Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధా వర్గీస్ జీవితం ప్రేమ, ధైర్యం, కరుణతో నిండి ఉంది. సమాజానికి ఎక్కడో దూరంగా నెట్టివేయబడిన అమ్మాయిలను ఈ విశాల ప్రపంచంలోకి ఆహ్వానించేందుకు తలుపులు తెరిచింది. విద్యాబుద్ధులే వారికి మంచి భవిష్యత్‌ను అందిస్తాయని నమ్మింది. అక్కడ పాఠశాలను ప్రారంభించి వారి జీవితాలకు కొత్త ఆరంభాన్ని ఇచ్చింది. అందుకుగాను పద్మశ్రీ సైతం అందుకున్న ఆమె జీవిత పరిచయం నేటి మానవిలో...
బీహార్‌లో ఆమె ప్రారంభించిన పాఠశాల కారిడార్‌లో కూర్చుని సుధా వర్గీస్ నవ్వుతున్నారు. ''బెదిరింపులు ఎదురైనపుడు కూడా నేను నా భయాన్ని బయటకు ప్రదర్శించను. ఈ వ్యూహం చాలా సంవత్సరాలుగా నాకు బాగా పనిచేసింది'' అంటూ ఆమె మెల్లగా చెప్పారు. 2005లో స్థాపించబడిన ఆ పాఠశాల సాధారణ విద్యాసంస్థ కాదు. బీహార్‌లో సామాజికంగా అత్యంత వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం స్థాపించినది. వారి కథలకు కొత్త ఆరంభాన్ని అందించడానికి అందుకు కావల్సిన సహాయం చేయడానికి దీనిని ఆమె ప్రారంభించారు.
వారి జీవితం ఆమెను ఆశ్చర్యపరిచింది
సుధ బీహార్‌లోని ముసాహర్ కమ్యూనిటీ సాధికారత కోసం తన జీవితంలో 30 ఏండ్లకు పైగా అంకితం చేశారు. ఈ ఆలోచన ఆమెలో 1960లో అంటే ఆమె యుక్తవయసులో ఉన్నప్పుడు మొలిచింది. ఆమె పాఠశాల లైబ్రరీలోని ఒక పత్రిక ఆమె దృష్టిని ఆకర్షించింది. ఇది ఆధునిక సమాజానికి చాలా దూరంగా ఉన్న, బీహార్‌లోని ముసహర్ల సమాజ భయంకరమైన జీవన పరిస్థితులను చూపించింది. 'ముసహర్' అనే పదానికి 'ఎలుక తినేవాళ్ళు' అనే అర్థం వస్తుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ ఆమె చూడలేదు. వారి తీవ్రమైన సామాజిక వెనుకబాటుతనం సుధను ఆశ్చర్యపరిచింది. ముసహర్ల పరిస్థితిని మెరుగుపరచడానికి ఆమె తన వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.
సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచి
1965లో ఆమె బీహార్‌కు వెళ్లి పేదలు, అణగారిన ప్రజల కోసం పనిచేశారు. ఆమె పాట్నాలోని నోట్రే డామ్ అకాడమీలో పని చేయడం ప్రారంభించారు. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలో ఇంగ్లీష్, హిందీ నేర్చుకున్నారు. 1986లో ఆమె తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసాహర్లతో కలిసి జీవించాలని, వారికి విద్యను అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆమె ఒక గ్రామానికి వెళ్ళి గుడిసెలో నివసించడం ప్రారంభించారు. ''వెనుకబడిన గ్రామానికి వెళ్ళి గుడిసెలో జీవించడం మొదట చాలా సవాలుగా ఉంది. వెళ్ళిన మొదటి రోజు రాత్రి భారీ వర్షం కురిసింది. గుడిసెలోకి నీరు రాకుండా నేను నిరంతరం వంట గిన్నెలతో నీటిని బయటకు పడేసేదాన్ని. అయితే నేను సిద్ధంగా ఉన్నాను. దీని కోసమే నేను వచ్చాను'' అంటూ ఆ నాటి పరిస్థితిని ఆమె గుర్తుచేసుకున్నారు.
