప్రారంభమవుతుంది. ఆ వయసులో రుతుక్రమం, యుక్తవయసు గురించి అవగాహన కల్పించడానికి మేము వారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాము'' అని సలోని చెప్పారు.
సమగ్ర అభివృద్ధిపై దృష్టి
మానసిక ఆరోగ్యం అనేది పాఠశాల ప్రత్యేకంగా దృష్టి సారించే మరొక ముఖ్యమైన విషయం. ''చాలా మంది విద్యార్థులు కష్టతరమైన కుటుంబ నేపథ్యాల నుండి వచ్చారు. వారు ఒక నిర్దిష్ట వయసుకు వచ్చే సమయానికి సాధారణ పిల్లలు ఎదుర్కొనే సమస్యల కంటే చాలా ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు మాట్లాడేందుకు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే ముగ్గురు నుండి నలుగురు కౌన్సెలర్లు మా వద్ద ఉన్నారు'' అని కుశాల్ చెప్పారు. క్రీడలు, కళలు, థియేటర్, మొత్తం సమగ్ర అభివృద్ధిపై పాఠశాల దృష్టి కేంద్రీకరించడం వల్ల పిల్లలు ప్రధాన స్రవంతి సమాజంలో తమను తాము మెరుగ్గా కలిసిపోయేలా చేస్తుంది. ''మురికివాడలో పెరుగుతున్న పిల్లల మానసిక క్షేమం గురించి ఎవరూ మాట్లాడరు. పిల్లవాడు వైకల్యం, మానసిక ఆరోగ్య గాయం లేదా ఆప్టిట్యూడ్ లేకపోవడంతో బాధపడటం లేదని ఎవరికైనా ఎలా తెలుసు. తమ పిల్లల ఎదుగుదలను రికార్డ్ చేయలేని, మైలురాళ్లను అర్థం చేసుకోలేని సంఘాల గురించి మేము మాట్లాడుతున్నాము. అందుకే మేము మానసిక శ్రేయస్సు, పిల్లల పోషకాహారం, చక్కటి నేర్చుకునే అనుభవం గురించి చాలా నొక్కిచెప్పాము'' అని సలోని జతచేస్తున్నారు.
పని చేయడానికి గొప్ప ప్రదేశం
''మేము మా ఉపాధ్యాయులు, అకడమిక్ బృందంతో వారి స్వీయ-సంరక్షణలో పని చేస్తాము. ఎందుకంటే తరచుగా వారిపై ప్రభావం చూపేది తరగతిలో జరిగేది కాదు. కానీ అతను/ఆమె తరగతిని విడిచిపెట్టినప్పుడు పిల్లలకి జరిగేది. అణగారిన వర్గాల కోసం పనిచేసే ఉపాధ్యాయులు సాధారణంగా ఇంట్లో కూడా అనేక ఒత్తిళ్ళను ఎదుర్కొంటుంటారు. మా అకడమిక్ టీమ్‌కి సంబంధించిన జోక్యాలు అటువంటి ఒత్తిళ్లను అధిగమించడానికి ఉద్దేశించబడ్డాయి'' అని సలోని చెప్పారు. గ్రేట్ ప్లేస్ టు వర్క్, వర్క్‌ప్లేస్ కల్చర్‌పై గ్లోబల్ అథారిటీ ద్వారా స్వచ్ఛంద సంస్థ స్థిరంగా ధృవీకరించబడింది. పాఠశాలలో ఇప్పటి వరకు సుమారు 59 మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. వీరిలో దాదాపు 49 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారు కూడా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. సౌత్ సిటీ, గురుగ్రామ్‌లోని పాఠశాల అసలు క్యాంపస్ లీజులో ఉండగా, గురుగ్రామ్‌లోని ధునెలాలో సెకండరీ విద్యపై దృష్టి సారించే రెండవ, పెద్ద క్యాంపస్ ముగింపు దశకు చేరుకుంది.
ప్రభుత్వ పాఠశాలలకు సహకారం
ఒక దాత బహుమతిగా ఇచ్చిన ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబడిన పాఠశాల, ప్రైవేట్ సంస్థలతో సమానంగా సౌకర్యాలతో సీబీఎస్ఇ అనుబంధంగా ఉంటుంది. గత సంవత్సరం నుండి పాఠశాల ఇ-లెర్నింగ్ మాడ్యూల్‌ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా ఉపాధ్యాయులు ఫౌండేషన్ స్ట్రీమ్ తరగతుల నుండి ప్రభుత్వ పాఠశాలలకు లేదా ఉపాధ్యాయులు అందుబాటులో లేని ఇతర ప్రభుత్వ పాఠశాలలకు చేరుకుంటారు. ఈ తరగతులు ఇప్పుడు జమ్మూ, రాజస్థాన్, ఒరిస్సా, ఎన్సీఆర్ ప్రాంతం, ఉత్తరాఖండ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. పాఠశాల త్వరలో మరిన్ని రాష్ట్రాలకు డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలను విస్తరించాలని యోచిస్తోంది.