వివక్షను ఎదుర్కొంటున్నారు
ముసహర్లతో జీవించడం సుధకు కొత్త జీవితాన్ని పరిచయం చేసింది. వారు పేదరికంతోనే కాదు శతాబ్దాల నాటి కులతత్వంపై కూడా పోరాడుతున్నట్టు ఆమెకు అర్థమైంది. ముసాహర్లు తమ జీవితంలోని ప్రతి దశలో వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి పాఠశాలల్లో ప్రవేశం లేదు, భూమి లేనిలేదు. పూట గడవడం కోసం పొలాలలో పనిచేస్తున్నారు. బాలికలు, మహిళలు తరచుగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
హక్కుల గురించి తెలియదు
మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా 1987లో సుధా నారీ గుంజన్ (మహిళల వాయిస్) అనే సంస్థను స్థాపించారు. దీనికి మహిళల నుండి మద్దతు లభించింది. అయితే ప్రారంభంలో మహిళలకు చట్టపరమైన హక్కుల గురించి తెలియదు. తమపై లైంగిక దాడులు జరిగినప్పుడు కేసు పెట్టవచ్చని కూడా వారికి తెలియదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటిది జ్ఞానం లేకపోవడం. ఎందుకంటే వారికి చదువు లేదు. మాట్లాడే హక్కు వారికి ఉందని ఎవరూ చెప్పలేదు. రెండవది సామాజిక నిర్మాణం. దీనిలో వారు దిగువన ఉంచబడ్డారు.
ఆధిపత్య వర్గంపై ఆధారపడుతున్నారు
''మన ఒక కుర్చీలో కూర్చుంటే, మన పక్కన ఓ ఖాళీ కూర్చీ ఉంటే వాళ్ళు దానిపై కూర్చోరు. నేలపై కూర్చోవడానికే ఇష్టపడతారు. అదే వారి స్థానం అనుకుంటారు'' అని సుధ చెప్పారు. సమాజంలో వారి స్థానం అట్టడుగున ఉందని, అలాగే ఉంటుందని వారు బలంగా నమ్ముతున్నారు. మూడవ కారణం వారు ప్రతి విషయానికి ఆధిపత్య వర్గంపై ఆధారపడటం. ఎందుకంటే వారు ధనికుల పొలాల్లో పని చేస్తారు. అందుకే వారికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పడానికి భయపడతారు. గ్రామంలో జరిగిన ఓ లైంగిక దాడి గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుందుకు సుధ వెళ్ళినపుడు 'ఇంత మురికి బట్టలు వేసుకున్న అమ్మాయిని ఎవరు రేప్ చేస్తారు?'' అని పోలీసు అధికారి నుండి సమాధానం వచ్చింది. అసలు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలంటే వారు భయపడతారు. పోలీసులు వారిని తీవ్రంగా కొడతారని భయం. సుధ లాయర్ కూడా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాడానికి సహాయపడ్డారు.
బెదిరించినా తగ్గలేదు
రెండేండ్లలోపు ఆమె తొమ్మిది లైంగిక దాడుల కేసులను నివేదించారు. ఇవన్నీ ఒకే ప్రాంతంలో జరిగాయని ఆమె చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అందుకే తన పని అంత తేలికైనది కాదని ఆమె అంటున్నారు. ''నన్ను గ్రామం నుండి వెళ్లగొట్టడానికి, ప్రజలను నాపై రెచ్చగొట్టడానికి ఆదిపత్య వర్గాల వారు ఎన్నో పన్నాగాలు పన్నారు. నన్ను చంపేస్తానని బెదిరించారు. ఏం జరిగినా అక్కడి నుండి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. అయితే తక్కువ కాలంలోనే మహిళల దృక్పథంలో గణనీయమైన మార్పును నేను గమనించాను. వారు తమ చట్టపరమైన హక్కుల గురించి మరింత తెలుసుకున్నారు. అలాంటి సంఘటనలపై ఫిర్యాదు చేయడానికి వారు ఇప్పుడు ఒంటరిగా పోలీస్ స్టేషన్‌కు వెతున్నారు. పోలీసులు వారి మాట పట్టించుకోకపోతే మేము వారికి సహాయం చేస్తాము'' ఆమె చెప్పారు
బాలికల విద్య కోసం
పెనుమార్పు తీసుకురావాలంటే ఈ అమ్మాయిలకు చదువు చెప్పాల్సిన అవసరం ఉందని సుధ భావించారు. వారు తమను తాము భిన్నంగా చూసుకునే పాఠశాల అవసరం. చదువుకునే అర్హత వారికీ ఉందని తెలుసుకున్నారు. సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని ఎలా సంపాదించాలో కనుగొన్నారు. అందుకే బీహార్‌లోని దానాపూర్‌లో 'ప్రేరణ' అనే రెసిడెన్షియల్ పాఠశాలను తెరవాలని ఆమె నిర్ణయించుకున్నారు. దళిత బాలుర వసతి గృహం కోసం 1988లో భవనానికి శంకుస్థాపన చేశారు. కానీ చాలా కాలం అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ స్థలంలో సగం పబ్లిక్ టాయిలెట్స్ కోసం సగం గేదెల షెడ్ కోసం కేటాయించబడిందని 2005లో ఆమెకు తెలిసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా విరాళాల మద్దతుతో 2006లో పాఠశాలను ప్రారంభించారు. ఇది 50 మంది బాలురు ఉండేలా రూపొందించబడింది. కానీ ఇప్పుడు పాఠశాలల్లో 150 మంది బాలికలు ఉన్నారు. ఇక్కడ చదువుకుంటున్న అమ్మాయిలు ఆ గ్రామంలో మొదటి తరం వారు. వారు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు కావాలని కోరుకుంటున్నారు.
జీవనోపాధి కార్యక్రమాలు
చదువుతోపాటు వారికి కరాటే, పెయింటింగ్, కళలు, చేతిపనులు కూడా నేర్పిస్తారు. గుజరాత్లో జరిగిన కరాటే పోటీల్లో ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించారు. వారు జపాన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొన్నారు. మహిళలకు జీవనోపాధి కార్యక్రమాల కోసం 'నారీ గుంజన'్ బీహార్‌లోని వివిధ జిల్లాల్లో పని చేస్తుంది. మహిళల కోసం బహుళ జీవనోపాధి ప్రాజెక్టులను అందిస్తోంది. నారీ గుంజన్ సర్గమ్లో మహిళా బ్యాండ్ అత్యంత విశిష్టమైనది. ఈ బృందం విస్తృతమైన ప్రశంసలు అందుకుంది.
మొదట సందేహించినప్పటికీ
''ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కొందరు మహిళలు ప్రదర్శనలు ఇవ్వడం చూశాను. వారు చేయగలిగినపుడు నా స్త్రీలు ఎందుకు చేయలేరు? కానీ వారు మొదట సందేహించినప్పటికీ తర్వాత అది పెద్ద విజయంగా మారింది. వారు ఇప్పుడు ఒక్కో ప్రదర్శనకు రూ. 2,000 వరకు సంపాదిస్తున్నారు. ఇది ఫీల్డ్‌లలో వారు పొందే దానికంటే చాలా ఎక్కువ'' అని సుధ చెప్పారు. బీహార్‌లో మద్య నిషేధం తర్వాత కిచెన్/హోమ్ గార్డెన్లను ప్రారంభించి అదనపు ఉత్పత్తులను విక్రయించాలని సంస్థ మహిళలకు సూచించింది. ఇది విజయవంతమైంది. ముసహర్ మహిళలు ఇతరుల పొలాల్లో కాకుండా తమ సొంత వ్యవసాయం చేయడం ప్రధాన మలుపు. ఉల్లి ఉత్పత్తి కొందరికి రూ. 5 లక్షల వరకు లాభం తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత కొన్నేండ్లలోనే మహిళలు తమ పేర్లతో భూములు కూడా కొనుగోలు చేశారు.
మార్పు తీసుకురావడమే లక్ష్యం
''నా మహిళలు చరిత్రను తిరగరాస్తున్నారు. ఇప్పుడు వారికీ సొంత భూమి వుంది. ఇది ఆరంభం మాత్రమే'' అని సుధ అంటుంటే ఆమె ముఖంలో ఆశ సజీవంగా ఉంది. నిజమైన సమానత్వాన్ని కోరుతూ ''సిర్ఫ్ హంగామా ఖదా కర్నా మేరా మక్సద్ నహీ, మేరీ కోషిష్ హై కి యే సూరత్ బదల్ని చాహియే (కేవలం హంగామా చేయడం నా ఉద్దేశ్యం కాదు, మార్పు తీసుకురావడమే నా ఉద్దేశ్యం. వారి పరిస్థితి మారాలి).'' ప్రసిద్ధ కవి దుష్యంత్ కుమార్ పద్యాన్ని పాడే అమ్మాయిల శబ్దం పాఠశాల గోడల నుండి ప్రతిధ్వనిస్తుంది. ఇది ప్రభుత్వానికి, సమాజానికి ఇంకా చాలా చేయవలసి ఉందని రిమైండర్‌గా పనిచేస్తుంది. మనం మనుషులను మనుషులుగా చూడగలిగినపుడు అక్కడ సమానత్వం ప్రారంభమవుతుంది'' అని సుధ చెప్పారు. ఈ సంఘాల భవిష్యత్ గత విషాదాలను నయం చేస్తుందని ఆమె ఆశిస్తున్నారు.
- సలీమ